అసలే ఎండలు మండిపోతున్నాయి. బయటకు వెళ్లాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలో ఫ్రీగా బీర్లు దొరికితే.. మందుబాబులు ఊరుకుంటారా? ఎగబడి మరీ ఎత్తుకెళ్తారు. ఈ ఛాన్స్ మళ్లీ రాదంటూ.. పోటీపడి మరీ తీసుకెళ్తారు. ఏపీలోని ప్రకాశం (Prakasam) జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. సింగరాయకొండ మండల పరిధిలోని కలికవాయ ఫ్లైఓవర్ సమీపంలో.. బీరు బాటిళ్ల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి అందరికీ తెలిసింది. రోడ్డపై బీర్ల కార్టన్స్ పడ్డాయని తెలియడంతో.. పరుగులు తీశారు. బీరు సీసాలు దొరుకుతాయేమోనని ఎగబడ్డారు. దొరికినోడికి దొరికినంతగా ఎత్తుకెళ్లారు.
శనివారం రాత్రి శ్రీకాకుళం (Srikakulam) జిల్లా రణస్థలం మండలం బంటుపల్లి గ్రామంలోని యునైటెడ్ బ్రేవరేజెస్ లిమిటెడ్ ఫ్యాక్టరీ నుంచి చిత్తూరు జిల్లా మదనపల్లిలోని మద్యం డిపోకు కింగ్‌ఫిషర్ (King Fisher Beer), ఎన్జి బ్రాండు బీరు బాటిళ్ల లోడుతో లారీ బయలుదేరింది. ఆదివారం తెల్లవారుఝామున 3 గంటల సమయంలో లారీ సింగరాయకొండ మండలానికి చేరుకుంది. ఐతే కలికవాయ ఫ్లైవర్ సమీపంలోకి రాగానే లారీ రోడ్డు ప్రమాదానికి గురయింది. డ్రైవర్ నిద్రమత్తు కారణంగా లారీ అదుపు తప్పి.. రోడ్డు మధ్యలో ఉన్న సిమెంటు దిమ్మెను బలంగా ఢీ కొట్టింది. అనంతరం బోల్తా పడింది. ఐతే అదే సమయంలో చెన్నై నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న ట్యాంకర్ మద్యం లారీని ఢీ కొట్టడంతో బీరు బాటిళ్లన్నీ రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోయాయి.
బీర్ బాటిళ్ల లారీ (Beer Lorry Accident) బోల్తా పడిందని తెలియడంతో.. చుట్టుపక్కల వారు పరుగులు తీశారు. మద్యం ప్రియులు పెద్ద మొత్తంలో చేరుకొని.. రోడ్డుపై పడిన బీరు బాటిళ్లను ఎత్తుకెళ్లారు. కొందరైతే కార్టన్స్ తీసుకెళ్తూ కనిపించారు. రోడ్డుపై లారీ బోల్తా పడడంతో చాలాసేపు ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, టంగుటూరు హైవే పెట్రోలింగ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేసి.. స్థానికులను అక్కడి నుంచి పంపించారు. క్రేన్ సహాయంతో లారీని రోడ్డు పక్కకు చేర్చి.. మిగిలిన బాటిళ్లను అక్కడివారు తీసుకెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ తర్వాత తీసుకుని ఎక్సైజ్, సెబ్ అధికారులు కూడా ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎల్.సంపత్‌కుమార్ పేర్కొన్నారు. ప్రమాదానికి గురైన లారీలో సుమారు రూ.30 లక్షలు విలువైన బీరు బాటిల్స్ ఉన్నాయని చెప్పారు. లారీ డ్రైవర్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.