Home /News /andhra-pradesh /

MAHA SHIVRATRI 2021 TEMPLE FAIR STARTED IN KOTAPPAKONDA LAKHS OF DEVOTEES ATTENDED SK

Maha Shivratri 2021: కోటప్పకొండకు శివరాత్రి శోభ... తిరునాళ్లకు పోటెత్తిన భక్తులు

కోటప్పకొండ

కోటప్పకొండ

Kotappakonda: తిరునాళ్ళకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకుని క్యూ లైన్లకు పందిర్లు టెంట్లను ఏర్పాటు చేశారు.

ఇంకా చదవండి ...
  గుంటూరు జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ పుణ్యక్షేత్రం మహాశివరాత్రి శోభ సంతరించుకుంది. త్రికూటేశ్వరస్వామి తొలి పూజ అందుకున్నారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా సర్వాంగసుందరంగా ముస్తాబైంది. దేవాలయ ప్రాంగణం మొత్తం విద్యుత్ దీపాలతో అలంకరించారు. ప్రతి ఏటా శివరాత్రి రోజున కోటప్పకొండలో జరిగే తిరునాళ్ళకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. చుట్టుప్రక్కల గ్రామాల నుండి భక్తులు విద్యుత్ దీపాలంకరణతో భారీ ప్రభలను నిర్మించి కోటప్పకొండకు తరలించడం ఇక్కడ విశేషం. తిరునాళ్ళకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకుని క్యూ లైన్లకు పందిర్లు టెంట్లను ఏర్పాటు చేశారు. మరో ప్రక్క భక్తుల దాహార్తిని తీర్చేందుకు నీటి కుళాయిలతో పాటు దాతల సహాయంతో వాటర్ ప్యాకెట్లు,మజ్జిగ ప్యాకెట్లను పంపిణీకి సిద్ధం చేశారు.భక్తులు పరమ పవిత్రంగా భావించే స్వామివారి ప్రసాదం ఇప్పటికే సిద్ధం చేసి ఉంచారు.

  లక్షల మంది తరలివచ్చే తిరునాళ్ళలో ఎటువంటి అవాంఛిత సంఘటనలు చోటు చేసుకోకుండా సుమారు ఆరువేల మంది సిబ్బందితో పోలీసు శాఖ నుండి పటిష్టమైన బందోబస్తుని ఏర్పాటుచేశారు. కొండకు దారితీసే అన్ని రహదారులని ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా ప్రణాళికలను సిద్ధం చేశారు. వివిధ సమస్యాత్మక ప్రాంతాలలో అవుట్ పోస్టులను ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ ఉండేలా ఏర్పాట్లు చేశారు. కొన్ని రూట్లను వన్ వే లు గా మార్చి ట్రాఫీక్ అంతరాయం జరగకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు.

  కొండకు దారితీసే అన్ని రహదారులను ఆర్ &బి అధికారులు రిపేరు చేసి అవసరమైన చోట సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు. కొండ దిగువ భాగాన కలిగిన ప్రధాన రహదారిని వెడల్పు చేసి నాలుగు లైన్ల రహదారిగా తీర్చిదిద్దారు. తిరునాళ్ళలో భక్తులు సౌకర్యార్ధం ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్‌లను ఏర్పాటు చేయడంతో పాటు అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచారు. తిరునాళ్ళకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా నరసరావుపేట మున్సిపల్ మరియు పంచాయితీ శాఖల అధికారులు పారిశుధ్య చర్యలను చేపట్టారు.


  శివరాత్రి పర్వదినం రోజున ఘాట్ రోడ్డులో రద్దీని ధృష్టిలో ఉంచుకుని కొండపైకి ఎటువంటి ప్రైవేటు వాహనాలను అనుమతించ బోమని పోలీసులు స్పస్టం చేశారు. వి.ఐ.పి భక్తులకోసం సుమారు 60 బస్సులను ఏర్పాటు చేశారు. ఘాట్ రోడ్డులో బస్సు ప్రయాణం కొరకు పోలీసు శాఖ వారు పాసులను జారీ చేశారు. ఇక కోటప్పకొండకు సమీపంలోని నరసరావుపేట మరియు చిలకలూరిపేట పట్టణాల నుండి ప్రజల సౌకర్యార్ధం 600 బస్సులను రవాణా శాఖ అధికారులు సిద్ధంచేశారు. శివరాత్రి పండుగకు ముందు ఒక రోజు మున్సిపల్ ఎన్నికలు జరుగనుండటంతో అధికారులు బందోబస్తు మరింత పటిష్టంగా ఏర్పాటు చేశారు.కరోన వైరస్ కారణంగా ప్రమాదం పొంచి ఉండటంతో కొండకు వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని అధికారులు విఙప్తి చేస్తున్నారు.



  గడిచిన నెల రోజులుగా స్థానిక శాసనసభ్యులు గోపిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, గుంటూరు రూరల్ జిల్లా ఎస్పి విశాల్, గున్ని ఆధ్వర్యంలో వరుస సమీక్షాసమావేశాలు నిర్వహించి వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ తిరునాళ్ళకు ఏర్పాట్లను చేయడం జరిగిందని, భక్తులు క్రమశిక్షణతో మెలుగుతూ,ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ ఈ.ఓ ఏ.రామకోటిరెడ్డి తెలియజేశారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Guntur, Maha Shivratri

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు