పల్లెలు కళకళలాడుతున్నాయి., కొత్త అల్లుళ్లు, ఆడపడుచులు, చుట్టాలు, మిత్రుల రాకతో గ్రామాల్లో సంక్రాంతి కళ నెలకొంది. వ్యాపారాలు, ఉద్యోగాల కోసం పట్నంబాట పట్టిన వారు తిరిగి స్వగ్రామాలకు చేరుకున్నారు. ప్రజలంతా అయినవారి మధ్య పండగ జరుకుంటండంతో పల్లెలన్నీ కోలాహలంగా మారాయి. మూడు రోజుల పాటు సందడిగా సాగననున్న సంక్రాంతి సంబరాల్లో రంగవల్లులు, భోగి మంటలతో భోగిపండుకు స్వాగతం పలికిన తెలుగువారు.. అదే సందడితో సంక్రాంతికి స్వాగతం పలికారు. అలాగే మకర సంక్రాంతికి స్వాగతం పలుకుతూ పక్షం రోజులుగా గంగిరెద్దులు పల్లెల్లో సందడి చేస్తున్నాయి. ధనుర్మాసం కావడంతో ఉదయమే చేతిలో చెక్కలు, నుదుట నామాలు, మెడలో పూలదండలతో హరిదాసుల సంకీర్తనలు వినిపిస్తున్నాయి. మకర సంక్రాంతి, కనుమ పండుగల నేపథ్యంలో సంబరాలు అంబరాన్నంటన్నాయి.
సంక్రాంతి అంటే పుణ్యకాలం
సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణము. మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభము అవుతుంది. ఆ తరువాత కుంభ, మీన, మేష,వృషభ, మిథున రాశులలో కొనసాగినంత కాలము ఉత్తరాయణము. శారీరక పరిశ్రమకు, పూజలకు, సాధనలకు, కృషికి అనువైన, ఆవశ్యకత ఉన్న కాలము ఉత్తరాయణము. కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గరినుండి మొదలై, ఆ తరువాతసింహ, కన్య, తుల, వృశ్చికం, ధనూ రాశులలో కొనసాగినంత కాలము దక్షిణాయణము. మానసికమైన అర్చనకు,ధ్యానానికీ, యోగానికీ, దీక్షలకు,బ్రహ్మచర్యానికి, నియమ నిష్టలకు అనువైన, ఆవశ్యకత ఉన్న కాలము దక్షిణాయణము. పన్నెండు నెలల సంవత్సర కాలములో ఆరు నెలల దక్షిణాయణము దేవతలకు ఒక రాత్రి, ఆరు నెలల ఉత్తరాయణము దేవతలకు ఒక పగలు. కనుక దేవతలు మేలుకునే కాలము ఉత్తరాయణ పుణ్య కాలము.
పిండివంటలు.,కొత్త బట్టలు
ఇక గ్రామాల్లో ఎక్కడ చూసినా పిండివంటల ఘుమఘుమలే. సంక్రాంతి అంటే గుర్తుకు వచ్చే అరిసెలు, బూరెలు, గారెలు, బొబ్బట్లు, కాజాలు, సున్నుండలు, లడ్డూలు, పూతరేకులు, కజ్జికాయలు, జంతికలు, అప్పడాలు ఇలా ఒక్కో ఇంట్లో నాలుగైదు రకాల పిండివంటలు సిద్ధమవుతున్నాయు. ఇక కొత్తబట్టల సంగతి సరేసరే., ఏడాదంతా సంక్రాంతికి వేసుకునే కొత్తబట్టల గురించే ఆలోచిస్తారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కరోనా నేపథ్యంలో ప్రజలు మునుపటిలాగా పండుగను జరుపుకుంటారా లేదా అనే సందిగ్ధం నెలకొంది. కానీ సంక్రాంతి వైరస్ భయాన్ని పటాపంచలు చేసింది. వ్యాక్సిన్ వచ్చేసిందన్న ఆనందమో ఏమో.. ప్రజలంతా హాయిగా షాపింగ్ చేసేశారు. ఎక్కడ చూసినా షాపింగ్ మాల్స్ కిటకిటలాడిపోతున్నాయి. సంక్రాంతి అంటే కొత్తబట్టలు ఉండాల్సిందే. దీంతో వ్యాపారులు కూడా భారీగానే అమ్మకాలు జరిపారు. కొన్ని ప్రాంతాల్లో గత ఏడాది కంటే రెట్టింపు వ్యాపారం జరిగింది.
పందెం కోళ్ల జోరు
సంక్రాంతి అంటే ఠక్కున గుర్తొచ్చేది కోడి పందేలు. పందెం పుంజు బరిలో దిగనిదే సంక్రాంతి సందడి పరిపూర్ణం కాదు. ఎప్పటిలాగే కోడి పందేలు కూడా సందడిగా సాగుతున్నాయి. కోర్టు ఆంక్షలు, పోలీసుల హెచ్చరికలు ఉన్నా పందెం రాయుళ్లు మాత్రం వెనక్కితగ్గలేదు. ముఖ్యంగా తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీగా పందేలు సాగుతున్నాయి. కొన్నచోట్ల ప్రజాప్రతినిథులు దగ్గరుండి పందేలు నిర్వహిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East Godavari Dist, Krishna District, Sankranti, Sankranti 2021, West Godavari