బ్యాలెన్స్ ఫార్ములాతో లగడపాటి సర్వే... వైసీపీ షాక్ ఇస్తుందా...?

చంద్రబాబు, లగడపాటి, జగన్ (Image : Facebook)

AP Assembly Election 2019 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై పూర్తి విరుద్ధమైన సర్వే అంచనాల్ని చెప్పి దెబ్బతిన్న లగడపాటి... ఏపీ విషయంలోనూ అదే చేయబోతున్నారా?

  • Share this:
దక్షిణాది రాష్ట్రాల్లో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇచ్చే సర్వేలకు ఎంత గుర్తింపు ఉంటుందో మనందరికీ తెలుసు. ఆయన సర్వేలు కరెక్టైనా, రాంగైనా... అసలాయన ఏం చెబుతారో తెలుసుకుందామని అందరూ అనుకుంటూ ఉంటారు. సర్వే చెప్పాక, దానిపై ఎవరికి వాళ్లు విశ్లేషించుకుంటారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడు లగడపాటి ఇచ్చిన సర్వే రిపోర్ట్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. జాతీయ ఛానెళ్లన్నీ టీఆర్ఎస్ గెలుస్తుందంటే... వాటికి రీజనల్ పాలిటిక్స్ తెలియవు అంటూ... లగడపాటి ప్రజాకూటమి గెలుస్తుందన్నట్లు సర్వే రిపోర్ట్ ఇచ్చారు. తీరా చూస్తే... టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలిచి... లగడపాటికి షాకిచ్చింది. అప్పటి రిపోర్టుతో లగడపాటి సర్వేలపై ప్రజల్లో ఉన్న నమ్మకం ఒక్కసారిగా పడిపోయింది. కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి పొందేందుకు లగడపాటి ముందున్న ఏకైక అస్త్రం ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వే రిపోర్ట్.

ఎన్నికల సమయంలో అనుభవజ్ఞులకే ఈసారి ఏపీ ప్రజలు పట్టం కడుతున్నారని చిన్న క్లూ ఇచ్చిన లగడపాటి రాజగోపాల్... బ్యాలెన్స్డ్ ఫార్ములాతో సర్వే రిపోర్ట్ ఇవ్వబోతున్నారని తెలిసింది. ఐతే, ఎలా చూసినా టీడీపీకి ఒకింత అనుకూలంగా సర్వే రిపోర్ట్ ఉండబోతోందన్నది మరో కోణం. ఐతే... నొప్పించక తానొవ్వక అన్నట్లుగా ఆయన రిపోర్ట్ తయారవుతోందని సమాచారం. తెలంగాణలో లాగే... ఏపీలోనూ తన సర్వే రిపోర్ట్ తప్పైతే... తన ప్రాభవానికి మరింత గండి పడే ప్రమాదం ఉండటంతో... అలా జరగకుండా ఉండేందుకు లగడపాటి అత్యంత చాకచక్యంగా సర్వే రిపోర్ట్ తయారుచేస్తున్నట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. ముఖ్యంగా లగడపాటి సర్వేలో ఫలితాలు ఏమాత్రం స్పష్టంగా లేకుండా ఉంటాయని సమాచారం.

ఏపీలో ఈసారి ప్రజలు వెంటవెంటనే నిర్ణయాలు మార్చుకున్నారనీ, వారం వారం ప్రజల అభిప్రాయాలు చకచకా మారిపోయాయనీ లగడపాటి చెప్పబోతున్నట్లు తెలిసింది. కులం, మతం అంశాలతోపాటూ... ప్రభుత్వ పథకాలు, ఎన్నికల్లో పంచిన డబ్బు, మద్యం, ప్రత్యేక హోదా, కేసీఆర్ ఇలా అన్ని అంశాలూ ఈ ఎన్నికల్ని ప్రభావితం చేశాయనీ, అందువల్ల ఓటర్లు స్థిరమైన అభిప్రాయం (నిశ్చితమైన అభిప్రాయం)తో లేరనీ, కాసేపు టీడీపీ, కాసేపు వైసీపీ, కాసేపు జనసేన ఇలా వెంటవెంటనే అభిప్రాయాలు మార్చేసుకున్నారని లగడపాటి చెప్పబోతున్నట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సర్వే చేయించడం అత్యంత కష్టమైందనీ, ఫలితాల్ని ఊహించడం ఈసారి దాదాపు అసాధ్యంగా కనిపించిందనీ, ప్రజల నాడిని పట్టడం ఎప్పుడూ లేనంత క్లిష్టంగా మారిందని లగడపాటి చెప్పబోతున్నట్లు తెలిసింది.

ఇలా చెప్పడం ద్వారా లగడపాటి ముందస్తుగా జాగ్రత్త పడబోతున్నారనీ, ఒకవేళ టీడీపీ కాకుండా వైసీపీ అధికారంలోకి వస్తే, అప్పుడు తన సర్వే రిపోర్టును ప్రజలు తప్పుపట్టకుండా ఉండేందుకే లగడపాటి అస్పష్టమైన ఫలితాల్ని ప్రకటిస్తారని తెలుస్తోంది. ఫలితాల్లో మినిమం, మాగ్జిమం మధ్య గ్యాప్ ఎక్కువగా ఉండేలా సర్వే రిపోర్ట్ ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతోంది. దీనంతటికీ కారణం... ఇటీవల వైసీపీ గెలుస్తుందని చాలా సర్వే రిపోర్టులు వస్తుండటమే. అదే నిజమైతే, తన సర్వేకి ఇబ్బంది కలగకుండా ఉండేలా లగడపాటి అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

లగడపాటి ఏం చెప్పినా, ఆ సర్వేను నమ్మాల్సిన పనిలేదనీ, ఇదివరకట్లా ఆయన క్రియాశీల రాజకీయాల్లో లేరు కాబట్టి... ఆయనకు వాస్తవాలు తెలియవనీ, అందువల్ల ఆయన ఇవ్వబోయే సర్వే కూడా వాస్తవాలకు దూరంగా ఉండే అవకాశాలున్నాయంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. ఏపీలో ప్రజలు ఎవరికి ఓటు వేశారో కనిపెట్టడం రాజగోపాల్ తరపున పనిచేసే RG ఫ్లాష్ టీం వల్ల కూడా కాదనీ, మే 23న వచ్చే ఫలితాల కోసం ఎదురుచూడటమే సరైన నిర్ణయం అంటున్నారు వాళ్లు. మొత్తానికి ఏది ఏమైనా... ఈ నెల 19 సాయంత్రం 7 గంటలకు లగడపాటి రాజగోపాల్ చెప్పబోయే సర్వే కోసం మాత్రం ప్రజలు ఎదురు చూస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి :

రెస్ట్ లేని జగన్... లోటస్‌పాండ్‌కి నేతల క్యూ... సీనియర్ల సలహాలు...

రేపు ఆరో దశ... 6 రాష్ట్రాల్లో 59 స్థానాలకు పోలింగ్... బరిలో 979 అభ్యర్థులు...

ఎమ్మెల్సీ ఎన్నికలపై టీఆర్ఎస్, కాంగ్రెస్ దృష్టి... నేడు రెండు పార్టీల సమావేశాలు...

ఇంటర్‌ బోర్డు నుంచి గ్లోబరీనా ఔట్... కొత్త సంస్థకు సప్లిమెంటరీ ఫలితాల బాధ్యత
First published: