పవన్ కల్యాణ్ (Pawan Kalyan) భీమ్లా నాయక్ (Bheemla Nayak) రిలీజ్ సందర్భంగా టికెట్ల ధరలు, బెనిఫిట్ షోలపై వివాదం రేగిన సంగతి తెలిసిందే. పవన్ పై ప్రభుత్వం కక్ష సాధింపుకు పాల్పడుతోందంటూ జనసేన (Janasena) తో పాటు టీడీపీ (TDP) కూడా వైసీపీ (YSRCP) సర్కార్ పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ కావాలనే ఇలా చేస్తున్నారని ఆరోపించాయి. దీనికి వైసీపీ నుంచి మంత్రి పేర్ని నాని గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తాజాగా మంత్రి కొడాలి నాని కూడా తనదైన శైలిలో చంద్రబాబు, పవన్ పై విమర్శలు గుప్పించారు. ఐతే భీమ్లా నాయక్ విషయంలో పవన్ కంటే చంద్రబాబునే ఎక్కువ టార్గెట్ చేశారు కొడాలి నాని. పవన్ కల్యాణ్.. చంద్రబాబు ఉచ్చులో పడుతున్నారు. జగన్ ని అధికారంలో నుంచి దించాలని ఎదో రకంగా తగాదాలు పెట్టి ఒక గుంపు ప్రయత్నిస్తోందని.. చంద్రబాబు చేసే ప్రయత్నాల్లో మీరంతా బలిపశువులు కావద్ది పవన్ కు హితవు పలికారు.
ప్రభుత్వం భీమ్లా నాయక్ కి కొత్తగా ఎటువంటి షరతులు పెట్టలేదని.. అఖండ, పుష్ప సినిమాలకు అదే నిబంధనలు ఉన్నాయని కొడాలి నాని స్పష్టం చేశారు. జగన్ కి సన్నిహితుడు నాగార్జున సినిమాకి కూడా అదే రూల్ అమలైందన్నారు. సినిమా పరిశ్రమ ఈ రకంగా తయారు కావడానికి చంద్రబాబు కారణం కదా అని ప్రశ్నించిన కొడాలి నాని.. కమిటీ వేసి నిర్ణయం తీసుకోమంటే వేయకుండా టికెట్లతో దోచుకుంటుంటే దృతరాష్ట్రుడిలా చూస్తూ కూర్చున్నారని ఎద్దేవా చేశారు. ఈ రోజు పవన్ మీద ప్రేమ చూపుతున్నవారంతా తోడేళ్లలా ముసుగు వేసుకొని ఆయనపై ప్రేమ చూపిస్తున్నారని.. జగన్ ను పవన్ ఏదో చేశాడంటూ కథలు అల్లుతున్నారని నాని విమర్శించారు. ఒక ద్రోహికి పవన్ సహకరించడం దురదృష్టకరణని మంత్రి అన్నారు.
సినిమా టికెట్ల విషయంలో కోర్టు ఒక కమిటీని నియమించమని చెప్పిందని.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవో ఇవ్వాల్సిన అవసరముందన్నారు. ఇవన్నీ భీమ్లా నాయక్ ప్రొడ్యూసర్స్ కి, పవన్ కు తెలసున్న కొడాలి నాని.. తల్లి లాంటి సినిమాని కూడా రాజకీయాలకు ఉపయోగిచుకుంటున్నారు విమర్శించారు. చంద్రబాబు మీ వెల్ విషెర్ అనుకుని నువ్వు ముందుకు వెళితే పవన్ కే నష్టమని.., వాళ్ళ మాటలు విని ముఖ్యమంత్రిపై ద్వేషం పెంచుకోవద్దని హితవు పలికారు. చిరంజీవి, ఆయన సతీమణి ని గుమ్మంలో నిలబడి జగన్ దంపతులు ఆహ్వానించింది పవన్ మర్చిపోయాడా..? సంక్రాంతికి చిరంజీవిని కారు ఇంట్లోకి తీసుకెళ్లి గౌరవించారు.. భారతమ్మ వడ్డించింది అని చిరంజీవి చెప్పింది వినలేదా..? అని కొడాలి నాని ప్రశ్నించారు.
ఇక సినీ ప్రముఖులను జగన్ అవమానించారంటూ వచ్చిన వార్తలను కూడా కొడాలి నాని ఖండించారు. క్యాంప్ ఆఫీసులోకి కార్లు వెళ్లవని.. తాము కూడా సెక్యూరిటీ చెక్ అయ్యాకే లోపలికి వెళ్తామన్నారు. చిరంజీవి అందరినీ గౌరవిస్తారని.. సీఎం స్థానంలో తల్లిలా ఇండస్ట్రీ కి మేలు చేయమని కోరారని.. దానిని కూడా రాజకీయం చేస్తున్నారన్నారు. పవన్ కల్యాణ్ 420 గాళ్ల ఉచ్చులోపడొద్దని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రేమ నటిస్తున్న వాళ్ళని నమ్మి మోసపోవద్దని పవన్ కు సూచించారు. సీపీఐ నారాయణ ఒక వింత జంతువు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ ఈ దేశంలోనే పొలిటికల్ మెగాస్టార్ అని.. మిగిలిన రాజకీయ పార్టీలు విలన్స్, కమెడియన్స్ గా మిగిలిపోతారని ఎద్దేవా చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.