కొన్ని ప్రేమల్లో నిజాయితీ ఉంటుంది. మరికొందరి ప్రేమలో నటన, చీటింగ్ ఉంటుంది. ఇంకొందరి ప్రేమల్లో కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏపీలోని రెండు జిల్లాల్లో ఆకర్షణ, కన్ఫూజన్, మోసం ఇలాంటి వ్యవహారాలతో ప్రేమ కథలు అనూహ్య మలుపు తిరిగాయి. ప్రియుడు వేరే యువతితో పెళ్లి పీటలెక్కడంతో ప్రియురాలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. దీంతో ప్రియురాలిని వెనక్కి తగ్గేలా చేయడం కోసం పెళ్లికూతురు బంధువులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. మరో స్టోరీలో పెళ్లి చేసుకుంటామంటూ ఇంటి నుంచి పారిపోయిన లవర్స్.. తీరా తిరిగొచ్చిన తర్వాత ఒకరంటే ఒకరికి ఇష్టం లేదని మొండికేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అనంతపురం జిల్లా (Anantapuram District) ఉరవకొండకు చెందిన యువకుడు, అదే పట్టణానికి చెందిన యువతి కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. ఐతే సదరు యువకుడికి కుటుంబ సభ్యులు మరో యువతితో పెళ్లి కుదిర్చారు.
బుధవారం పెళ్లికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. అంతాపెళ్లికి సిద్ధమవుతుండగా ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. పెళ్లి కొడుకును ప్రేమించిన యువతి.. తనను మోసం చేశాడంటూ అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పంచాయతీ పోలీస్ స్టేషన్ కు మారింది. కాబోయే అల్లుడుపై యువతి ఫిర్యాదు చేసిన సంగతి తెలుసుకున్న పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు.. పోలీస్ స్టేషన్ కు చేరుకొని తమ బిడ్డ జీవితాన్ని నాశనం చేయొద్దని.. దయచేసి కేసు వెనక్కి తీసుకోవాలని వేడుకున్నారు.
ఐతే యువతి మాత్రం అందుకు ససేమిరా అంటూ భీష్మించుకొని కూర్చుంది. తాను మాత్రం ప్రియుడ్నే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పడంతో పెళ్లికూతురు బంధువులు నిరాశతో వెనుదిగిరారు. మరోవైపు యువతి ఫిర్యాదును తీసుకున్న పోలీసులు యువకుడిపై దిశచట్టం కింద కేసు నమోదు చేశారు.
కొంచెం అటు ఇటుగా ఇలాంటి కథే చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. పెద్దపంజాణీ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు, బాలిక ప్రేమించుకున్నారు. వారం రోజుల క్రితం ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. ఐతే పోలీసులు వారిని గుర్తించి తీసుకురాగా.. అనుకోని ట్విస్ట్ ఇచ్చారు. బాలిక తనకు వద్దంటూ యువకుడు.. అతడితో వెళ్లనంటూ బాలిక.. తమ కుమార్తెను ఇంటికి తీసుకెళ్లమంటూ అమ్మాయి తల్లిదండ్రులు మొండికేశారు.
ఇదిలా ఉంటే బాలిక టీసీలో మైనర్ గా ఉండగా.. ఆధార్ కార్డులో మాత్రం మేజర్ గా ఉంది. తాము ఐదు రోజులు బయటకు వెళ్లినా పెళ్లి చేసుకోలేదని ప్రేమజంట చెప్పడంతో స్టోరీ మరో మలుపు తిరిగింది. దీంతో పోలీసులు ఆమెను ఏం చేయాలో తెలియక తలపట్టుకొని కూర్చున్నారు. చివరకి ఆమెను తల్లితో సహా ప్రభుత్వ హాస్టల్ కు తరలించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, Lovers