MINSTER GOUTHAM REDDY FUNERAL END CM JAGAN AND BARATHI ALSO PARTICIPATED GOUTHAM REDDY LAST JOURNEY NGS
Goutham Reddy Funeral: కన్నీటి సంద్రంగా నెల్లూరు.. గౌతమ్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్న సీఎం జగన్ దంపతులు
ముగిసిన అంత్యక్రియలు
Goutham Reddy Funeral: నెల్లూరు మొత్తం శోక సంద్రంగా మారింది. యువ నేత, మంత్రి.. వివాదరహితుడు.. నిత్యం చిరునవ్వుతో కనిపించే మేకపాటి గౌతమ్ రెడ్డి ఇక రారన్న విషయాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే సామాన్యుల నుంచి సెలబ్రీటీలు దాకా అంతా ఆయన అంత్యక్రియల్లో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు.
Goutham Reddy Funeral: మేకపాటి గౌతం రెడ్డి (Mekapati Goutham Reddy) అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో కన్నీటి వీడ్కోలు మధ్య పూర్తయ్యాయి. నెల్లూరు జిల్లా (Nellore District)లోని ఉదయగిరిలోని మేకపాటి ఇంజనీరింగ్ కాలేజీలో అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తరపున సీఎం వైఎస్ జగన్ (CM YS Jagan), మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు. ఉదయం నెల్లూరు నుంచి గౌతం రెడ్డి భౌతిక కాయాన్ని ప్రత్యేక వాహనంలో ఉదయగిరి వరకు రోడ్డు మార్గం ద్వారా తీసుకొచ్చారు. ఈ అంతిమ యాత్రలో నేతలు, మంత్రులతో పాటు వైసీపీ (YCP) కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక స్థానిక ప్రజలైతే చివరి చూపుకోసం భారీగా వచ్చి.. అంతిమ యాత్రలో పాల్గొని కన్నీటి వీడ్కోలు తెలిపారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ సతీ సమేతంగా ఉదయగిరికి చేరుకొని దివంగత మేకపాటి గౌతం రెడ్డికి నివాళులు అర్పించారు. తరువాత జరిగిన అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
భారీ జన సందోహం మధ్య సాగిన అంతిమయాత్రలో సీఎం జగన్ దంపతులు కూడా పాల్గొన్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి స్వగ్రామమైన బ్రాహ్మణపల్లి మీదుగా అంతిమయాత్ర కొనసాగింది. బుచ్చి, సంగం, నెల్లూరి పాలెం గ్రామాల మీదుగా ఆయన అంతిమయాత్ర కొనసాగింది. దారి పొడువున పాల్గొన్న ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన భౌతికకాయాన్ని చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా విచ్చేశారు. కన్నీటి పర్యంతం అవుతూ.. నివాళులర్పించారు. తరువాత అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగించారు. ఉదయగిరి ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో గౌతమ్ రెడ్డి కుమారుడు కృష్ణార్జున రెడ్డి దహన సంస్కారాలు నిర్వహించారు.
ఆయన తుది శ్వాస వరకు రాష్ట్రం కోసమే పని చేశారని.. చివరిగా రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు దుబాయ్ వెళ్లారని.. వెళ్లిన పనిని విజయవతంగా ముగించుకుని ఏపీకి భారీ పెట్టుబడ్డులు వచ్చేలా చేశారు. ఆ ఆనందాన్ని పూర్తిగా అందరితోనూ షేర్ చేసుకోక ముందే ఊహించని విషాదం చోటు చేసుకుంది. దుబాయ్ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న ఆయన.. కాసేపటికే ఓ వివాహ వేడుక కోసం నెల్లూరు వచ్చారు. కాసేపటికే తిరిగి హైదరాబాద్ రిటన్ అయ్యారు.
ఉదయాన్ని లేచిన ఆయన.. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఈ విషయం తెలిసిన వెంటనే తెలుగు రాష్ట్రాల ప్రజలు షాక్ కు గురయ్యారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులు మేకపాటి గౌతమ్ రెడ్డి పార్థీవ దేహానికి నివాళులర్పించారు. సీఎం జగన్ దంపతులు కూడా హైదరాబాద్ కు చేరుకుని ఘనంగా నివాళులర్పించారు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, ఇతర టీడీపీ సభ్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.