Mission Paani: కరువు జిల్లాలో నీటి సంరక్షణకు ఊపిరి పోస్తున్న జలశక్తి అభియాన్

కరువు జిల్లాలో నీటి సంరక్షణకు ఊపిరి పోస్తున్న జలశక్తి అభియాన్

Mission Paani: కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన జల్ శక్తి అభియాన్ కింద ఈ జిల్లాలోని 26మండలాలను ఎంపిక చేశారు. వీటిలో తాడిపత్రి మండలంలోని నాలుగు గ్రామాలు ఉన్నాయి.

 • Share this:
  ఇంకుడు గుంతను పరిశీలిస్తున్న అధికారులు


  నిత్యం కరువుతో అల్లాడే అనంతపురం జిల్లాలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జలశక్తి అభియాన్ పథకం వాన నీటి సంరక్షణకు కొత్త ఊపిరిలూదుతోంది. ఫ్యాక్షన్ ప్రభావం ఎక్కువగా ఉండే తాడిపత్రి నియోజకవర్గంలోని యర్రగుంటపల్లిలో ప్రభుత్వం గత నెలలో చేపట్టిన ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం ఏపీలో కురుస్తున్న వర్షాలతో ఇంకుడు గుంతల్లో నీరు చేరుతోంది. దీంతో స్ధానికంగా ఉండే ఇళ్ల యజమానులు కూడా తమ ఇళ్లలో వీటిని నిర్మించాలని కోరుతున్నారు.రాయలసీమలో అత్యంత తక్కువ వర్షపాతం కలిగిన అనంతపురం జిల్లాలో అడుగడుగునా కరువు ఛాయలు కనిపిస్తుంటాయి. పంటల సంగతి దేవుడెరుగు, పశుగ్రాసం లభించడం కూడా కష్టమే. ఊర్లకు ఊర్లు ఎడారి వాతావరణాన్ని తలపిస్తుంటాయి. దీంతో ఇక్కడి జనం తిండి లేక ఉపాధి కోసం పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రానికి తరలిపోవడం సర్వసాధారణమవుతోంది.

  ఈ పరిస్ధితులను మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన జల్ శక్తి అభియాన్ కింద ఈ జిల్లాలోని 26మండలాలను ఎంపిక చేశారు. వీటిలో తాడిపత్రి మండలంలోని నాలుగు గ్రామాలు ఉన్నాయి. ఇవన్నీ నీటి వినియోగం అధికంగా ఉండటంతో పాటు భూగర్భ జలాలు అత్యధికంగా వినియోగిస్తున్నవే. ఆయా గ్రామాల్లో జిల్లా అధికారులు జల్ శక్తి అభియాన్ కింద ఉపాధి హామీ పథకం అండతో వాన నీటి సంరక్షణకు నడుం బిగించారు.తాడిపత్రి మండలంలో జల్ శక్తి పథకం కింద ఎంపికైన గ్రామాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నట్లు గుర్తించిన అధికారులు ముందుగా ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టారు. గత నెలలో చేపట్టిన ఇంకుడు గుంతల నిర్మాణాల్లో స్ధానికులతో పాటు విద్యార్ధులు కూడా పాల్గొని విజయవంతంగా పూర్తి చేశారు. వీటితో పాటు జల సంరక్షణ కోసం ఫారం పాండ్లను కూడా నిర్మిస్తున్నారు. వీటి పనులు కూడా పూర్తి కావస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో కురుస్తున్న వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు తాడిపత్రిలో నీటి కుంటలు ఎంతో ఉపయోగపడుతున్నాయి.

  ఇంకుడు గుంత నిర్మాణం


  పూర్తిగా సాంకేతిక విధానంలో నిర్మించిన ఇంకుడు గుంతలు స్ధానికులను ఆకర్షిస్తున్నాయి. పొలాల మధ్య ఏర్పాటు చేస్తున్న ఇంకుడు గుంతలతో భూగర్భజలాలు పెరిగితే బోర్ల ద్వారా వ్యవసాయం ఊపందుకుంటుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ ఇళ్లలోనూ ఇదే తరహాలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకునేందుకు వారు ఆసక్తి చూపుతున్నారు.జల్ శక్తి అభియాన్ కార్యక్రమం విజయవంతంగా సాగుతుండటం తాడిపత్రిలో ఉపాధి హామీ కూలీల జీవితాల్లోనూ సంతోషం నింపుతోంది. ఇంకుడు గుంతల నిర్మాణం చురుగ్గా సాగుతున్న నేపథ్యంలో తమకు ఉపాధి కూడా విరివిగా లభిస్తోందని కూలీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కరువు జిల్లా అనంతపురంలో జలసిరులు పండించేందుకు తమ వంతు సాయం చేస్తుండటం వారికి ఎంతో స్ఫూర్తినిస్తోంది. ఇంకుడు గుంతల నిర్మాణం ద్వారా నేర్చుకున్న పాఠాలను విద్యార్ధులు తమ పాఠశాలల్లోనూ అమలు చేస్తున్నారు. నీటి కుంటల నిర్మాణం తమకు ఎంతో క్రమశిక్షణ నేర్పిందని విద్యార్ధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు విద్యార్ధులు తాము తిన్న ప్లేట్లను కడిగే నీటిని సైతం చెట్లకు పోయడం ద్వారా జల వినియోగంపై అవగాహన పొందుతున్నారు.
  First published: