రిపోర్టర్: హేమంత్
లొకేషన్ : తిరుపతి
ఈ మధ్య పరువు హత్య ఘటనలు ఎక్కువగా చేసుకుంటున్నాయి. తమకు నచ్చని వారిని పెళ్లి చేసుకొని.. పరువు తీశారని... ప్రాణాలు తీస్తున్నారు. తమ కన్నా తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకున్నాడని ఒకరు... డబ్బు లేనివారిని వివాహం చేసుకున్నారని ఇంకొకరు... ఇలా కన్నవారిని చంపుతున్నారు. వారికి ఇష్టమైన వారిని కూడా హతమార్చుతున్నారు. తాజాగా కుప్పం - తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన కృష్ణగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తనకు ఇష్టం లేకుండా కూతురుని ప్రేమ వివాహం చేసుకున్నందుకు అల్లుడిని నడిరోడ్డు మీద అనుచరులతో కలిసి కత్తులతో పొడిచి చంపాడో వ్యక్తి.
కృష్ణగిరి జిల్లా కిట్టంపాటి గ్రామానికి చెందిన జగన్ 28 ఏళ్లు. శరణ్య వయసు 21 సంవత్సరాలు. వీరిద్దరు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఒకే కులం అయినప్పటికీ ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోవడంతో క్రిష్ణ జిల్లా అవతానపట్టి సమీపంలోని ముక్కాన్ కొట్టాయ్ ప్రాంతంలో గత నెల ప్రేమ వివాహం చేసుకున్నారు. తన కూతురును తనకు ఇష్టం లేకుండా జగన్‌ను పెళ్లి చేసుకోవడంతో అల్లుడుపై శరణ్య తండ్రి శంకర్ కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా అల్లుడిని హత్య చేయాలని ప్రణాళిక రూపొందించుకున్నాడు. ఇందులో భాగంగా తనతో పాటు మరో ఇద్దరు అనుచరులను సిద్ధం చేసుకున్నాడు. బుధవారం మధ్యాహ్నం.. జగన్ రోజు పని చేయడానికి వెళ్లే కిట్టంపడి టైల్స్ ఫ్యాక్టరీ దారిలో కాపు కాసాడు. బైక్ పై అటువైపు జగన్ రాగానే ఒక్కసారిగా ముగ్గురు కలిసి దాడి చేశారు. అందరూ చూస్తుండగానే కత్తులతో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశారు.
అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. విషయం తెలుసుకున్న జగన్ తరపు బంధువులు క్రిష్ణగిరి ధర్మపురి జాతీయ రహదారిపై పెద్ద సంఖ్యలో ధర్నాకు దిగారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారికి సర్ధిచెప్పారు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కాసేపటికి జగన్‌ను హత్య చేసిన శంకర్ పోలీసులకు లొంగిపోయాడు. కూతురు ప్రేమించి పెళ్ళి చేసుకుందనే కారణంగా సొంత అల్లుడినే అతి కిరాతకంగా మామ హత్య చేయడం.. స్థానికంగా చర్చనీయాంశమైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Crime news, Local News