అమరావతిపై సందిగ్థత బొత్సకు రాజకీయంగా మేలు చేసిందా?

Andhra Pradesh : కేబినెట్‌లో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ వివాదాస్పదంగా మారిన రాజధాని మార్పు వ్యవహారంపై అసలు విషయం చెప్పకుండానే దూకుడుగా ముందుకు వెళ్లిపోతున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: September 13, 2019, 10:20 AM IST
అమరావతిపై సందిగ్థత బొత్సకు రాజకీయంగా మేలు చేసిందా?
వైఎస్ జగన్, బొత్స సత్యనారాయణ
  • Share this:
ఏపీ రాజధానిగా అమరావతి ఉంటుందా లేదా అన్న ప్రశ్న బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న ప్రశ్న కంటే ఎక్కువ ఉత్కంఠ రేపుతున్న వేళ... ఈ మొత్తం వ్యవహారాన్ని తెరపైకి తెచ్చిన పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ ఒక్కసారిగా ప్రభుత్వంలో హీరోగా మారిపోయారా? రాజధాని మార్పు ప్రచారంపై విపక్షాలతో పాటు రైతుల నుంచి ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటుండగా... అసలు అమరావతి తేనెతుట్టెను కదిపిన బొత్స మాత్రం అందుకు తగ్గ మైలేజీ సాధించారన్న ప్రచారం సాగుతోంది. సీఎం జగన్ రాజధానిపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం నిజంగానే బొత్సకు కలిసి వస్తోంది. అందుకే జనసేనాని పవన్ సైతం జగన్ కంటే బొత్సను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.

జగన్ సర్కారులో ఏ నిర్ణయం తీసుకుంటే ఏం ముప్పు వస్తుందో అని అమాత్యులు ఆచితూచి వ్యవహరిస్తునన్న వేళ... కేబినెట్‌లో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం వివాదాస్పదంగా మారిన రాజధాని మార్పు వ్యవహారంపై అసలు విషయం చెప్పకుండానే దూకుడుగా ముందుకు వెళ్లిపోతున్నారు. కృష్ణానది వరదల తర్వాత రాజధానిగా అమరావతి ఏమాత్రం అనుకూలం కాదంటూ మొదలుపెట్టిన బొత్స... అమరావతిపై త్వరలోనే నిర్ణయం ఉంటుందంటూ ఎప్పటికప్పుడు ఊరిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. రాజధానిపై కేబినెట్‌లోని తన సహచరులు సైతం ఒక్కమాట కూడా మాట్లాడేందుకు సాహసించని పరిస్ధితుల్లో బొత్స మాత్రం తనదైన శైలిలో చెలరేగిపోతున్నారు. అమరావతి వరదల దృష్ట్యా సురక్షితం కాదంటూ బొత్స తొలిసారి మాట్లాడినప్పుడు అదే చివరిసారి అవుతుందని అంతా భావించారు. కానీ ఆ తర్వాత కూడా ఈ మాజీ పీసీసీ ఛీఫ్ తన మాటల గారడీని కొనసాగిస్తున్నారు.

రాజధానిపై ప్రభుత్వం నేరుగా స్పందించేందుకు సిద్ధపడని పరిస్ధితుల్లో పురపాలక శాఖ మంత్రిగా, కేబినెట్‌లో సీనియర్‌గా బొత్స చేస్తున్న ప్రకటనలు ఆషామాషీ వ్యవహారం కాదనే వాదన వినిపిస్తోంది. రాజధానిపై సీనియర్ మంత్రిగా బొత్స కాకుండా మిగతా వాళ్లు మాట్లాడితే వివాదం ఏ మలుపు తిరుగుతుందోనన్న ఆందోళన ప్రభుత్వంలో కనిపిస్తోంది. అందుకే సత్తిబాబుకు మాత్రమే కొన్ని షరతులపై రాజధానిపై మాట్లాడేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు కనిపిస్తోంది. బొత్స వ్యాఖ్యల వెనుక ప్రభుత్వమే ఉందన్న వాదన కూడా బలపడుతోంది. కీలకమైన రాజధాని వ్యవహారంపై సీఎంగా జగన్ మాట్లాడకపోవడం, అదే సమయంలో బొత్స దూకుడుగా చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే ప్రభుత్వమే ఆయనతో ఈ ప్రకటనలు చేయిస్తుందన్న భావన సాధారణ జనంలోనూ వ్యక్తమవుతోంది.

రాజధాని అమరావతి మార్పు తథ్యమన్న అర్ధం వచ్చేలా బొత్స ప్రారంభించిన మాటల యుద్ధం ఓ దశలో బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ నాలుగు రాజధానుల వాదనతో మరో మలుపు తిరుగుతుందని అంతా భావించారు. బీజేపీ హైకమాండ్ కావాలనే జగన్ ప్రభుత్వంపై మైండ్ గేమ్‌లో భాగంగా ఈ వ్యవహారాన్ని మలుపు తిప్పేలా టీజీతో ఈ వ్యాఖ్యలు చేయించి ఉండొచ్చని కూడా భావించారు. కానీ అదంతా ఒట్టిదేనని బొత్స ఆ తర్వాత తన వ్యాఖ్యలతో స్పష్టం చేశారు. బీజేపీ మైండ్ గేమ్‌ను సమర్దంగా ఎదుర్కొంటూ రాజధానిపై ప్రభుత్వ స్టాండ్‌ను ఎక్కడా నేరుగా బయటపెట్టకుండా సత్తిబాబు చేస్తున్న వ్యాఖ్యలతో ప్రభుత్వంలో ఆయన బాగా క్రేజ్ సంపాదించుకున్నట్లు అధికార వర్గాలు కూడా చర్చించుకుంటున్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం వెనుకబడిందని, అదే సమయంలో బొత్స పుంజుకున్నారనే వాదన కూడా వినిపిస్తోంది.(సయ్యద్ అహ్మద్ - సీనియర్ కరెస్పాండెంట్ - న్యూస్18తెలుగు)
First published: September 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు