#MissionPaani | జల్ శక్తి అభియాన్‌తో జలసిరి కాపాడేందుకు అనంతపురం కృషి..

MissionPaani | ఈ వర్షాకాలంలో ప్రతీ నీటి బొట్టును వృథా పోనీయకుండా కాపాడుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

news18-telugu
Updated: July 3, 2019, 5:32 PM IST
#MissionPaani | జల్ శక్తి అభియాన్‌తో జలసిరి కాపాడేందుకు అనంతపురం కృషి..
అనంతపురం జిల్లాలో చెరువుల తవ్వకం ద్వారా జల సంరక్షణ
news18-telugu
Updated: July 3, 2019, 5:32 PM IST
ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర వర్షాభావంతో కరువుకు శాశ్వత చిరునామాగా మారిన రాయలసీమ జిల్లా అనంతపురంలో కొన్నేళ్లుగా చేపట్టిన జల సంరక్షణ విధానాలు జిల్లాకు ప్రాణాధారంగా మారాయి. కొన్నేళ్లుగా ప్రభుత్వాలు చేపట్టిన వ్యవసాయ చెరువుల తవ్వకాల ద్వారా భూగర్భ జలాలు కూడా పెరిగాయి. కానీ ఏటికేడాది వాటి స్ధాయి కాపాడుకోవడం ఇప్పుడు సవాలుగా మారింది. ఈసారి వర్షాకాలంలో వీటిని పూర్తిగా నింపడం ద్వారా మరో భగీరథ ప్రయత్నానికి అధికారులు సిద్ధమయ్యారు.
ఏపీలో అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటిగా, ప్రతీ ఏటా కరువు బాధిత జిల్లాగా ఉండే అనంతపురంలో భూగర్భ జలాలు పెంచేందుకు కొన్నేళ్లుగా జరుగుతున్న కృషి క్రమంగా మంచి ఫలితాలు అందిస్తోంది. అసలే వర్షాభావం తక్కువగా ఉన్న అనంతపురంలో ఏటికేడాది వ్యవసాయ చెరువుల తవ్వకం ద్వారా అధికారులు భూగర్భ జలాలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకూ లక్షకు పైగా వ్యవసాయ చెరువులను తవ్వడం ద్వారా ప్రభుత్వం భూగర్బ జలాలను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు కొంతమేర ఫలితాలు ఇస్తున్నాయి. దీంతో నిండు వేసవిలోనూ ఇక్కడి చెరువుల్లో జలసిరి కనిపిస్తోంది.

అనంతపురం జిల్లాలో చెరువుల తవ్వకం ద్వారా జల సంరక్షణ


అదే సమయంలో జాతీయ ఉపాధి హామీ, ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్ మేనేజ్ మెంట్ పథకాల కింద 1,217 చెక్ డ్యాముల నిర్మాణం ద్వారా ప్రతీ నీటి బొట్టును వృథాపోకుండా ఒడిసిపట్టారు. నీరు -చెట్టు పథకం కింద తవ్వించిన వేలాది కుంటలు, బావులు దీనికి అదనం. వ్యవసాయ చెరువులు, నీటి కుంటలు, బావుల తవ్వకం ద్వారా జిల్లాలో రెండేళ్ల క్రితం 11.67 టీఎంసీల భూగర్భ జలాలను కాపాడగలిగారు. దీంతో లక్ష ఎకరాలకు పైగా భూముల సాగు సాధ్యమైంది. అయితే ఈ స్ఫూర్తిని ప్రతీ ఏటా కాపాడుకోవడం ద్వారా భూగర్భ జలాల పెంపునకు కృషి చేయాల్సిన అవసరం కనిపిస్తోంది.



అనంతపురం జిల్లాలో ఎండిన పంటకుంట


ఈ ఏడాది అనంతపురం జిల్లాలోని 1,481 పెద్ద వ్యవసాయ చెరువుల్లో 1,355 ఎండిపోయాయి. మిగతా ట్యాంకుల్లోనూ నీటి పరిస్ధితి కాస్తో కూస్తో అన్నట్లుగా ఉంది. ఈ నేపథ్యంలో వర్షాకాలంలో ప్రతీ నీటి బొట్టును వృథా పోనీయకుండా కాపాడుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. జల సంరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత జల్ శక్తి అభియాన్ పథకాన్ని జిల్లాకు కూడా వర్తింప జేస్తున్నారు. దీని ద్వారా భూగర్భ జలాలను పెంచేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.

(సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్‌18)
First published: July 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...