ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం కొత్త జిల్లాల (AP New Districts) ఏర్పాటు ప్రకటన తర్వాత చాలా చోట్ల నిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. కృష్ణా జిల్లా (Krishna District) విభజన విషయంలోనూ అలాంటి వివాదాలు రాజుకున్నాయి. ముఖ్యంగా విజయవాడకు ఎన్టీఆర్ జిల్లాగా పేరుపెట్టడం సరికాదంటూ టీడీపీ నేత బొండా ఉమా చేస్తూ దీక్షకు కూడా దిగారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని.. విజయవాడకు వంగవీటి రంగా పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో మంత్రి కొడాలి నానికి, టీడీపీ నేతలకు మధ్య మాటల తూటాలు పేలాయి. ఐతే ప్రభుత్వం మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తాజాగా మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో నందమూరి కుటుంబ సభ్యులు, నందమూరి కుటుంబ సన్నిహితులు, నిమ్మకూరు గ్రామస్తులు సీఎం జగన్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాకు నందమూరి తారక రామారావు పేరు పెడతామంటూ పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నందుకు సీఎంను కలిసినట్లు నిమ్మకూరు ప్రజలు తెలిపారు. ఇటీవల టీడీపీ నుంచి వచ్చిన విమర్శల నేపథ్యంలో వారికి చెక్ పెట్టేందుకు నందమూరి ఫ్యామిలీతో పాటు, నిమ్మకూరుకు చెందిన వారిని కూడా మంత్రి కొడాలి నాని సీఎం దగ్గరకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో విజయవాడకు ఎన్టీఆర్ పేరుపెట్టడాన్ని నిమ్మకూరు ప్రజలు స్వాగతిస్తున్నారన్న సందేశాన్ని జిల్లా వాసుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
సీఎంతో సమావేశంలో మంత్రి కొడాలి నానీతో పాటు పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్, నందమూరి పెద వెంకటేశ్వరరావు, నందమూరి జయసూర్య, చిగురుపాటి మురళీ, పలువురు స్ధానికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎంకు జ్ఞాపికనిచ్చి సందర్శించారు.
జిల్లాపై వివాదం ఇదీ..
కృష్ణా జిల్లాలో ఉన్న రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు మచిలీపట్నం, విజయవాడలను రెండు జిల్లాలుగా చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. వీటిలో మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో ఏర్పడిన జిల్లాకు కృష్ణా జిల్లా పేరునే కొనసాగించిన ప్రభుత్వం.. విజయవాడ లోక్ సభ నియోజకవర్గంతో ఏర్పడే జిల్లాకు ఎన్టీఆర్ పేరుపెట్టింది. దీనిపై దివంగత నేత వంగవీటి రంగా అభిమానులు, మిత్రులు, కాపు నేతలు, ఇతర సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు మచిలీపట్నం పరిధిలో ఉన్నందున ఆ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని.. విజయవాడకు వంగవీటి రంగా పేరు పెట్టాలన్న డిమాండ్లు తెరపైకి వచ్చాయి. వంగవీటి రంగా జిల్లా కోసం ఇప్పటికే నిరసన దీక్షలు కూడా చేపట్టారు. టీడీపీ నేత బొండా ఉమా కూడా వంగవీటి జిల్లా కోసం డిమాండ్ చేశారు. ఐతే కాపు, కమ్మ కులాల మధ్య చిచ్చుపెట్టేందుకే చంద్రబాబు ఇలాంటి దీక్షలు చేయిస్తున్నారని మంత్రి కొడాలి నాని ఆరోపించడంతో జిల్లా రాజకీయం వేడెక్కింది. ఈ నేపథ్యంలో నందమూరి కుటుంబానికి చెందిన వారిని, నిమ్మకూరు గ్రామస్తులను ఏకంగా సీఎం దగ్గరకు తీసుకెళ్లిన కొడాలి నాని.. ఆ విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారని జిల్లాలో చర్చ జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.