Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati
ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య సాధారణంగా డబ్బు, అమ్మాయి విషయంలో గొడవలు జరుగుతుంటాయి. డబ్బుల విషయంలో కాస్త కాంప్రమైజ్ అయినా.. అమ్మాయి విషయంలో ఎవరూ తగ్గరు. ఇద్దరూ ఒకే అమ్మాయిని లవ్ చేయడం, లేదా ఇష్టపడటం చేస్తుంటారు. అసలు విషయం తెలిసిన తర్వాత దోస్త్ మేరా దోస్త్ అనుకున్నవాళ్లు కాస్తా.. ఒకరిపై ఒకరు కత్తులు నూరుతుంటారు. అలా ఇద్దరు యువకుల మధ్య ప్రేమ వివాదం కొన్ని ప్రాణాలను బలి తీసుకునే యత్నానికి దారి తీసింది. అయితే అందుకు ప్రయత్నించిన యువకుడు ఆ విషయాన్ని తన సోదరుడికి చెప్పటంతో అతడు ఆ ప్రయత్నాన్ని భగ్నం చేసి ఎవరికీ ఎటువంటి హాని జరగకుండా చూశాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కృష్ణా జిల్లా (Krishna District) కేంద్రమైన మచిలీపట్నంలో ఈ ఘటన జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మచిలీపట్నంలోని ఎన్‌టీఆర్ కాలనీకి చెందిన పాసపు నాగేంద్రకుమార్, వంకా నాగేశ్వరరావు ఇరువురు మంచి స్నేహితులు, ఇద్దరూ రోల్డుగోల్డు పనులు చేస్తుంటారు. ఒకే కాలనీకి చెందిన వారిరువురూ అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిపై మనసు పడ్డారు.
సదరు యువతి మొదట నాగేశ్వరరావుతో చనువుగా మెలిగింది. అయితే ఇటీవల నాగేంద్రకుమార్‌తో మాట్లాడటం మొదలు పెట్టింది. దీంతో ఆగ్రహానికి గురైన నాగేశ్వరరావు ఎలాగైనా నాగేంద్రకుమార్ పై కక్ష పెంచుకున్నాడు. తన ప్రేమకు అడ్డుగా వస్తున్న నాగేంద్రను మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. అప్పటివరకు ఉన్న స్నేహం, కలివిడి తనాన్ని మరిచి మరీ క్రూరంగా ఆలోచించాడు. పథకం ప్రకారం సుమారు 15 రోజుల క్రితం తెలిసిన రోల్డ్ గోల్డ్ దుకాణంలో పటాస్ ముక్కను కొనుగోలు చేశాడు. అది ప్రాణాంతక విషంతో సమానమని తెలుస్తోంది.
మరుసటి రోజు తెల్లవారుజామున నాగేంద్రకుమార్ ఇంటికి వెళ్లిన నాగేశ్వరరావు.. బాత్ రూంలో ఉన్న టూత్ బ్రష్‌లపై పటాస్ కలిపిన పేస్టును పెట్టి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. అలా నాగేంద్రకుమార్‌ను అంతమొందించేందుకు పూనుకున్న నాగేశ్వరరావు తాను చేసిన ప్రయత్నాన్ని తన సోదరుడి చెవిన వేశాడు. ఐతే వెంటనే తేరుకున్న నాగేశ్వరరావు సోదరుడు ఆ బ్రెష్‌లను అక్కడి నుంచి తీసి దూరంగా పడేశాడు. ఆ తర్వాత ఇద్దరూ సైలెంట్ అయ్యారు.
కొన్ని రోజుల తరువాత ఆ నోటా ఈ నోటా విషయం కాస్తా బయటికి పొక్కటంతో విషయం తెలుసుకున్న నాగేంద్రకుమార్ చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాగేంద్రకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చిలకలపూడి పోలీసులు నాగేశ్వరరావును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Machilipatnam