సినిమాలు, రాజకీయాల్లో తనదైన ముద్రవేసి అనితర సాధ్యుడు అనిపించుకున్న మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 25వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులు, టీడీపీ నాయకులు, అభిమానులు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ఇక, సోమవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్‌పర్సన్ లక్మీపార్వతి కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద పూలమాల వేసి ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ఇంట్లో చిన్న ఎన్టీఆర్ వచ్చారు.. జనవరి 1న మనవడు జన్మించాడని చెప్పారు. అప్పుడే బాబుకు ఎన్టీఆర్ అని పేరు పెట్టుకున్నానని తెలిపారు. తన భర్త ఆశీస్సులు ఆ బిడ్డపై ఉండాలన్నారు. తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన ఎంతో మందికి స్ఫూర్తిప్రదాత అన్నారు. ఆయన పేరు చెప్పుకోకుండా ఏ పార్టీ కూడా ముందుకు వెళ్లలేదని అన్నారు.
ప్రతి ఒక్క నాయకుడు ఎన్టీఆర్ ఆశయాలతో ముందుకువెళుతున్నారన్నారు ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలో రామరాజ్యం సాగుతుందని అన్నారు. సంక్షేమం, అభివృద్ది దిశగా జగన్ ప్రభుత్వం సాగుతుందని చెప్పారు. మంచి పాలన అందిస్తున్న జగన్‌కు వ్యతిరేకంగా విగ్రహాల ధ్వంసం పేరిట నీచమైన కుట్ర చేస్తున్నారని లక్ష్మీపార్వతి ఆరోపించారు. 25 ఏళ్ల క్రితం ఏ విధమైన కుట్రలు జరిగాయో, ఇప్పుడు కూడా అదే రకమైన కుట్రలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు.
కానీ కుట్రలకు పాల్పడిన దొంగలు వెంటనే దొరికిపోతున్నారని చెప్పారు. వైఎస్ జగన్‌ను ఎవరు ఏమి చేయలేరని అన్నారు. ప్రజాభిమానమే జగన్‌కు శ్రీరామరక్ష అని వ్యాఖ్యానించారు.
Published by:Sumanth Kanukula
First published:January 18, 2021, 15:30 IST