గుడివాడ క్యాసినో (Guidivada Casino Issue) వ్యవహారంపై రాజకీయం మరింత ముదురుతోంది. అటు ప్రతిపక్షాలు ఇటు మంత్రి కొడాలి నాని (Minister Kodali Nani) ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. టీడీపీ (TDP), బీజేపీ (BJP) నేతల కామెంట్స్ కు కొడాలి నాని తనదైన శైలిలో కౌంటర్ ఇస్తున్నారు. గుడివాడలో ఏదో జరిగిపోయిందంటూ టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారం ట్రాప్ లో బీజేపీ నేతలు పడుతున్నారని కొడాలి నాని అన్నారు. సోము వీర్రాజు.. టీడీపీ ప్రచారం నుంచి బయటకురావాలన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న గోవాలో క్యాసినోలు నిర్వహిస్తున్నారని.. ముందు అక్కడికెళ్లి నిలదియాలన్నారు. అక్కడ క్యాసినోలు ఎందుకు బ్యాన్ చేయలేదో చెప్పాలన్నారు. సోము వీర్రాజు.. టీడీపీ అజెండాను భుజానికెత్తుకున్నారని విమర్శించారు. బీజేపీని టీడీపీ బీ గ్రూప్ గా తయారు చేయొద్దని హితవు పలికారు. సోము వీర్రాజు దగ్గర పాఠాలు నేర్చుకొని డిపాజిట్లు కోల్పోయే స్థితికి రాలేమన్నారు.
ఓ మంత్రిమీద ఆరోపణలు చేసేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలన్నారు. తామేమీ మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయడం లేదన్నారు. సోము వీర్రాజు డ్రెసింగ్, స్టైల్, ఆహార్యం అంతా బావుటుందని.. కానీ ఆయన మెదడులోనే సమస్య ఉందని.. దాన్ని బాగుచేయించుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు. సోము ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే బీజేపీ పరిస్థితి మెరుగు పడుతుందన్నారు.
ఇక టీడీపీ నేత వర్ల రామయ్య.. కొడాలి నానిని లాకప్ లో వేసి కుమ్మారన్న బుద్ధా వెంకన్న కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు. వర్ల రామయ్య పోలీస్ గా గుడివాడలో పనిచేసిన సయమంలో తాను స్కూల్లో చదువుకుంటున్నానని.. అప్పుడు నన్ను ఎలా లాకప్ లో వేసి కొడతారని కొడాలి నాని ప్రశ్నించారు. చంద్రబాబు.. చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఎలాంటి అనుమతులు లేకుండా జూదశాలలు నిర్వహించిన ఘనత ఆయనదన్నారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్ నిందితులతో తనపై ఆరోపణలు చేస్తున్నారని కొడాలి నాని అన్నారు. విజయవాడలో కాల్ మనీ, సెక్స్ రాకెట్ బాధితులు త్వరలోనే పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నారని.. ప్రతి ఒక్కరికీ బడిత పూజ ఉంటుందని కొడాలి నాని హెచ్చరించారు.
చంద్రబాబు నేర చరిత్ర గురించి గంట గంటకు మాట్లాడటానికి తాను సిద్ధంగా ఉన్నానని కొడాలి నాని ఛాలెంజ్ చేశారు. చంద్రబాబు గతం గురించి ఆధారలతో సహా ప్రజల ముందు పెట్టకపోతే తనపేరు కొడాలి నాని కాదని సవాల్ చేశారు. దీనిపై చంద్రబాబు ఎక్కడ చర్చపెట్టినా అక్కడికి రావడానికి తాను సిద్ధమని స్పష్టం చేశారు.
2019లో తాను మంత్రినయ్యానని.. కానీ కే కన్వెన్షన్ సెంటర్ 2010లో నిర్మించానన్నారు. తొలుత కే కన్వెషన్ అంటూ ప్రచారం చేసిన టీడీపీ నేతలు.. ఆ తర్వాత గుడివాడ అంటూ మాట మార్చారన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే గవర్నర్, రాష్ట్రపతి, జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. టీడీఎల్పీ కార్యాలయంలో పేకాట ఆడిన చరిత్ర చంద్రబాబుదని.. ఆయన్ను ఎన్టీఆర్ చెప్పుతో కొట్టారని నందమూరి కుటుంబ సభ్యులే చెప్పారని సంచలన ఆరోపణలు చేసారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Chandrababu Naidu, Kodali Nani, Somu veerraju