తిరుమల వెంకన్నకు కరోనా కష్టాలు.. జీతాలకు డబ్బుల్లేవ్..

ఉద్యోగులకు, సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బుల్లేవట. తిరుమల తిరుపతి దేవస్థానం చెబుతున్న మాట ఇదీ.

news18-telugu
Updated: May 12, 2020, 1:42 PM IST
తిరుమల వెంకన్నకు కరోనా కష్టాలు.. జీతాలకు డబ్బుల్లేవ్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఆ దేవుడు.. రోజుకు రూ.2 కోట్లుకు తగ్గకుండా విరాళాలు వస్తుంటాయి.. అదీ హుండీ ఆదాయం మాత్రమే.. ఆపై వచ్చే విలువైన విరాళాలు, కానుకలకు లెక్కే లేదు.. కానీ, ఇప్పుడు ఉద్యోగులకు, సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బుల్లేవట. తిరుమల తిరుపతి దేవస్థానం చెబుతున్న మాట ఇదీ. లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో గత 45 రోజులుగా తిరుమలకు భక్తుల రాకపోక లేదు. విరాళాలు లేకుండా పోయాయి. దీంతో జీతాలు ఇవ్వలేని పరిస్థితి తలెత్తిందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. లాక్‌డౌన్ దెబ్బకు రూ.400 కోట్ల రెవెన్యూ కోల్పోయామని, ఇప్పుడు రోజూ వారీ ఖర్చులు భరించడానికి కూడా ఇబ్బంది అవుతోందని అంటున్నారు. సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు. అయితే, టీటీడీ వద్ద 8 టన్నుల బంగారం ఉంది. రూ.14వేల కోట్ల ఫిక్స్‌‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఆ డబ్బు, బంగారం ముట్టుకోకుండా సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు మొదలు పెట్టామని అంటున్నారు టీటీడీ అధికారులు.

వాస్తవానికి దేవస్థానం లాక్ డౌన్ సమయంలో రూ.300 కోట్లు సిబ్బంది జీత భత్యాలు, రోజువారీ ఖర్చులు, ఇతర నిర్వహణ కోసం ఖర్చు చేసింది.గత యాభై రోజులుగా దేవస్థానానికి భక్తులను అనుమతించని కారణంగా దాదాపు రూ.885 కోట్లు ఆదాయం కోల్పోయింది. ఈ సంవత్సరం హుండీ ఆదాయం దాదాపు 1351 కోట్ల రూపాయలు సమకూరుతాయని అంచనా వేసినా, లాక్ డౌన్ కారణంగా ఒక్క హుండీ ఆదాయమే రూ185 కోట్ల మేర పడిపోయింది. అంతేకాకుండా లడ్డూ ప్రసాద విక్రయం, గదుల అద్దె, ఆర్జిత సేవల టికెట్ విక్రయాలు, విరాళాల రూపంలో మరో రూ.200 కోట్లు సమకూరుతాయని అంచనా వేయగా దాంట్లో ఒక్క పైసా కూడా రాలేదు.

అవును. లాక్ డౌన్ కారణంగా టీటీడీ ఆలయం ఆదాయాన్ని కోల్పోయింది. ఇది యావత్ ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్య.. ఒక్క దేవస్థానం సమస్య మాత్రమే కాదు. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి ప్రకారం జీతభత్యాలకు ఇబ్బందేమీ లేదని విశ్వాసం నాకుంది. అవసరమైతే స్వామి వారి పేరున ఉన్న డిపాజిట్లపై వచ్చే వడ్డీని ఉపయోగించుకుంటాం. లాక్ డౌన్ సమయంలో అన్నార్థులను ఆదుకునేందుకు దేవస్థానం దాదపు పది కోట్ల రూపాయలు వెచ్చించి భోజన పంపిణీ కార్యక్రమం చేపట్టాం. పూల వర్తకులకు పరిహారం చెల్లించాం. అయితే, మే 17 నుంచి దేవస్థానం తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ టీటీడీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ముందుగా రోజుకు ఐదు నుంచి పదివేల మంది భక్తులకు ప్రవేశం కల్పించేలా అనుమతి ఇవ్వాలని కోరాం. నిబంధనల ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం
న్యూస్18తో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి


మొత్తంగా రూ 3309.89 కోట్ల వార్షిక బడ్జెట్ అంచనాలను ఆమోదించిన టీటీడీ బోర్డు జీతభత్యాలకే సింహ భాగం రూ. 1385.09 కోట్లు కేటాయించింది. దేవస్థానంలో మొత్తం 7400 మంది పూర్తి స్థాయి, 14 వేల మంది కాట్రాక్టు, ఔట్ సోర్సింగ్ తదితర ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరి జీతభత్యాల కోసం ప్రతీ నెల రూ.115 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. అయితే, ఏపీ ప్రభుత్వ కరోనా లాక్ డౌన్ నిబంధనల ప్రకారం అధికారులకు 60 శాతం మేర, ఉద్యోగులకు 50 శాతం, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పది శాతం మేర వేతనాల్లో కోత విధించింది దేవస్థానం. కోత విధించిన మొత్తాన్ని కూడా పరిస్థితి చక్కబడిన తర్వాత దేవస్థానమే చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఇప్పుడు డబ్బుల్లేక టీటీడీ అవస్థలు పడుతోంది.
Published by: Shravan Kumar Bommakanti
First published: May 12, 2020, 1:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading