GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18
రాజకీయం ప్రస్తుత కాలంలో వారసత్వ సంపదగా లభిస్తోంది. ఒకసారి రాజకీయ రంగ ప్రవేశం చేసిన కుటుంబాల నుంచి తరతరాలుగా వారి వారసులు పొలిటికల్ ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు. దీంతో బలమైన క్యాడర్, పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న నేతలకే ఆయా పార్టీల అధిష్టానాలు టికెట్లు కేటాయిస్తూ వస్తున్నాయి. దీంతో వారసత్వ రాజకీయం సర్వసాధారణమైంది. అయితే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతను ఆ జిల్లాలోని రాజకీయ నాయకుల అమలుచేస్తున్నారట. పార్టీ అధికారంలో వుండగానే తమ వారసులను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. తాము నిర్మించుకున్న కంచు కోటలోని సింహాసనంపై వేరొకరు కర్చీఫ్ వేయకుండా వుండేందుకు తనయులను రంగంలోకి దింపుతున్నారు. కర్నూలు జిల్లాలోని ఆ నాలుగు నిజయోగకవర్గ ఎమ్మెల్యేల కంటే వారి వారసులే రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. భవిషత్తులో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ తమ సుపుత్రులను బరిలో దించి గెలిపించుకునేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించి.. ఓ పద్ధతి ప్రకారం కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నట్లు కర్నూలు వైఎస్ఆర్సీపీలో చర్చ జరుగుతోంది.
జనాల్లో ఉండటమే కాకుండా పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా తమదైన శైలిలో ఎమ్మెల్యే తనయులు ఆర్బాటం చేస్తున్నారట. ఏపీలో 2024 ఎన్నికలకు ఇంకా సమయం దండిగా ఉన్న అర్ధాంతరం ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నట్లు.. మధ్యలో ఎవరైనా దూరిపోతారనే భయమో ఏమో..! వారసులను చాలా స్పీడ్‌గా నియోజకవర్గాల్లో తిప్పేస్తున్నారు. ఆదమరిస్తే ప్రత్యామ్నాయ నేతలు తయారవుతారన్న భయంతో అదను చూసి తనయులను రాజకీయ అరంగ్రేటం చేయించి.. జనాలకు చేరువ చేస్తున్నారు.
ఈ వ్యవహారంలో ముందు వరుసలో ఉన్నారు ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి. తన సుపుత్రుడిని ఎమ్మెల్యేగా చూడాలన్న కల సాకారం చేసుకొనేందుకు జయమనోజ్ రెడ్డిని రాజకీయ వారసుడిగా నియోజకవర్గ ప్రజలకు పరిచయం చేసేశారు. నియోజకవర్గంలో అన్ని అంశాల్లోను తనదైన శైలిలో చొరవ చూపిస్తున్నాడు జయమనోజ్ రెడ్డి. ఎమ్మెల్యే కొడుకుగా అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు చేస్తూ సలహాలు ఇచ్చేస్తున్నారట. అయితే తాను ప్రతిపక్షాల చేస్తున్న విమర్శలను కూడా లెక్క చేయడం లేదట. ఆదోని మున్సిపల్ ఎన్నికల్లో వ్యూహాలన్నీ సాయి మనోజ్‌రెడ్డి రూపకల్పన చేసినట్లు సమాచారం. భారీ మెజారిటీతో 42 మంది కౌన్సిలర్ల గెలుపుకి కీలక పాత్ర పోషించారని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది. ఇదంతా చూసిన తర్వాత వచ్చే ఎన్నికల్లో సాయి ప్రసాద్‌రెడ్డి తనయుడే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారేమోనని పార్టీ క్యాడర్ లో బలమైన వాదనలు వినిపిస్తున్నాయి.
ఇక మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కూడా సాయిప్రసాద్ రెడ్డి మార్గాన్ని ఎంచుకున్నారు. తన తరువాత రాజకీయ వారసునిగా అన్న కుమారుడు ప్రదీప్‌కుమార్‌రెడ్డిని రంగంలో దింపుతున్నట్లు సమాచారం. బాలనాగిరెడ్డి కుమారుడు ధరణీరెడ్డి ఉన్నా.. యాక్టివ్ రోల్ మాత్రం ప్రదీప్ మాత్రమే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో అన్ని వ్యవహారాలను ఆయనే దగ్గరుండి చక్కదిద్దుతున్నారట . ప్రారంభోత్సవాలు.. అధికారిక కార్యక్రమాల్లో ప్రధాన ఆకర్షణ ప్రదీపే. ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాలంటే ప్రదీప్‌తో చర్చించకుండా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ముందడుగు వేయడం లేదట. ఈ క్రమంలో 2024లో బాలనాగిరెడ్డి ప్లేస్‌లో ప్రదీప్‌రెడ్డి పోటీ చేస్తారేమోనని పార్టీ క్యాడర్ చెప్పుకుంటున్నారు.
పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి తన రాజకీయ వారసునికి త్వరలో పట్టంగట్టాలని చూస్తున్నారట. కుమారుడు నరసింహారెడ్డితో పలు గ్రామల్లో గ్రామా ప్రజల సమస్యల పరిష్కారంలో తనదైన పాత్ర పోషిస్తున్నారట. భూములు, పార్టీ నాయకుల్లో విభేదాలు, గ్రామాల మధ్య కొట్లాటలు వస్తే రెండు పక్షాలతో మాట్లాడి పరిష్కరిస్తున్నారట. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనకపోయినా.. పనులు ఎలా చేయాలో.. వేటికి ప్రాధాన్యం ఇవ్వాలో అనధికారికంగా సూచనలు ఇస్తుంటారని చెబుతున్నారు. తనయుడిని రాంభూపాల్‌రెడ్డి రాజకీయ అరంగేట్రానికి ప్రోత్సహిస్తున్నారు. అయన ప్రోత్సాహం చూసిన కార్యకర్తలు., నియోజకవర్గ ప్రజలు వారసుడు సిద్ధమవుతున్నాడని బహిరంగంగానే వ్యాఖ్యలు చేసేస్తున్నారట.
ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి తన కుమారుడు జగన్ మోహన్‌రెడ్డిని రాజకీయాల్లో అరంగేట్రం కోసం తెగ ఆరాట పడిపోతున్నట్లు సమాచారం. రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దించాలని చూశారు. అయితే పార్టీ అధిష్టానం ఇందుకు ససేమిరా అనడంతో వెనక్కు తగ్గినట్లు సమాచారం. తన కుమారుని ఎమ్మెల్యేగా చూసేందుకు తాను గెలిచిన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి.. జగన్‌మోహన్‌రెడ్డిని ఉపఎన్నికల్లో గెలిపించుకుంటానని సీఎం జగన్ ముందు ప్రతిపాదనను ఉంచారట. అయితే సీఎం నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో.. ఇంకోసారి గుర్తు చేశారట. ఏదో విధంగా తన కుమారుడిని ఎమ్మెల్యేగా చూడాలని తెగ తపించి పోతున్నారట చెన్నకేశవరెడ్డి. దానికి తగ్గట్టుగానే ఎమ్మిగనూరులో జగన్‌మోహన్‌రెడ్డి తీరిక లేకుండా పర్యటిస్తూ బలం తగ్గకుండా చేసుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.