హింసాత్మకంగా ఏపీ ఎన్నికలు... వేర్వేరు ప్రాంతాల్లో ప్రధాన పార్టీల నేతల ఘర్షణలు

Lok Sabha Election 2019 : ఏపీలో మధ్యాహ్నానికి 12 ప్రాంతాల్లో ఘర్షణలు జరిగినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ తర్వాత కూడా ఘర్షణలు కొనసాగాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: April 11, 2019, 1:29 PM IST
హింసాత్మకంగా ఏపీ ఎన్నికలు... వేర్వేరు ప్రాంతాల్లో ప్రధాన పార్టీల నేతల ఘర్షణలు
ఏపీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు..
  • Share this:
(సయ్యద్ అహ్మద్ - న్యూస్18తెలుగు కరెస్పాండెంట్)
ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ లోని చాలా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈవీఎంలు మొరాయించడంతో చాలా చోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమవ్వగా, మరికొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. టీడీపీ, వైసీపీ నేతల మధ్య జరిగిన ఘర్షణలు ఇద్దరి ప్రాణాలు తీశాయి. పోలింగ్‌కు ఇబ్బందులు కలిగించాయి. ఇక శ్రీకాకుళం జిల్లాలోని రాజాం ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో పోలింగ్ అధికారి గిరిబాబు ముసలివాళ్ల ఓట్లను స్వయంగా వేస్తున్నారు. దీనిపై టీడీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడి నుంచీ పోటీ చేస్తున్న మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కొన్ని చోట్ల ఈవీఎంల పనితీరు సరిగా లేకపోవడంతో ఓటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలోని జమ్మిచెట్టు సెంటర్ పోలింగ్ బూత్‌లో... ఒకరికి ఓటేస్తే, మరొకరికి పడుతోందనే ఆరోపణలొచ్చాయి. వీవీ ప్యాట్లలో స్లిప్పులు చూసి ఓటర్లు ఎదురుతిరిగారు. దీంతో అధికారులు ఆ కేంద్రంలో పోలింగ్ నిలిపివేశారు.

అనంతపురం జిల్లా - తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మీరాపురంలో వైసీపీ - టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన టీడీపీ కార్యకర్త సిద్ధా భాస్కరరెడ్డి చనిపోయారు. అలాగే వైసీపీకి చెందిన కార్యకర్త పుల్లారెడ్డి కూడా మృతి చెందారు. ఈ ఘర్షణలో వైసీపీకి చెందిన మరో ముగ్గురు కార్యకర్తలు గాయపడినట్లు తెలిసింది.

Sidda Bhaskar Reddy death in tadipatri
తాడిపత్రిలో టీడీపీ-వైసీపీ మధ్య ఘర్షణలో మృతి చెందిన టీడీపీ నేత సిద్దా భాస్కర్ రెడ్డి


అనంతపురంలో ఈవీఎంలు పనిచేయకపోవడంపై వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవీఎంను నేలకేసి కొట్టడంతో పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. ఓటింగ్ కంపార్ట్‌మెంట్లలో నియోజకవర్గం పేర్లు సరిగా రాయలేదని ఆగ్రహించిన గుంతకల్ జనసేన అభ్యర్థి మధుసూదన్ గుప్తా ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈవీఎం యంత్రాన్ని నేలకేసి కొట్టారు.

గుంటూరు జిల్లా - సత్తెనపల్లి నియోజకవర్గంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై దాడి జరిగింది. నియోజకవర్గంలోని రాజపాలెంలోని ఇనిమెట్ల గ్రామంలో సభాపతి మీద వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. రాళ్ల దాడి చేయడంతో స్పీకర్ కోడెల తీవ్రంగా గాయపడ్డారు. రాష్ట్ర అంగన్ వాడీ యూనియన్ నేత భీమినేని వందన కూడా దాడిలో గాయపడ్డారు. స్పీకర్ కోడెల గన్ మెన్‌కు కూడా దెబ్బలు తగిలాయి. వారు కూడా స్పృహ తప్పి పడిపోయారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిని కంట్రోల్ చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపణలు వస్తున్నాయి. అంతకు ముందు కోడెల శివప్రసాదరావు ఓ పోలింగ్ స్టేషన్‌లోకి వెళ్లి తలుపులు మూసుకోవడం సంచలనంగా మారింది. దీనిపై వైసీపీ పోలింగ్ ఏజెంట్లు ఆందోళన వ్యక్తం చేశారు. స్పీకర్ కోడెలను పోలీసులు బలవంతంగా బయటకు లాక్కుని వచ్చారు. ఈ సందర్భంగా కోడెల స్పృహతప్పి పడిపోయారు.

