Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati
పూర్వం డబ్బు (Money)ను కాసు, బేడా, అణా అనే పేరుతో లెక్కించేవారు. కాలం మారింది డబ్బు రూపాయిగా చలామణి అవుతోంది. ప్రస్తుతం టైమ్ మరింత అడ్వాన్స్ అయింది. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ రూపంలో డిజిటల్ డబ్బు (Digital Currency) కు విలువ పెరిగింది. దీన్ని ఆసరాగా తీసుకున్న కొందరు ప్రభుద్దులు మోసాలకు పాల్పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కృష్ణా జిల్లా (Krishna District) అవనిగడ్డ పరిసర ప్రాంతాల్లో క్రిప్టో కరెన్సీ పేరిట ఓ ముఠా గా ఏర్పడి కోట్ల రూపాయలు ప్రజలకు టోకరా వేశారు. అవనిగడ్డ మండలం తుంగలవారిపాలెం గ్రామానికి చెందిన భోగిరెడ్డి నాగేశ్వరరావుతో పాటు పలువురు క్రిప్టోకరెన్సీ పేరుతో తాము మోసపోయినట్లు ఎస్పీ పి.జాషువాకు పిర్యాదు చేసారు. ఎస్పీ ఫిర్యాదును స్వీకరించి విచారణకు ఆదేశించారు.
విచారణలో గుడివాడకు చెందిన మతి నరేష్, విజయవాడకు చెందిన ఆనంద్ కిషోర్, అవనిగడ్డకు చెందిన మానేపల్లి జగదీష్, తుంగలవారిపాలెంకు చెందిన తుంగల లక్ష్మీనర్సయ్యతో కలిసి ట్రస్ట్ వ్యాలెట్ అనే ఇమిటేషన్ వెబ్సైట్ ద్వారా డబ్బులు వసూలు చేసినట్లు విచారణలో తేలింది. రూ.3.75 లక్షలు చెల్లించిన వారికి 200 రోజులకు గాను రోజుకు రూ.7 వేలు, ప్రతి సభ్యుడు మరో సభ్యుడిని చేర్చినట్లైతే రూ.30 వేలు, అదే ఇద్దరు సభ్యులను చేర్చితే రూ.90 వేలు చెల్లిస్తామని చెప్పి దాదాపు రూ. 82 లక్షలు వసూలు చేశారు.
ప్రజల నమ్మకాన్ని పొందడానికి నిందితులు మొదట్లో రూ. 25.90 లక్షలను బాధితులకు తిరిగి చెల్లించారు. అనంతరం చెల్లింపులు చేయడం ఆపేసారు. నిందితులు నరేష్, ఆనంద కిషోర్లు ఖమ్మం , విజయవాడ పరిసర ప్రాంతాల్లో పలువురిని ఇదే విధంగా మోసగించినట్లు విచారణలో తేలింది.నిందితులు ఫేక్ వెబ్సైట్ను ఏర్పాటు చేసి ఏ తత్న్గాన్ని నడిపినట్లు ఐటీ కోర్ నిపుణులు గుర్తించారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన సిద్ధంశెట్టి ఆనంద కిశోర్ ను అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి ల్యాప్ టాప్, సెల్ ఫోన్, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.ఈ విచారణలో పోలీస్ లకు కృష్ణా జిల్లా అవనిగడ్డ పరిసర ప్రాంతాల్లో క్రిప్టో కరెన్సీ పేరిట సుమారు ఇరవై కోట్ల వరకు మోసం చేసారని ఈ ముఠా లో గుడివాడకు చెందిన మతి నరేష్, విజయవాడకు చెందిన ఆనంద్ కిషోర్, అవనిగడ్డకు చెందిన మానేపల్లి జగదీష్, తుంగలవారిపాలెంకు చెందిన తుంగల లక్ష్మీనర్సయ్య లు నిందితులని ఆనంద్ కిశోర్ ను అదుపులోకి తీసుకున్నామని మిగతావారిని త్వరలో అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Cheating, Krishna District