Lok Sabha Elections Exit Polls 2019 : ఎన్నికల దశలు పూర్తైన ప్రతిసారీ ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి. కానీ అవి వాస్తవాలకు తగ్గట్లు ఉండట్లేదన్న వాదన వినిపిస్తోంది. మరి ఈసారి ఏం జరగబోతోంది?
AP Assembly Elections Exit Polls 2019 : మే 23న ఎన్నికల ఫలితాలు రాబోతుండగా... అంతకంటే నాలుగు రోజుల ముందుగా వివిధ ఛానెళ్లు, మీడియా, సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. అవి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి. కేంద్రంలో అధికారం ఎవరికి దక్కుతుంది? ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు గెలవబోతున్నారు. అనేదానిపై ప్రజల్లో ఆసక్తికి పెంచేస్తున్నాయి ఎగ్జిట్ పోల్స్. ఐతే... 2004 లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు వాజ్‌పేయి అధ్యక్షతన బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. తీరా చూస్తే, సోనియా గాంధీ నేతృత్వం లోని యూపీఏ అధికారంలోకి వచ్చింది. 2009లో యూపీఏ, ఎన్డీయే రెండు కూటములకూ సమాన సీట్లు దక్కుతాయని ఎగ్జిట్ పోల్స్ చెబితే... యూపీయేకి అంచనాకి మించి ఎక్కువ సీట్లు వచ్చి..., ఎన్డీయేకి సీట్లు తగ్గాయి.
ఇక 2014లో... ఈసారి కచ్చితంగా NDA కూటమి గెలుస్తుందని చెబితే... డైరెక్టుగా బీజేపీయే 282 సీట్లతో పూర్తి మెజార్టీ దక్కించుకుంది. ఒక్క టుడేస్ చాణక్య సంస్థ మాత్రమే ఇదే ఫలితాన్ని ఊహించగలిగింది. ఆ సంస్థ NDAకి 326-354 మధ్యలో సీట్లు వస్తాయని చెప్పింది. నిజంగానే 336 సీట్లు వచ్చాయి. దీన్ని బట్టీ మనకు అర్థమయ్యేది ఒకటే. ఎగ్జిట్ పోల్స్ అనేవి మన టెన్షన్‌ను కాస్త తగ్గించడానికీ, మనం ఓ రెండ్రోజులు విశ్లేషించుకోవడానికీ పనికొస్తున్నాయే తప్ప... వాస్తవాన్ని చెప్పలేకపోతున్నాయి. ఈసారి కేంద్రంలో, ఆంధ్రప్రదేశ్‌లో టఫ్ ఫైట్ నడిచింది కాబట్టి... ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పే అవకాశాలే ఎక్కువ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
వివిధ సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన ఫలితాల్ని ఓసారి చూద్దాం.
- 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు తప్పాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి స్వల్ప మెజార్టీ వస్తుందని చెప్పాయి. కానీ ఆ పార్టీ 70 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 67 గెలుచుకుంది. బీజేపీకి 19-27 సీట్లు వస్తాయని చెబితే... ఆ పార్టీకి 3 మాత్రమే వచ్చాయి.
- 2015 బీహార్ అసెంబ్లీ ఫలితాల్లోనూ అంతే. లాలు ప్రసాద్, నీతీశ్ కుమార్ కూటమికి 178, బీజేపీకి 58 సీట్లు వచ్చాయి. సంస్థలు మాత్రం బీజేపీకి అనుకూలంగా ఎగ్జిట్‌పోల్స్ ఇచ్చాయి.
- 2017లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అట్టర్‌ఫ్లాప్ అయ్యాయి. బీజేపీకి 251-279 మధ్య సీట్లు వస్తాయని ఇండియాటుడే-సిసిరో, 289 సీట్లు వస్తాయని టుడేస్ చాణక్య చెప్పాయి. వాస్తవంగా వచ్చినవి 325. సీఓటర్ (161), ఏబీపీ-సీఎస్డీఎస్ (170), న్యూస్ఎక్స్-ఎంఆర్సీ (185) సర్వేల లెక్కలు ఏమాత్రం సెట్ కాలేదు.
