MANY CHALLENGES AHEAD FOR CREATING NEW DISTRICT IN ANDHRA PRADESH NK
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు... ప్రభుత్వం కసరత్తు... రాజకీయ దుమారం రేగే సంకేతాలు...
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు... ప్రభుత్వం కసరత్తు... రాజకీయ దుమారం రేగే సంకేతాలు... (File)
ఏపీలో కొత్త జిల్లాల వ్యవహారం తేనెతుట్టెలా మారుతోంది. జిల్లాలను ఎలా ఏర్పాటు చేస్తారనే అంశంపై రాజకీయ నేతలు, రియల్టర్లు, స్థానిక ప్రజలు అంతా ఆసక్తిగా చూస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత తేలిగ్గా కొత్త జిల్లాల్ని ఏర్పాటుచేయగలిగింది. ఎలాంటి రాజకీయ దుమారమూ రేగలేదు. ఏపీలో మాత్రం ఆ పరిస్థితి కనిపించట్లేదు. అధికార వైసీపీకి చెందిన నేతలే... రకరకాల అభ్యర్థనలను తెరపైకి తెస్తున్నారు. అందువల్ల కొత్త జిల్లాల ఏర్పాటు అనేది ప్రభుత్వానికి పెను సవాలుగా మారేలా కనిపిస్తోంది. అసలు కరోనా సమయంలో... కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై ప్రభుత్వం దృష్టి సారించదని అంతా అనుకున్నారు. కానీ సీఎం జగన్... ఈ కార్యక్రమం వేగంగా జరగాలని అనుకుంటున్నట్లు తెలిసింది. తెలంగాణలో 33 జిల్లాలు అయినందువల్ల... ఏపీలో... 13 జిల్లాల్ని 25 జిల్లాలు చేస్తారని తెలుస్తోంది. ఇది ఎన్నికల్లో ఇచ్చిన హామీ కావడంతో... నెరవేర్చాలనుకుంటూ... తాజాగా 3 జిల్లాల ఏర్పాటుకి కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఎన్నికల్లో ప్రతి లోక్ సభ నియోజకవర్గాన్ని జిల్లాగా చేస్తామని వైసీపీ తెలిపింది. కానీ... ఇక్కడే సమస్య ఎదురవుతోంది. ఈ రకంగా జిలాల్ని విభజిస్తే... ఇప్పుడున్న జిల్లాల్లో కొన్ని మండలాలు, ప్రాంతాలు ఇతర జిల్లాల్లోకి వెళ్తాయి. దీనిపై అభ్యంతరాలు వస్తున్నాయి. కొత్తగా ఏర్పడే మూడు జిల్లాల్లో ఒకటైన మచిలీపట్నం... ప్రస్తుతం కృష్ణా జిల్లా కేంద్రం. ఇప్పుడు అక్కడ విజయవాడ కేంద్రంగా కొత్త జిల్లా వస్తుంది. అందువల్ల మచిలీపట్నం లోని గన్నవరం విజయవాడకు చేరుతుంది. అటు అరకు జిల్లా విషయంలో... పాడేరును జిల్లాగా గుర్తించాలంటున్నారు స్థానిక వైసీపీ నేతలు. చాలాచోట్ల కొత్త జిల్లాలు ఏర్పడితే... అక్కడకు పనుల కోసం రావడానికి గంటల సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమస్యలు వస్తున్నాయి.
ప్రభుత్వ అంచనా ప్రకారం... కొత్తగా ఏర్పాటయ్యే 12 జిల్లాల్లో... 5 జిల్లాల ఏర్పాటుకు ఏ సమస్యలూ లేవు. మిగతా 7 జిల్లాల ఏర్పాటు విషయంలోనే చాలా సమస్యలు, సవాళ్లూ ఉన్నాయి. బాపట్ల, నరసారావుపేట, నంద్యాల, హిందూపురం, అరకు ఇలా కొన్ని కొత్త జిల్లాల ఏర్పాటులో రకరకాల అంశాలను ముందుగా పరిష్కరించాల్సిన అవసరం కనిపిస్తోంది.
అసలు కొత్త జిల్లాలు 25 లేక 26 అనే అంశం కూడా చర్చల్లో ఉంది. ఎందుకంటే... సీఎం జగన్... ప్రత్యేకంగా ఓ గిరిజన జిల్లా ఏర్పాటు చేస్తానని అన్నారు. అది శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల మధ్య కొన్ని ప్రాంతాలతో ఏర్పాటవ్వనుందని తెలిసింది. దీనిపైనా చర్చలు జరుగుతున్నాయి. విశాఖ నుంచి అరకును వేరు చేసి... దాన్ని గిరిజన జిల్లాగా ప్రకటించాలని కొందరు... శ్రీకాకుళం, విజయనగరం మధ్య ఉన్న పార్వతీపురం కేంద్రంగా జిల్లా ఉండాలని మరికొందరూ కోరుతున్నారు. అన్ని అంశాల్నీ లెక్కలోకి తీసుకొని... ఎలాంటి వ్యతిరేకతలూ రాకుండా... జిల్లాల్ని ఏర్పాటు చేయాలంటే... లోతైన కసరత్తు తప్పదంటున్నారు విశ్లేషకులు.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.