‘మేం బ్రహ్మాండంగా పనిచేశామని మమ్మల్ని పొగడక్కర్లేదు.. జరిగిన వాస్తవాలు చెబితే చాలు.. టీడీపీ చివరకు ప్రతిపక్ష పార్టీ కాకుండా జూమ్ పార్టీ అయిపోయింది. టీడీపీ నేతలు ప్రజల్లోకి రారు. ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లరు. కరోనా వస్తే దోచుకున్న దాన్ని సాయం చేసేందుకు ఒక్కరూపాయి బయటకు తీయరు.’ అంటూ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరగగానే ముఖ్యమంత్రి జగన్ తక్షణమే విశాఖకు వచ్చి బాధితులను పరామర్శించారు. వారికి భరోసా ఇచ్చి మంత్రులను ఇక్కడే ఉండి పర్యవేక్షించమని ఆదేశాలిచ్చారని తెలిపారు. ఐదురోజుల్లో సమస్యను నార్మల్ స్టేజ్‌కి తీసుకువచ్చారని, అదే టిడిపి ఉంటే 50 రోజులు పట్టేదని, ఎందుకంటే వారికి కావాల్సింది పబ్లిసిటీ అంటూ చమత్కరించారు.
ఆ ప్రాంతంలో సాంకేతికపరంగా అధికారుల సూచనల మేరకు విషవాయువు తీవ్రత తగ్గి, అక్కడ ఇబ్బందిలేదని నిర్ధారించాక ప్రజలను ఆ గ్రామాలకు తీసుకువెళ్లామని గుర్తు చేశారు. రెండురోజులుగా బాధిత గ్రామాల్లో సాధారణ స్దితి ఉందని, అక్కడి వారికి ధైర్యం ఇచ్చేందుకు మంత్రులు, అధికారులు కూడా అక్కడే బసచేశారని మంత్రి బొత్స పేర్కొన్నారు. రేపటితో గ్రామాల్లో సర్వే పూర్తవుతుందని, గ్రామాల్లోని ఇళ్లల్లో సరుకులు తినేందుకు ఉపయోగించకూడదని, ఆహారం వండుకునేందుకు ఇబ్బందులు ఉన్నందున నిపుణులు చెప్పిన నేపథ్యంలో పరిహారం ఇచ్చేవరకు కూడా భోజన ఏర్పాట్లు కొనసాగించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని వివరించారు.
ప్రమాదంలోని బాధితుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాబోయేకాలంలో ఏవిధమైన ఆరోగ్యసమస్యలు వచ్చినా పూర్తిగా బాధ్యత వహించేలా కార్యక్రమాన్ని రూపొందించినట్టు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఎల్జీపాలిమర్స్ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడిన విషయాన్ని కూడా వక్రీకరించి మాట్లాడుతున్నారు. అందరి ఎదుట కంపెనీ ప్రతినిధులతో మాట్లాడిన మాటలను టీడీపీ నాయకులు తప్పుగా దుష్ప్రచారం చేయడంపై బాధ అన్పిస్తోందన్నారు.
Published by:Narsimha Badhini
First published:May 14, 2020, 15:32 IST