- 2017లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని ఛానళ్లూ బీజేపీకి మినిమం 106, మాగ్జిమం 135 దాకా వస్తాయన్నాయి. వాస్తవంగా వచ్చింది 99 మాత్రమే. కాంగ్రెస్‌కు 47-75 మధ్య వస్తాయంటే... వాస్తవంగా 81 దక్కాయి.
- 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై 6 సంస్థలు ఎగ్జిట్‌పోల్స్ ఇవ్వగా 3 మాత్రమే కరెక్టుగా చెప్పాయి.
- 2018 ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో 5 సంస్థలు ఎగ్జిట్‌పోల్స్ ఇచ్చాయి. ఇండియాటుడే- యాక్సిస్ మై ఇండియా సర్వే మాత్రమే ఫలితాలకు దగ్గరగా ఉంది. కాంగ్రెస్‌కు 55-65 సీట్లు వస్తాయని ఆ సంస్థ చెప్పగా... 68 దక్కాయి. బీజేపీకి 21-31 మధ్య వస్తాయని చెప్పగా.. 15 మాత్రమే వచ్చాయి.
ఇలా ప్రతీ సంవత్సరం వేర్వేరు సంస్థలు మాత్రమే సరైన ఎగ్జిట్ పోల్స్ ఇవ్వగలుగుతున్నాయి. కంటిన్యూగా ఏ ఒక్క సంస్థా ప్రతీసారీ కరెక్ట్ ఎగ్జిట్ పోల్స్ ఇవ్వట్లేదు. కాబట్టి... మనం ఏ సంస్థనూ, ఏ మీడియా ఛానెల్ సర్వేలనూ నమ్మలేని పరిస్థితి ఉంది.
ఎందుకు కరెక్టుగా అంచనా వెయ్యలేకపోతున్నాయి :మీరు ఎవరికి ఓటు వేశారు అని ప్రజలను అడగడం నేరం. అందువల్ల ఎగ్జిట్ పోల్స్ నిర్వహించే సంస్థలు ఆ ప్రశ్న తప్ప ఇతరత్రా రకరకాల ప్రశ్నలు వేస్తాయి. అంటే ప్రస్తుత ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏంటి? ఈసారి ఎవరు వస్తారని మీరు అనుకుంటున్నారు? ఇలా దాదాపు 20 రకాల ప్రశ్నలు వేస్తాయి. ఐతే, ప్రజల అభిప్రాయాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించడం వల్ల ఒక్కో దశలో ఒక్కోలా ఓటరు స్పందించే అవకాశాలున్నాయి. అందువల్ల నెల కిందట చేసిన సర్వే... ఇప్పుడు సెట్ కాకపోవచ్చు. పైగా మీడియా ఛానెళ్లలో చాలా వరకూ ఏదో ఒక పార్టీకి కొమ్ముకాస్తున్నాయనే ఆరోపణలు వింటూనే ఉన్నాం. అలాంటి ఛానెళ్లు సరైన సర్వే ఫలితాలు ఇస్తాయని ఎలా అనుకోగలం. ఇలాంటి చాలా అంశాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారయ్యేలా చేస్తున్నాయి.
గతంలో ఎగ్జిట్ పోల్స్
ఎగ్జిట్ పోల్స్ అనేవి ఇప్పటివరకూ మనకున్న చాలా అనుమానాలను తీర్చేవిలా, కాసేపు రిలాక్స్ కలిగించేవిలా ఉపయోగపడుతున్నాయి. చూద్దాం... నేటి సాయంత్రం ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ వస్తాయో. ఏ సంస్థలు ఎవరికి పట్టం కడతాయో.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.