ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో విద్యుత్ సంక్షోభం (AP Power Crisis) తీవ్రచర్చనీయాంశమవుతున్న సంగతి తెలిసిందే. పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ఇష్టానుసారంగా విద్యుత్ కోతలు (AP Power Cuts) విధిస్తుండటంతో జనం ప్రభుత్వంపై మండిపడుతున్నారు. విద్యుత్ కొరత తీవ్రంగా ఉండటంతో ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరిట గంటల కొద్దీ కరెంట్ కోతలు విధిస్తున్నారు. ఐతే ఈనేపథ్యంలో విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. మరో పది రోజుల్లో అంతా సర్దుకుంటుందని మంత్రి చెప్పారు. నెలాఖరుకల్లా విద్యుత్ కోతలకు చెక్ పడే అవకాశముందన్నారాయన. ఈనెల 18న విద్యుత్ సంస్థల అధికారులతో జరిగే సమావేశం తర్వాత దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశముంది.
విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం విద్యుత్ కొరతపై పెద్దిరెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీలో తాజాగా 208 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండగా ఏపీ జెన్‌కో నుంచి 71 మిలియన్ యూనిట్లు, కేంద్ర విద్యుత్ ఉత్పాదక సంస్థల నుంచి 40 మిలియన్ యూనిట్లు, జల విద్యుత్ కేంద్రాల నుంచి 6.6 మిలియన్ యూనిట్లు, సోలార్ పవర్ ప్లాంట్ల నుంచి 24 ఎంయూ, విండ్ పవర్ 16 ఎంయూ, హిందుజా 9.4 ఎంయూ, ఇతర ఉత్పత్తి కేంద్రాల ద్వారా 4 ఎంయూ, ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి దారుల నుంచి 11 ఎంయూల చొప్పున మొత్తం 182 మిలియన్ యూనిట్లు సమకూరుతోంది. మరో 26 మిలియన్ యూనిట్లను బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు వివరించారు.
ఈ నెల 25నాటికి విద్యుత్ సరఫరా మెరుగుపడే అవకాశాలున్నందున కరెంట్ కోతలు తగ్గుతాయని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో తగినంత విద్యుత్ దొరకని పరిస్థితులున్నా రాష్ట్రంలోని గృహ వినియోగదారులకు వీలైనంత మేర నాణ్యమైన కరెంట్ ఇస్తున్నామని ఆయన వెల్లడించారు. విద్యుత్ కొరత దృష్ట్యా పగటిపూట వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ సరఫరా చేస్తుండగా.. మే 1 నుంచి 9 గంటల పాటు విద్యుత్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వ్యవసాయం, గృహ వినియోగదారులే తమకు ముఖ్యమన్న మంత్రి.. విద్యుత్ రంగానికి రెండున్నరేళ్లలో రూ.35 వేల కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు.
గత 10 రోజులుగా రాష్ట్రంలో విద్యుత్ కొరత కారణంగా కరెంట్ కోతలు ఎక్కువయ్యాయి. రాత్రిళ్లు విద్యుత్ లేక జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు విద్యుత్ కొరత కారణంగా పరిశ్రమలకు ప్రభుత్వం పవర్ హాలిడే ప్రకటించింది. ఆదివారం కాకుండా అదనంగా మరో రోజు పవర్ హాలిడే విధించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Peddireddy Ramachandra Reddy, Power cuts