Andhra Pradesh Lok Sabha Elections 2019, Lok sabha election 2019, Sattenapalli Assembly, Kodela Siva Prasada Rao, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, కోడెల శివప్రసాదరావుపై దాడి, సత్తెనపల్లిలో కోడెలపై రాళ్ల దాడి, కోడెలపై వైసీపీ రాళ్ల దాడి
వైసీపీ రాళ్ల దాడిలో గాయపడిన కోడెల శివప్రసాదరావు
గుంటూరు జిల్లా - నరసరావుపేట ఉప్పలపాడులో వైసీపీ నేతలు, కార్యకర్తలు... టీడీపీ అభ్యర్థి అరవిందబాబుపై దాడి చేశారు. దీంతో పోలీసులు లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. జిల్లాలోని నరసారావుపేట మండలం ఉప్పలపాడులో ఉద్రిక్తత పరిస్థితి తలెత్తింది. టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబుపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెళ్లిన అరవింద్ బాబును వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. ఆయనపై దాడి చేసి నిర్భందించారు. దీంతో టీడీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో కవరేజ్‌కు వెళ్లిన మీడియా పైనా వైసీపీ నాయకులు దాడి చేశారు. ఈ ఘటనపై పోలీసులు చేతులెత్తేశారు.

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం ఉప్పలపాడు లో వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారు.


కర్నూలు జిల్లా అహోబిలంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలింగ్ బూత్ వద్ద భూమా - గంగుల వర్గీయులు రాళ్లు రువ్వుకున్నారు. పోలింగ్ బూత్ వద్ద ఉన్న ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో ఇరువర్గాలనూ పోలీసులు చెదరగొట్టారు. సమాచారం అందుకున్న భూమా అఖిలప్రియ అహోబిలం చేరుకున్నారు. అంతకు ముందే ఆళ్లగడ్డలో కూడా పోలింగ్ బూత్ దగ్గర కూడా వైసీపీ కార్యకర్తలు దాడులకు దిగారు. అంతేకాకుండా ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కూడా కొన్ని పోలింగ్ బూత్‌ల దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.

విశాఖపట్టణం జిల్లాలోని రామరాయుడుపాలెంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. రెండు వర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు జోక్యం చేసుకుని రెండు వర్గాలను దరగొట్టారు. దీంతో అక్కడ వాతావరణం సద్దుమణిగింది.

కృష్ణా జిల్లా గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని ఓ ఓటరుపై చేయి చేసుకున్నారు. నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు నగదు పంపిణీ చేపట్టగా.. డబ్బుల విషయంలో కార్యకర్తలు, ఓటర్ల మధ్య వివాదం చెలరేగింది. దీంతో అక్కడే ఉన్న కొడాలి నాని ఓటరుపై చేయి చేసుకున్నారు.

కడప జిల్లా జమ్మలమడుగు మండలం పొన్నతోటలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. కాశీనాయన మండలం గొంటువారిపల్లె 97వ బూత్‌లో వైసీపీ నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. పోలింగ్ బూత్ తలుపులు మూసేసి, ఓటర్లను వెనక్కి పంపేశారు. కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిని పోలీసులు అరెస్టు చేసి, లక్కిరెడ్డిపల్లెలో గృహ నిర్బంధం చేశారు. పోలీసుల తీరు దారుణమని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. అలాగే బ్రహ్మంగారిమఠం మండలం గుండాపూర్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. జమ్మలమడుగు నియోజకవర్గం... సున్నపురాళ్లపల్లెలో సీఐ నరసింహారెడ్డి ఓవరాక్షన్ ప్రదర్శించారు. వైసీపీ నేత అవినాష్ రెడ్డి ఆదేశాలతో.. పోలింగ్ కేంద్రాల దగ్గరున్న టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టారు.

కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. రాయచోటిలో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు... ఆయన స్వగ్రామం అక్కిరెడ్డిపల్లికి తీసుకొచ్చి, హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ అనుమతి ఉన్నప్పటికీ తనను అరెస్ట్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గన్ మెన్లతో కలసి పోలింగ్ కేంద్రాల వద్ద తిరుగున్న నేపథ్యంలో, పైఅధికారుల నుంచి తమకు ఆదేశాలు వచ్చాయని... అందుకే అదుపులోకి తీసుకున్నామని పోలీసులు ఆయనకు సమాధానమిచ్చారు.

విజయనగరం జిల్లా సదానందపురంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. దివ్యాంగులను పోలింగ్ కేంద్రాలకు తరలించే విషయంలో వివాదం తలెత్తి రెండు వర్గాలు గొడవ పడ్డాయి

నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడిపై దాడి జరిగింది. పోలింగ్ కేంద్రం దగ్గర వైసీపీ అభ్యర్థి మేకపాటి గౌతంరెడ్డి తన జులుం ప్రదర్శించారు.

విజయవాడ జమ్మిచెట్టు సెంటర్ దగ్గర పోలింగ్ కేంద్రాల్లో అయోమయం తలెత్తింది. ఎవరికి ఓటు వేసినా, బీజేపీకే పడుతోందని ఓటర్ల ఆరోపించారు, అధికారులకు ఫిర్యాదు చేశారు. వీవీ ప్యాట్లలో స్లిప్పులు చూసి ఓటర్లు ఎదురుతిరిగారు. దీంతో అధికారులు ఆ కేంద్రంలో పోలింగ్ నిలిపివేశారు.
First published: April 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading