Murali Krishna, News18, Kurnool
ఉగాది (Ugadi) అంటే అందరికిముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి.. షడ్రుచులను రుచి చూడడం బంధువులతో కలిసి ఆనందంగా గడపడం, కొత్త బట్టలు ధరించి గుడికి వెళ్లడం, గుడిలో అర్చనలు, అభిషేకాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహించడం, గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం ఇలాంటివే చూసి ఉంటాం. సాధారణంగా మన తెలుగు సాంప్రదాయం ప్రకారం ఉగాది అంటే నూతన సంవత్సరంగా భావిస్తుంటాం అలాంటి నూతన సంవత్సరం నాడు జీవితంలో భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటూ ఉంటాం. కానీ కొన్ని చోట్ల మాత్రం ఉగాది పండుగను విచిత్రమైన ఆచారాలతో జరుపుకుంటూ ఉంటారు ఉగాది పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడమే కాకుండా తరతరాల నుండి వస్తున్న ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు.
అలాంటి ఉగాది పండుగ రోజున కర్నూలు జిల్లా (Kurnool District) లో కూడా ఓ ప్రాచీన ఆచారం నేటికి కొనసాగిస్తూనే ఉన్నారు. కర్నూలులో పట్టణంలోని కల్లూరులో ఉగాది ఉత్సవాలను ఇక్కడి ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. నగరంలోని కల్లూరులోని రైతులు ఉగాది ఉత్సవాల్లో భాగంగా ఎద్దుల బండ్లను ప్రత్యేకంగా అలంకరించి కల్లూరు పురవీధుల్లో ఊరేగింపుగా వెళ్తారు. మేళాతాళాలతో నృత్యాలు చేస్తూ రైతులు సంతోషంగా ఉగాది పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది.
ఈ ఉగాది పండుగ ఉత్సవాల్లో భాగంగా కల్లూరులోని చౌడేశ్వరి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేకమైన పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభిస్తారు. ఈ ఉత్సవాలకు రైతులు ఎడ్ల బండ్లు, గాడిద బండ్లు అలాగే గాడిదలతో వచ్చి ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణలు చేస్తారు.వర్షాలు బాగా కురవాలని ఎద్దుల బండ్లను అలంకరించి సుంకులమ్మ ఆలయం చుట్టూ వున్న బురదలో తిప్పడం ఇక్కడ సంప్రదాయంగా ఉంటుంది.
అయితే మరోవైపు రజకులు వారి కుటుంబాలు సుంకులమ్మ ఆలయం చుట్టూ బురదలో గాడిదలతో ప్రదక్షణలను చేస్తూ అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందుతారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు కర్నూలు జిల్లాతో పాటు తెలంగాణ (Telangana) నుండి అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News