తమిళనాడులో జరిగిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) హెలికాప్టర్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన తెలుగు జవాన్ బి.సాయితేజ భౌతికకాయం చిత్తూరు జిల్లా కురబలకోట మండలంలోని స్వగ్రామం ఎగువ రేగడపల్లెకు చేరనుంది. ఆదివారం తెల్లవారుజామున ఐదు గంటలకే బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరిన వాహనం.. ఈ ఉదయం 10 గంటలకు గమ్యాన్ని చేరనుంది. జవాన్ సాయితేజకు ఘనంగా వీడ్కోలు పలికేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగనున్నాయి.
తొలుత శనివారమే ఈ కార్యక్రమాన్ని ముగించాలని భావించినా.. భౌతిక కాయం తరలిపులో ఆలస్యం జరగడం, సాయంత్రం వేళ అంత్యక్రియలు మంచిదికాదనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహిస్తామని కుటుంబీకులు చెప్పడంతో అధికారులు ఆ మేరకు సాయితేజ భౌతికాయాన్ని ఢిల్లీ నుంచి బెంగళూరు ఆర్మీ బేస్ ఆస్పత్రిలో ఉంచారు. యలహంక ఎయిర్‌బేస్‌లో పలువురు ఆర్మీ అధికారులు సాయితేజ భౌతికకాయానికి నివాళులర్పించారు. అక్కడి నుంచి బెంగళూరు ఆర్మీ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఉదయం అధికారగణం సాయితేజ భౌతికకాయంతో చిత్తూరు బయలుదేరారు.
మదనపల్లె, అంగళ్లు, కంటేవారిపల్లె మీదుగా రేగడవారిపల్లెకు జవాన్ సాయితేజ భౌతికకాయాన్ని తీసుకువచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. కాగా, ఆ మార్గం వెంబడి పలు చోట్ల సాయితేజకు ప్రజలు నివాళి అర్పిస్తున్నారు. కర్ణాటక సరిహద్దు చీకలబైలు నుంచి పలు చోట్ల యువత బ్యాక్ ర్యాలీలు తీశారు. ఈనెల 8న తమిళనాడులోని కూనూరు ప్రాంతంలో ఐఏఎఫ్ హెలికాప్టర్ కూలిన ఘటనలో భారత సర్వసైన్యాధ్యక్షుడు, తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక, జవాన్ సాయితేజతోపాటు మొత్తం 13 మంది దుర్మరణం చెందారు. ఐఏఎఫ్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఒక్కరే గాయాలతో ప్రాణాలతో బయట పడ్డారు.
Gen Bipin Rawat ఎక్కడున్నా భారత్ అభివృద్దిని చూస్తారు -UP బహిరంగ సభలో PM Modi
మరోవైపు సాయితేజ కుటుంబానికి అండగా నిలిచింది ఏపీ ప్రభుత్వం. సాయితేజ కుటుంబానికి 50 లక్షల ఆర్థికసాయం ప్రకటించింది. ఆ చెక్కును మంత్రి పెద్దిరెడ్డి సాయితేజ కుటుంబానికి అందించారు. సాయితేజ త్యాగం వెలకట్టలేనిదన్నారు మంత్రి పెద్దిరెడ్డి. సాయితేజ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు సాయితేజ సోదరుడు మహేష్. సాయితేజ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chitoor, Helicopter Crash, Indian Army