‘సరిలేరు మీకెవ్వరు..’ ఆ ఊరంతా ముస్లింలే.. ఇంటికో సైనికుడు.. ఎక్కడంటే..

సంవత్సరమంతా ఆర్మీలో పనిచేసే ఈ ఊరు యవకులు రంజాన్, పీర్ల పండుగలకు మాత్రం గ్రామంలో వాలిపోతారు. తమ ఊరే ఓ ఆర్మీ క్యాంప్‌లా ఉంటుందని ఇక్కడ గ్రామస్థులు సగర్వంగా చెబుతారు.

news18-telugu
Updated: August 15, 2019, 3:49 PM IST
‘సరిలేరు మీకెవ్వరు..’ ఆ ఊరంతా ముస్లింలే.. ఇంటికో సైనికుడు.. ఎక్కడంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆ ఊరంతా ముస్లింలే. వారంతా సాధారణంగా అందరూ చేసేలా వ్యవసాయం లేదా ఇతర చేతి వృత్తిపనులు చేయరు. భరతమాత దేశ సేవలో తరిస్తారు. అనుక్షణం సరిహద్దుల్లో కాపలా కాస్తున్నారు. వారు నివాసం ఉండే ఆ గ్రామమే ప్రకాశం జిల్లా కోమరోలు మండలం మల్లారెడ్డిపల్లి. ఈ గ్రామంలో 150 కుటుంబాలు ఉన్నాయి. ప్రతి కుటుంబం నుంచి ఒక్కొక్కరు లేదా ఇద్దరు చొప్పున ప్రస్తుతం 150 మంది వరకూ ఆర్మీలో వివిధ స్థాయిల్లో సైనికులుగా పనిచేస్తున్నారు. దేశ రక్షణలో జీవితం సార్ధకం చేసుకుంటున్నారు. ఒక ఇంట్లో ముగ్గురు కొడుకులు ఉంటే విచిత్రంగా ముగ్గురూ బారతసైన్యంలో పనిచేస్తున్న కుటుంబం కూడా ఈ గ్రామంలో ఉంది. చాలా మంది సైన్యం లో పనిచేసి రిటైర్ అయినవాళ్లు ఉన్నారు. ఒక్క మాటతో చెప్పాలంటే వీరికి ఉద్యోగం అంటే ఆర్మీనే. మరొకటి గుర్తుకు రాదు. మూతిమీద మీసం మొలవకముందే ఇక్కడ కుర్రాళ్లను ఆర్మీ రారమ్మంటోంది. అంతే 16 సంవలత్సరాలు రాగానే ఈ గ్రామంలో యువకులు ఆర్మీ లో ఉద్యోగం సంపాదించేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. డిగ్రీ ,ఎంసిఎ ,ఎంబిఎ ,ఇంజనీరింగ్ వంటి ఉన్నత చదువులు చదివినా వీరి అడుగులు మాత్రం ఆర్మీ వైపే వెళ్తాయి. బారత దేశ రక్షణలో తమకు ఆత్మతృప్తి ఉందంటున్నారు ఈ గ్రామస్తులు.

మల్లారెడ్డిపల్లికి చెందిన షేక్ మాజార్ అలీ 1971 ఇండో-పాక్ యుద్ధంలో పాల్గొన్నారు. ఇరవై నాలుగేళ్లు ఆర్మీలో పనిచేసి ప్రస్తుతం రిటైర్ అయి గ్రామంలో నివాసం ఉంటున్నారు. దేశరక్షణలో జన్మధన్యం చేసుకుంటున్న ఈ గ్రామస్థులంటే ఈప్రాంత వాసుల్లోనూ వల్లమాలిన అభిమానం. సంవత్సరమంతా ఆర్మీలో పనిచేసే ఈ ఊరు యవకులు రంజాన్, పీర్ల పండుగలకు మాత్రం గ్రామంలో వాలిపోతారు. సాధ్యమైనంత ఎక్కువ మందే మల్లారెడ్డిపల్లి కి వచ్చేందుకు ప్రయత్నిస్తారు. ఇక ఆ పండుగ రెండు రోజులు ఊరంతా కోలాహలంగా ఉంటుంది. ఆర్మీ నుంచి వచ్చిన యువకులతో సరదాగా సరదా గడిపేస్తారు గ్రామస్థులు. తమ ఊరే ఓ సైన్యంలా ఉంటుందని ఇక్కడ గ్రామస్థులు సగర్వంగా చెబుతారు. ఎన్నో యుద్దాల్లో పాల్గొని ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న తాము తమ పిల్లలను కూడా ఆర్మీలో చేర్చేందుకు ఏమాత్రం వెనకాడమని మాజీ సైనికులు అంటున్నారు. ఈ ఒక్కమాటే మల్లారెడ్డి పల్లి గ్రామస్తుల దేశ భక్తికి నిదర్శనం.

(డి.లక్ష్మీనారాయణ, ప్రకాశం జిల్లా కరస్పాండెంట్, న్యూస్‌18)

First published: August 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...