ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh) ప్రభుత్వం ప్రకటించిన కొత్త జిల్లాల (AP New Districts) వ్యవహారంలో ప్రతిపక్ష టీడీపీ (TDP) అనవసర రాద్దాంతం చేస్తోందని మంత్రి కొడాలి నాని (Minister Kodali Nani) విమర్శించారు. ఈ అంశంలో టీడీపీ నేతలు కోడి గుడ్డుపై ఈకలు పీకుతున్నారని ఎద్దేవ చేశారు. పనిలో పనిగా బాలకృష్ణపైనా నాని ఫైర్ అయ్యారు. హిందూపురంని జిల్లా హెడ్ క్వార్టర్ చేయలేదని బాలకృష్ణ విమర్శిస్తున్నారని.. పుట్టపర్తి అందరికీ మధ్యలో ఉంటుందనే అక్కడ పెట్టామన్నారు. అమరావతి రాష్ట్రానికి మధ్యలో ఉంది ఇక్కడే ఉంచాలి అంటున్న బాలకృష్ణకు.. అదే ఫార్ములా హిందూపూర్ కి వర్తించదా..? అని నాని ప్రశ్నించారు. ఇక కృష్ణా జిల్లా విషయంలో టీడీపీ నేతలు చేస్తున్న దీక్షలు, విమర్శలకు కొడాలి నాని తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే అందుకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు దీక్షలు చేస్తున్నారని కొడాలి నాని మండిపడ్డారు. ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా దీక్షలు చేస్తుంటే చంద్రబాబు గుడ్డి వాడిలా మౌనంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ బ్రతికుండగానే వెన్నుపోటు పొడిచారు.. ఇప్పుడు చనిపోయాక కూడా వెన్నుపోటు పొడుస్తున్నారని ఆరోపించారు.
ఎన్టీఆర్ మచిలీపట్నం పార్లమెంట్ లో పుట్టారు.. రంగా కాటూరులో పుట్టారు.. ఇద్దరిది మచిలీపట్నం పార్లమెంట్ లొనే ఉందని నాని గుర్తు చేశారు. జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని జగన్ పాదయాత్ర సమయంలో నిమ్మకూరు వెళ్లిన సమయంలో అక్కడి ప్రజలు అడిగారని.. అప్పట్లో జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడ్డారని నాని అన్నారు. విజయవాడ పేరున్న ప్రాంతం కనుక ఎన్టీఆర్ పేరు పెడితే.. టీడీపీ నేతలు మాత్రం తీసేయాలంటున్నారని ఆయన మండిపడ్డారు.
రంగాపై టీడీపీకి ప్రేమ ఉంటే చంద్రబాబు అధికారంలో ఉండగా ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్, రంగాలను ఇద్దరిని చంపింది ఈ చంద్రబాబు అండ్ కో నే అన్న కొడాలి నాని.. మళ్ళీ ఇద్దరి ఫోటోలు పెట్టి దండలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాకు రంగా పేరు పెట్టించుకోవాలని వంగవీటి రాధాకి ఉంటే మచిలీపట్నంకి పెట్టాలని ఆయన కోరేవారని నాని అభిప్రాయడ్డారు. జిల్లా వి,యంలో కమ్మ కాపు కులాలపై మళ్ళీ వివాదాలు సృష్టించాలని చంద్రబాబు, టీడీపీ నేతలు చూస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ఇక టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్టుపైనా కొడాలి నాని స్పందించారు. అశోక్ బాబు నీతివంతుడు నిజాయితీపరుడంటూ టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని.., కానీ ఆయన మాత్రం ఇంటర్ చదివి డిగ్రీ చదివినట్టు దొంగ సర్టిఫికెట్ పెట్టి ప్రమోషన్ కొట్టేసాడని ఆరోపించారు. వేరొకరికి రావాల్సిన ఉద్యోగం కొట్టేయడం తప్పుకాదా..? అని ప్రశ్నించారు. రాష్ట్ర విడిపోతే ఉద్యోగ సంఘాల ముసుగులో చంద్రబాబు అనుకూలంగా పని చేసారని.., ఈ కేసుని ఎన్నికల సంఘం పరిశీలించి లోకాయుక్త కి ఇస్తే.. లోకయుత్త సిఐడి కి ఇచ్చిందని కొడాలి నాని గుర్తుచేశారు. అసలు అశోక్ బాబుపై కేసు పెట్టింది సహా ఉద్యోగే అని.. దీనికి వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో టీడీపీ నేతలు ఒళ్లు తగ్గరపెట్టుకొని మాట్లాడాలని కొడాలి నాని హెచ్చరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP new districts, Chandrababu Naidu, Kodali Nani