ఏపీ: నెల్లూరు జిల్లా రాజకీయాల్లో రోజుకో సంచలనం చోటు చేసుకుంటుంది. నా ఫోన్ ట్యాప్ చేశారని సంచలన ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి బహిరంగంగానే వైసీపీపై విమర్శలు చేశాడు. ఈ క్రమంలో ఇప్పటికే అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారంపై హైకమాండ్ సీరియస్ అయింది. ఇక తాజాగా ఆయనకు సంబంధించి ఓ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఆడియోలో 'నేను వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి నెల్లూరు రూరల్ నుంచే పోటీ చేస్తాను. ఇక తన ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఆధారాలు ఉన్నాయని..వాటిని బయటపెడితే ఐపీఎస్ ఆఫీసర్ల ఉద్యోగాలు పోతాయి. దీనిపై కేంద్రం నుంచి జరుగుతుందని' ఉంది. ప్రస్తుతం ఈ వీడియో రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
వైసీపీ అధినాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో కోటంరెడ్డి..
ఇక వైసీపీ అధినాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి... పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కార్యకర్తలు, అనుచరులతో విడివిడిగా సమావేశమైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(Kotamreddy Sridhar Reddy).. వారి దగ్గర తన అభిమతాన్ని, ఆవేదనను వెల్లడించినట్టు సమాచారం. వైసీపీ అధిష్టానం కొత్త డ్రామాకు తెరలేపిందని కార్యకర్తలతో వ్యాఖ్యానించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో గిరిధర్ రెడ్డి వైసీపీ తరపున పోటీ చేస్తే తాను పోటీ చేయబోనని అన్నారు. తమ్ముడికి పోటీగా తాను నిలబడనని చెప్పారు. తాను రాజకీయాలకు గుడ్ బై చెబుతానని అన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని.. దీంతో తన మనోభావాలు దెబ్బతిన్నాయని కార్యకర్తలతో చెప్పుకొచ్చారు. అనుమానం ఉన్న చోట కొనసాగడం కష్టమని అన్నారు.
మరోవైపు నిన్న తనపై ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మూడు నెలల నుంచి తన ఫోన్ ట్యాప్(Phone Tapping) చేస్తున్నారని వెల్లడించారు. ఈ విషయం తనకు ముందే తెలుసని, రహస్యాలు మాట్లాడుకునేందుకు మరో ఫోన్ ఉందని, 12 సిమ్ లు కూడా ఉన్నాయని తెలిపారు. ఫేస్ టైమర్, టెలిగ్రాం కాల్స్‌ను మీ పెగాసస్ రికార్డు చేయలేదని... అధికార పార్టీ ఎమ్మెల్యేపై ముగ్గురు అధికారులతో నిఘా అవసరమా ? అని అన్నారు. నిఘా కోసం నా నియోజకవర్గంలో ఒక ఐపీఎస్ అధికారిని ఏర్పాటు చేసుకోండని వ్యాఖ్యానించారు. క్రికెట్ బెట్టింగ్(Cricket Betting) కేసులప్పుడు కూడా ఒక ఎస్పీ నాపై నిఘా పెట్టారని కోటంరెడ్డి వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలో కోటంరెడ్డి శ్రీధర్ అనుచరులతో చేసిన వ్యాఖ్యల ఆడియో ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhrapradesh, Ap, Kotamreddy sridhar reddy, Ycp