Murali Krishna, News18, Kurnool
శ్రీశైల మహాక్షేత్రం (Srisailam Temple) లో ఉగాది ఉత్సవాలు (Ugadi Festival) వైభవంగా ప్రారంభమయ్యాయి. ఐదురోజుల పాటు 23వ తేదీ వరకు నిర్వహింపబడే ఉగాది ఉత్సవాల సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఉత్సవం ప్రారంభ కార్యక్రమాలు ఆగమశాస్త్రానుసారం ప్రారంభించారు. ముందుగా ధర్మకర్తల మండలి అధ్యక్షులు, రెడ్డివారి చక్రపాణి రెడ్డి కార్యనిర్వహణాధికారి, ఎస్ లవన్న స్థానాచార్యులు (అధ్యాప), అర్చకస్వాములు, వేదపండితులు, అధికారులు సంప్రదాయబద్ధంగా ఆలయ ప్రాంగణంలోని స్వామివార్ల యాగశాల ప్రవేశం చేశారు. ఆలయప్రవేశం చేసిన వెంటనే వేదపండితులు వేదపారాయణలు చేసి వేదస్వస్తి నిర్వహించారు.
శివసంకల్పం వేదపఠనం అయిన వెంటనే అర్చకస్వాములు, వేదపండితులు, స్థానాచార్యులు ( అధ్యాపక) వారు లోకక్షేమాన్ని కాంక్షిస్తూ ఉత్సవ సంకల్పాన్ని పఠించారు. దీనికే శివసంకల్పం అనిపేరు. ఈ సంకల్పంలో దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించ కుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలని, జనులందరికి ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు జరగకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన, ప్రమాదాలు మొదలైనవి. జరగకుండా ఉండాలని, సుఖశాంతులతో ఉండాలని అర్చకులు, వేదపండితులు సంకల్పపఠనం చేశారు.
ఇది చదవండి: ఒకేసారి ఐదుగురికి అరుదైన ఆపరేషన్లు.. కర్నూలు డాక్టర్ల రికార్డ్
అమ్మవారి ఆలయంలో ప్రత్యేకపూజలు ఉత్సవాలలో భాగంగా శ్రీ అమ్మవారి ఆలయంలో విశేష కుంకుమార్చనలు, నవావరణార్చన పూజ జరిపించబడ్డాయి. ఉత్సవాల మొదటిరోజు సాయంకాలం జరిగే అంకురార్పణకు ఎంతో విశేషముంది. ఆలయ ప్రాంగణంలోని నిర్ణీత పునీత ప్రదేశములోని మట్టిని సేకరించి యాగశాలకు తీసుకువస్తారు. దీనినే,, మృత్సంగ్రహణం, అంటారు. తరువాత ఈ మట్టిని తొమ్మిది పాలికలలో (మూకుళ్ళలో) నింపి, దాంట్లో నవధాన్యాలను పోసి, ఆ మట్టిలో మొలకెత్తించే పనిని ప్రారంభిస్తారు. ఈ అంకురారోపణ కార్యక్రమానికి చంద్రుడు అధిపతి, శుక్లపక్ష చంద్రునివలే పాలికలలోని నవధ్యానాలు సైతం దినదినాభివృద్ధి చెందాలని ప్రార్థిస్తారు. పాలికలలో రోజూ నీరు పోసి నవధాన్యాలు పచ్చగా మొలకెత్తేలా చూస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News, Srisailam Temple, Ugadi 2023