ఏపీలో పారిశ్రామిక రాజధానిగా పేరుతెచ్చుకున్న విశాఖపట్నం నగరం, పర్యాటకంగానూ ఎంతో అభివృద్ధి చెందింది. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు పేరుతో జరిగిన ఉద్యమం వల్ల 1982లో కేంద్రం అక్కడ స్టీల్ ప్లాంట్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్) ఏర్పాటు చేసింది. 2010లో దానికి నవరత్న కంపెనీల్లో ఒకటిగా హోదా దక్కింది. తాజాగా కేంద్రం ప్రకటించిన రైల్వేజోన్‌తో విశాఖ మరింత అభివృద్ధి చెందే అవకాశముంది. విశాలమైన సముద్ర తీరం, నగర పరిధిలో ఉన్న బీచ్‌లు దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. అత్యధిక అర్బన్ ఓటర్లు కలిగిన లోక్ సభ నియోజకవర్గం విశాఖపట్నం.
1952లో విశాఖపట్నం లోక్ సభ స్థానానికి తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. ఆరంభంలో ఏజెన్సీలో మన్యం నేతలు, ఆ తర్వాత గజపతి రాజులు, కొన్నేళ్లుగా వలస నేతలు ఇక్కడ పోటీ చేసి విజయం సాధిస్తున్నారు. ఇప్పటివరకూ జరిగిన 16 లోక్ సభ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 9 సార్లు విజయం సాధించింది. మూడుసార్లు టీడీపీ, బీజేపీ, సోషలిస్టు పార్టీ, ప్రోగ్రెసివ్ గ్రూప్, ఇండిపెండెంట్ ఒక్కోసారి గెలిచారు. అత్యధికంగా గజపతి రాజులు ఇక్కడి నుంచి నాలుగుసార్లు గెలిచారు. వర్థమాన పరిస్థితుల ఆధారంగా మాత్రమే అభ్యర్ధులు ఇక్కడ గెలవడం ఆనవాయితీగా వస్తోంది. స్ధానికేతరులు కూడా నాలుగుసార్లు ఇక్కడి నుంచి గెలిచారు.
విశాఖ నగరం పరిధిలో ఉన్న విశాఖ ఉతర్తం, విశాఖ దక్షిణం, విశాఖ తూర్పు, విశాఖ పశ్చిమ, గాజువాక స్థానాలతో పాటూ భీమిలి, ఎస్.కోట అసెంబ్లీ స్థానాలు కూడా విశాఖపట్నం లోక్ సభ స్థానం పరిధిలోకి వస్తాయి. ఇక్కడి మొత్తం ఓటర్ల సంఖ్య 16,8,233. వారిలో పురుష ఓటర్లు 8,09,000. మహిళా ఓటర్లు 7,99,155. ఇక్కడ అన్నివర్గాల ఓటర్లూ ఉన్నారు. విశాఖ ఉక్కు ప్లాంట్ లో పనిచేసే ఉద్యోగులతో సహా ఉత్తరాది వారి ప్రాబల్యం కూడా ఎక్కువే.
విశాఖ నగర పరిధిలోకి వచ్చే ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లోనూ ఏ పార్టీ అధికారంలో ఉన్నా అభివృద్ధి మాత్రం కొనసాగుతోంది. లోక్ సభ స్థానం పరిధిలో ఓటర్లు ఎక్కువగా ఉద్యోగ, వ్యాపార వర్గాల వారే ఉన్నారు. వీరిలోనూ ఉత్తరాది వ్యాపారుల హవా కనిపిస్తుంటుంది. విశాఖ వాసుల చిరకాల డిమాండ్ అయిన రైల్వేజోన్ ప్రకటనతో ఇక్కడి రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. అభ్యర్ధుల ప్రొఫైల్‌తో పాటు పార్టీల హవా కూడా ప్రతిసారీ ఎన్నికల్లో కీలకం అవుతుంటుంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ అభ్యర్థులే ఇక్కడ విజయం సాధించడాన్ని బట్టీ చూస్తే రాజకీయ చైతన్యం అర్థమవుతుంది.
2014లో ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన కంభంపాటి హరిబాబు బీజేపీ అభ్యర్ధిగా టీడీపీ మద్దతుతో విజయం సాధించారు. విభజన హామీలు అమలు కాకపోవడంతో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న బీజేపీ... విశాఖ రైల్వేజోన్ ప్రకటనతో ఇక్కడి ఓటర్లకు గాలం వేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈసారి బీజేపీతో పాటు కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ, జనసేన కూడా వేటికవే ఒంటరిగా బరిలోకి దిగుతుండటంతో అభ్యర్థిని బట్టే విజయం ఉంటుందనేది నిర్వివాదాంశం.
ఇప్పటివరకూ విశాపట్నం ఎంపీలుగా పనిచేసిన వారు :
1952-57 | లంకా సుందరం, గామ్ మల్లుదొర | ఇండిపెండెంట్ |
1957-62 | మహారాజ పూసపాటి విజయరామ గజపతిరాజు | సోషలిస్ట్ పార్టీ |
1962-67 | మహారాజ కుమార్ ఆఫ్ విజయనగరం | కాంగ్రెస్ |
1967-71 | తెన్నేటి విశ్వనాథం | ప్రొగ్రెసివ్ పార్టీ |
1971-77 | పూసపాటి విజయరామ గజపతిరాజు | కాంగ్రెస్ |
1977-80 | ద్రోణంరాజు శ్రీనివాస్ | కాంగ్రెస్ |
1980-84 | కొమ్మూరు అప్పలస్వామి | కాంగ్రెస్ |
1984-89 | భాట్టం శ్రీరామ మూర్తి | టీడీపీ |
1989-91 | రాణి ఉమా గజపతిరాజు | కాంగ్రెస్ |
1991-96 | ఎంవీవీఎస్ మూర్తి | టీడీపీ |
1996-98 | టి.సుబ్బరామిరెడ్డి | కాంగ్రెస్ |
1998-99 | టి.సుబ్బరామిరెడ్డి | కాంగ్రెస్ |
1999-2004 | ఎంవీవీఎస్ మూర్తి | టీడీపీ |
2004-09 | ఎన్.జనార్ధన్ రెడ్డి | కాంగ్రెస్ |
2009-14 | దగ్గుబాటి పురంధేశ్వరి | కాంగ్రెస్ |
2014- present | కంభంపాటి హరిబాబు | బీజేపీ |
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Lok Sabha Election 2019, Visakhapatnam S01p04