హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Temple Vandalism: కచ్చితంగా వాళ్ల పనే.. రామతీర్థం ఘటనపై సీఐడీ ప్రాథమిక నిర్థారణ

AP Temple Vandalism: కచ్చితంగా వాళ్ల పనే.. రామతీర్థం ఘటనపై సీఐడీ ప్రాథమిక నిర్థారణ

రామతీర్థం

రామతీర్థం

AP Temple Vandalism: రామతీర్థం ఘటన స్థానికులు లేదా వారి సహకారంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు చేసిన పని అయి ఉంటుందని ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ అనుమానం వ్యక్తం చేశారు.

  రామతీర్థం ఘటన ఆకతాయిల చర్యగా భావించడానికి ఎలాంటి ఆధారాలు లేవని సీఐడీ ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. ఈ ఘటనపై విచారణ ప్రారంభించిన సీఐడీ.. ఎవరో కావాలనే ఈ దుశ్చర్యకు పాల్పడినట్టే వెల్లడించింది. రామతీర్ధం బోడుకొండను సీఐడీ అడిషనల్‌ డీజీ సునీల్‌కుమార్ పరిశీలించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న సీఐడీ చీఫ్.. ఘటన జరిగిన విధానం చూస్తుంటే ఎవరో కావాలనే చేసినట్టు ఉందని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం, ప్రభుత్వంపై కక్షతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని అన్నారు. ఇక్కడికి రావడానికి ఎంతో ప్రయాసపడాలని అన్నారు. ఇక్కడ ఓ దేవాలయం ఉందని.. ఫలానా సమయంలో అక్కడ ఎవరూ ఉండరనే విషయాలు పూర్తిగా తెలిసిన వాళ్లే ఈ చర్యలకు పాల్పడి ఉంటారని సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ అన్నారు.

  ఇది స్థానికులు లేదా వారి సహకారంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు చేసిన పని అని అనుమానం వ్యక్తం చేశారు. అంత శ్రమకు ఓర్చి రాముడి విగ్రహం ధ్వంసం చేసేందుకు ఉపయోగించిన రంపం దొరికిందని తెలిపారు. సమీపంలోని కొనేరులోనే వీటిని పడేయటాన్ని బట్టి చూస్తుంటే.. ఇక్కడి పరిస్థితులపై వారికి పూర్తి అవగాహన ఉన్నట్టు కనిపిస్తోందని అన్నారు. ఘటనకు సంబంధించి అనేక ఆధారాలు సేకరించామని వెల్లడించారు. ఆలయంలో ఉన్న ఆభరణాలు లేదా వస్తువులు గాని దొంగతనం జరగలేదని అన్నారు. ఈ ఘటనకు పాల్పడింది ఎవరు ? ఎందుకు ఇలాంటి పనికి పాల్పడ్డారు ? అనే అంశాలు విచారణలో తెలుస్తాయని అన్నారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుగుతుందని.. దోషులను త్వరలోనే పట్టుకుంటామని సీఐడీ అడిషనల్‌ డీజీ సునీల్‌కుమార్‌ తెలిపారు.

  అంతకుముందు ఈ ఘటనపై సమీక్షా సమావేశంలో స్పందించిన సీఎం జగన్.. ఘటనకు పాల్పడిన వాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జన సంచారం ఎక్కువగా లేని గుళ్లను టార్గెట్‌గా చేసుకుని కొందరు ఆలయాలపై దాడులకు పాల్పడుతున్నారని వైఎస్ జగన్ అన్నారు. ఎవరూ లేని ప్రదేశాల్లో అర్ధరాత్రి పూట అందరూ పడుకున్నాక ఉద్దేశపూర్వకంగా గుళ్లపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులను ఆదేశించారు. గుళ్లపై దాడులు చేయాలంటేనే భయపడేలా చేయాలని పోలీసులను ఆదేశించారు. మత, కులాల మధ్య విద్వేషాలు పెంచేవారిపట్ల పోలీసుల కఠినంగా వ్యవహరించాలని జగన్ స్పష్టం చేశారు.

  ఇలాంటి ఘటనల్లో ప్రమేయమున్న ఎవ్వరినీ లెక్క చేయొద్దని పోలీసులను సీఎం జగన్ ఆదేశించారు. ఈ రాజకీయ గొరిల్లా వార్‌ఫేర్‌ను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని సూచించారు. రాష్ట్రంలో ఆలయాల వద్ద ఇప్పటివరకూ 36వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని సీఎం జగన్ గుర్తు చేశారు. వరుస ఘటనల నేపథ్యంలో చాలా జాగ్రత్తగా మానిటర్‌ చేయాలని సూచించారు. ఆలయాలపై దాడుల అంశంపై లోతుగా దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, AP Temple Vandalism

  ఉత్తమ కథలు