హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tirumala Gaht road: తిరుమల భక్తులను వెంటాడుతున్న భయం.. ఘాట్‌ రోడ్డు మూసివేత.. తృటిలో తప్పిన ప్రమాదం

Tirumala Gaht road: తిరుమల భక్తులను వెంటాడుతున్న భయం.. ఘాట్‌ రోడ్డు మూసివేత.. తృటిలో తప్పిన ప్రమాదం

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం

Tirumala ghat: ఎడతెరిపి లేని వానలు.. వరదలు తిరుమలను భయపెడుతున్నాయి. వాన తెరిపిచ్చింది అనుకున్నా ఇప్పుడు ఘాట్ రోడ్ ల రూపంలో భయం వెంటాడుతూనే ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు కొండచరియలు విరిగి రోడ్డుమీద పడుతున్నయి. దీంతో ఘాట్ రోడ్డు మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది.

ఇంకా చదవండి ...

  Tirumala ghat: చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తిరుమలపై వరుణుడు పగబడ్డాడు. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు వర్షాలు కురిశాయి. కుండపోత వానతో తిరుమల అతలాకుతలం అయ్యింది. అయితే తిరుమలలో ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టినా.. భారీగా కురిసిన వర్షాల కారణమో.. ఏమో కానీ, కొండచరియలు విరిగి రోడ్డు మీద పడుతున్నాయి. పెద్ద పెద్ద బండరాళ్లు రోడ్డు మీద పడడంతో రోడ్లు పగిలిపోతున్నాయి. ఇటీవల తరుచూ ఘాట్ రోడ్లలో అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఎక్కడికక్కడ కొండచరియలు విరిగి పడుతున్నాయి. దీంతో భక్తులు ఘాట్ రోడ్డులో ప్రయాణం అంటేనే బిక్కు బిక్కు మంటూ భయపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఎప్పుడు ఎటునుంచి ఏ రాయి ఊడిపడుతుందో తెలియడం లేదు. గతంలోనూ ఈ సమస్య ఉన్నా.. ఇటీవల భారీ వర్షాల కారణంగా గత కొన్ని రోజులుగా నిత్యం ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా తిరుపతిని వర్షాలు చుట్టుముట్టాయి . ఈ భారీ వర్షాలకు శేషాచలం కొండల్లోని డ్యాములు, చెక్ డ్యామ్ లు పొంగి పోయాయి. ఈ వర్షాల కారణంగా తిరుమల లో రూ. 4 కోట్లకు పైగా ఆస్తి నష్టం సంభవించిందని టీటీడీ అధికారులు తెలిపారు.

  తాజాగా ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా రెండవ ఘాట్ రోడ్డు 4,5 కిలోమీటర్ల మధ్య కొండచరియలు భారీగా విరిగిపడ్డాయి. రెండో ఘాట్ రోడ్డులోని చివరి మలుపు దగ్గర భారీగా చీలికలు ఏర్పడ్డాయి. భాష్యకార్ల సన్నిధికి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘాట్ రోడ్డుపై మొత్తం రాళ్లు ఉండడం.. కోతకు గురికావడంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు టీటీడీ అధికారులు. జరిగిన ఘటన తెలిసిన వెంటనే టీటీడీ అత్యవసర సిబ్బంది చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అప్పటికే అధికారులను అప్రమత్తం చేసి.. అటువైపు వాహనాలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. టీటీడీ విజిలెన్స్, ఇంజనీరింగ్, అటవీశాఖ అధికారులు కొండచరియలు తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. తాజా ప్రమాదం నేపథ్యంలో రెండో ఘాట్ రోడ్డును తాత్కాలికంగా మూసివేశారు.


  రెండు ఘాట్‌ రోడ్లలోనూ చాలాచోట్ల కొండచరియలు విరిగిపడుతూనే ఉన్నాయి. దీంతో వాహనాలను నిలిపివేయగా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టీటీడీ ప్రత్యామ్నాయ చర్యలను చేపట్టింది. అయితే, ఘాట్ రోడ్డుపై త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. దగ్గరలో భక్తులతో వస్తున్న బస్సు కూడా ఉన్న సమయంలోనే కొండచరియలు విరిగిపడ్డాయి. ఆరు కిలోమీటర్ల మేర తిరుమల రెండో ఘాట్ లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. అక్కడకి మీడియాను సైతం అనుమతించట్లేదు అధికారులు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: AP Floods, Heavy Rains, Tirumala, Tirupati

  ఉత్తమ కథలు