కరోనా (Corona Virus) సమయంలో నెల్లూరు జిల్లా (Nellore District) కృష్ణపట్నం ఆనందయ్య (Krishnapatnam Anandiah) మందు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ అయింది. సెకండ్ వేవ్ సమయంలో ఆనందయ్య ఇచ్చే మందు కోసం కరోనా బాధితులు, వారి బంధువులు పోటీపడ్డారు. చివరకు ప్రభుత్వం జోక్యం చేసుకొని రాష్ట్రవ్యాప్తంగా మందు పంపిణీకి చర్యలు తీసుకుంది. ప్రస్తుతం ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్న దృష్ట్యా ఆనందయ్య మందు మరోసారి తెరపైకి వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ఆనందయ్య కూడా తన స్వగ్రామంలో మందు పంపిణీ చేస్తున్నారు. ఐతే ఈ ఏడాది మొదట్లో ఆనందయ్య కోసం నిలబడ్డ గ్రామస్తులు ఇప్పుడు ఆయన మందు పంపిణీకి వ్యతిరేకంగా రంగంలోకి దిగారు. గ్రామంలో మందు పంపిణీ చేయడానికి వీల్లేదని అడ్డుకున్నారు.
సోమవారం కృష్ణపట్నంలో ఆనందయ్య మందు పంపిణీని ప్రారంభించారు. ఐతే గ్రామస్తులు దీనిని వ్యతిరేకిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా మందు పంపిణీ చేయొద్దన్న గ్రామస్థులు.., ఒమిక్రాన్ రాకముందే ఒమిక్రాన్ మందు ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి గ్రామానికి కొత్త వ్యక్తులు వస్తున్నారని.. దీని వల్ల గ్రామంలో కొత్త కొత్త రోగాలు వచ్చే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆనందయ్యకి గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
మందు పంపిణీకి తనకు అన్ని అనుమతులున్నాయన్న ఆనందయ్య.. తన ఇంట్లో మందు పంపిణీ చేస్తే మీకు ఇబ్బంది ఏంటని గ్రామస్తులను ప్రశ్నించారు. ఐతే ఆనందయ్య తీరుపై గ్రామస్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ గొడవపై సమాచారమందుకున్న పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పారు. ఊరిచివర మందు పంపిణీ ఏర్పాటు చేసుకోవాలని ఆనందయ్యకు సూచించారు.
ఇది చదవండి: ఒమిక్రాన్ కు ఆనందయ్య మందు వాడొచ్చా..? ఆయుష్ శాఖ ఏం చెప్పిందంటే..!
ఇదిలా ఉంటే ఇటీవలే రాష్ట్ర ఆయుష్ శాఖ ఆనందయ్యకు ఝలక్ ఇచ్చింది. ఇదిలా ఒమిక్రాన్ వేరియంట్ కు ఆయుర్వేద మందు విషయంలో ఏపీ ఆయుష్ శాఖ స్పష్టతనిచ్చింది. ఒమిక్రాన్ కు ఆయుర్వేద మందును ఇప్పటివరకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదని.. అలాంటి ప్రతిపాదనలు కూడా తమ దగ్గరకు రాలేదని రాష్ట్ర ఆయుష్ కమిషనర్ రాములు స్పష్టం చేశారు.
ఒమిక్రాన్ సోకకుండా ముందుజాగ్రత్తగా, సోకిన వారికి వెంటనే తగ్గేలా ఇటీవల ప్రచారం జరుగుతోందని.. కొత్త వేరియంట్ కు సంబంధించి ఉచిత మందు పంపిణీకి గానీ, విక్రయించేందుకు గానీ అనుమతుల కోసం ఎవరూ రాలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఒమిక్రాన్ విషయంలో ప్రభుత్వం గుర్తించిన ఆయుష్-64, ఆర్సెనిక్ ఆల్బమ్-30 వంటి హోమియో మందులు డాక్టర్ల సలహామేరకు తీసుకోవచ్చన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.