Murali Krishna, News18, Kurnool
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ (YSRCP) ఎమ్మెల్యేలకు వరుస షాక్‌లు తప్పడం లేదు.. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలకు విభిన్న అనుభవాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పథకాలకు పెట్టే రూల్స్ విషయంలో ప్రజలే ఎదురు క్లాస్ పీకే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీకు ఓటేస్తే మాకేంటి ప్రయోజనం అంటూ ఓ మహిళ.. ఎమ్మెల్యేను దుమ్ముదులిపిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. కర్నూలు జిల్లా (Kurnool District) కోడుమూరు పట్టణంలో ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్‌కు చేదు అనుభవం ఎదురైంది. గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా కోడుమూరులో పర్యటిస్తున్న ఎమ్మెల్యేకు ఒక మహిళ చుక్కలు చూపించింది. డైరెక్టుగా మీకు ఓటు వెయ్యడం వల్ల మాకు ఎలాంటి ప్రయోజనం లేదంటూ మండిపడింది.
వాహన మిత్ర పేరిట తెచ్చిన పథకం వల్ల తమకు ఓరిగిందేమి లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉన్న రేషన్ కార్డు తీసేసి మీరు ప్రభుత్వ పథకాలకు అనర్హులు అని చెబుతున్నారు. మాకు ఉన్నది ఒక్క జీపు దాని ఆధారంగానే మేము బ్రతుకుతు జీవనం సాగిస్తున్నాము అలాంటి మాకు వాహనామిత్ర పథకం ఇవ్వకపోగా ఉన్న రేషన్ కార్డు తీసేస్తే మేము ఎలా బ్రతకాలి మా పిల్లలను ఎలా చదివించుకోవాలి అంటూ చివాట్లు పెట్టింది.
నిత్యావసరాల సరుకుల ధరలు పెంచి... కరెంట్ బిల్లులు పెంచి బస్సు చార్జీలు, పెట్రోలు ధరలు వంటి వాటి ధరలు మాత్రం పెంచుకుంటూ పోయి సామాన్యుల నడ్డి విరుస్తున్నారంటూ మహిళ నిలదీయడంతో సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే అక్కడి నుంచి సైలెంట్‌గా వెనుదిరిగారు.
ఇలాంటి పరిస్థితే దాదాపు అన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలకు ఎదురవుతోంది. అటు డోన్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ కూడా ఎదురయింది. డోన్ నియోజకవర్గంలోని గడపగడపకు మన ప్రభుత్వం అంటూ వెళ్లిన మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డికి ప్రజల నుంచి నిరసన సెగ తగిలింది. ప్రభుత్వ పథకాల గురించి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వివరిస్తూ ఉండగా మహిళలు ప్రశ్నల వర్షం కురిపించారు.
ఏకంగా ఒక మహిళ ధరలు పెంచి మా డబ్బులు మాకు ఇస్తున్నారంటూ అక్కడ ఉన్న అధికారులంతా అవాక్కయ్యారు. ఇంకో మహిళ ఏకంగా మంత్రి గారిని ఏమైంది రెడ్డి గారు ప్రభుత్వ పథకాలు అంటున్నారు. ఎద్దు ఈనిందంటే దొడ్లో కట్ అయిపోనట్లుంది మీ ప్రభుత్వం అంటూ చివాట్లు పెట్టడంతో ఆర్థిక శాఖ మంత్రి సైతం అక్కడి నుంచి సమాధానం చెప్పలేక వెనుదిరిగినటు వంటి పరిస్థితి. ఇలా జిల్లాలో గడపగడపకు ప్రభుత్వమంటూ వెళ్లిన ప్రజా ప్రతినిధులకు మంత్రులకు ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి ఎదురు ప్రశ్నలు వేస్తూ చుక్కలు చూపిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News