GT Hemanth Kumar, News18, Tirupati
భార్యాభర్తల మధ్య పరస్పర గొడవలు సర్వసాధారణంగా ఉంటాయి. కొన్ని గొడవలు వారిద్దరిమధ్యే సర్దుమనుగుతూ ఉంటాయి. ఎంతపెద్ద గొడవ జరిగినా వారి మధ్య ఉన్న ప్రేమ వల్ల మర్చిపోతారు.. మరికొంత మంది పిల్లల భవిష్యత్తు కోసం కలిసుంటారు. కొన్నిసార్లు మాత్రం కానీ కొందరు భార్యాభర్తల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకుంటాయి. పెద్దలు సర్దిచెప్పినా వినిపించుకోకుండా విడిపోతుంటారు. ఈ గొడవల్లో అత్తింటివారే గొడవలకు కారణమని భార్యభర్తలు భావిస్తూ వారిపై పగ పెంచుకుంటుంటారు. అలాగే ఆలోచించాడో వ్యక్తి. తన భార్యతో గొడవలు జరగడానికి అత్తగారే కారణమని భావించిన అల్లుడు వారిపై దాడికి తెగబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.., ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని నెల్లూరు జిల్లా (Nellore District) కావలి పట్టణంలోని బాలక్రిష్ణారెడ్డి నగర్‌కు చెందిన వంశీకృష్ణతో జలదంకి మండలం జమ్మలపాలెంకు చెందిన రోజాకు రెండేళ్ల క్రితం పెద్దల సమక్షంలో వివాహం చేశారు.
కొన్నాళ్లు వారి కాపురం సాఫీగానే సాగింది. రానురాను ఇద్దరు మధ్య గొడవలు మొదలయ్యాయి. ప్రతి చిన్నవిషయానికి చిటపటలాడుతుండేవారు. గిల్లికజ్జాలు కాస్తా తీవ్రస్థాయిలో గొడవపడే స్థాయికి వెళ్లింది. అప్పుడప్పుడు పరస్పరం కొట్టుకునేవారని తెలుస్తోంది. దీంతో రోజా ఏడాది క్రితం జమ్మపాలెంలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఉదయగిరి రోడ్డులోని ఇంజనీరింగ్ కాలేజీ ఎదురుగా ఉన్న ఓ హోటల్లో పనిచేస్తోంది. అత్త కూడా అక్కడే పనిచేస్తోంది. ఐతే తన అత్తవల్లే తన భార్య దూరంగా ఉంటోందని భావించిన వంశీ కృష్ణ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఆమెకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకొని.. సమయం కోసం ఎదురుచూశాడు.
ఈ క్రమంలో ఈనెల 17న సాయంత్రం అత్త పనిచేస్తున్న హోటల్ వద్దకు వెళ్లాడు. ఆమెను దూషిస్తూ కర్రతో దాడి చేశాడు. మా ఇద్దరి మధ్య గొడవకు కారణం నువ్వేనని దూషిస్తూ ఆమెను విచక్షణారహితంగా కొట్టాడు. అనంతరం ఆమెను ఆటోతో ఢీ కొట్టి పరారయ్యాడు. స్థానికులిచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న సీఐ మల్లికార్జున రావు ఆమెను ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అల్లుడు వంశీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు.
ఇలాంటి ఘటనే కాకినాడ జిల్లాలో జరిగింది. పిఠాపురం మండలం కొత్తకందరాడకు చెందిన సైతన రమేష్ కు పిఠాపురం పట్టణానికి చెందిన దుర్గా దివ్య తేజశ్రీకి ఆరేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి నాలుగేళ్ల బాబు కూడా ఉన్నాడు. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. తనను నిత్యం అనుమానిస్తుండటంతో ఆరు నెలలుగా తేజశ్రీ పుట్టింటిలోనే ఉంటోంది. ఐతే భార్య వెళ్లిపోవడానికిఅత్తే కారణమని రమేష్ ఆమెపై కోపం పెంచుకున్నాడు. బుధవారం ఉదయం అత్త వెంకటరమణమ్మ ఇంటిబయట శుభ్రం చేస్తుండగా ఆమెపై ఒక్కసారిగా దాడి చేశాడు. దీంతో రమణమ్మ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అడ్డుకోబోయిన మామ సత్యనారాయణ, బావమరిది దిలీప్ కుమార్ పైనా కత్తితో దాడి చేయడంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. హత్యానంతరం బాబు హనుమాన్ ను తీసుకెళ్లిన రమేష్.. తన తల్లికి అప్పగించి నేరుగా పిఠాపురం పోలీసులకు లొంగిపోయాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East Godavari Dist, Nellore