(T. Murali Krishna, News18, Kurnool)
కర్నూలు జిల్లా ఆ గ్రామ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు దినసరి కూలి పనులకు వెళ్లాలన్న, విద్యార్థులు చదువుకోవడానికి పాఠశాల, కళాశాలలకు వెళ్లాలన్నాసాహసం చేయాల్సిందే..! కొన్నేళ్లుగా కలగానే మిగిలిపోయిన గ్రామస్తుల కోరిక...హామీలు ఇచ్చారు గతంలో చాలాసార్లు బ్రిడ్జి నిర్మాణం చేపట్టడానికి నిధులు కూడా మంజూరు చేశారు. నిర్మాణం కోసం శిలాఫలకాన్ని కూడా ఆవిష్కరించారు. కానీ నిర్మాణం పనులు మాత్రం గాలికి వదిలేస్తారు. బెజ్జ నిర్మాణం జరగకపోవడానికి కారణమేంటి...
కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం పరిధిలోని కర్నూల్ పట్టణానికి ఆనుకొని ఉన్న గొందిపర్ల, తాండ్రపాడు, పూల తోట, దేవమాడ, ఇలా కొన్ని గ్రామాలో నివసించే ప్రజలు నిత్యం సాహసం చేయాల్సి వస్తుంది. గ్రామాల్లో ఉండే విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలన్న పై చదువులకై కళాశాలలకు వెళ్లాలన్న నదిలో సాహసం చేయాల్సి వస్తుంది.
వీరి బాధలు వర్ణనాతీతం
కనుచూపుమేరలో ఉన్న కర్నూల్ నగరానికి చేరుకోవడానికి. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు పడేటటువంటి బాధలు వర్ణనాతీతం. గత 50 సంవత్సరాలకు పైగా ఇక్కడ నివసించే పేద ప్రజలుదినసరి కూలీ పనులకు వెళ్లాలంటే ఈ నది మార్గంలోనే కర్నూల్ పట్టణానికి చేరుకోవాల్సి వస్తుంది. కనుచూపుమేరలో కర్నూలుకు చేరుకోవడానికి నది మార్గంలో ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది. ఒకవేళ నది పొంగి ప్రవహిస్తే నగరానికి చేరుకోవడానికి చుట్టూ 25 కిలోమీటర్లు జాతీయ రహదారి 45 గుండా ప్రయాణించి నగరానికి చేరుకోవాల్సి వస్తుంది.
ప్రాణాలు పణంగా పెట్టాల్సిందే...
పట్టణానికి వెళ్లే క్రమంలో అనేకమంది ప్రమాదానికి గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కేవలం ఒక కిలోమీటర్ దూరం ఉన్నటువంటి కర్నూల్ నగరానికి చేరుకోవడానికి ఇక్కడున్నటువంటి గ్రామస్తులు నిత్యం అవస్థలు పడాల్సి వస్తుంది. నదిలో ప్రయాణించే క్రమంలో చాలాసార్లు నదిలో నీళ్లు ఆకస్మాత్తుగా పెరిగి నదీ ప్రవాహంలో ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి సంఘటనలు చాలానే జరిగాయి.
నిత్యం సాహాసం చేయాల్సిందేనా..
అంతేకాదు ఇక్కడికి గ్రామాల్లో నివసించే ప్రజలు ఏదైనా అత్యవసర సమయాల్లో పట్టణానికి చేరుకోవాలన్న మార్గం మధ్యలోనే ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితులు లేకపోలేదు.ఇలా నిత్యం సాహసం చేస్తూ బ్రతుకుతున్నారు ఇక్కడి గ్రామస్తులు.
ప్రభుత్వాలు మారిన మారని పల్లె ప్రజల జీవన విధానం
గతంలో చాలాసార్లు ప్రభుత్వాలకు అధికారులకు తుంగభద్ర నదిపై వంతెన నిర్మించి తమను ఆదుకోవాలంటూ ఎన్నో ఉద్యమాలు చేసినప్పటికీ ఈ బ్రిడ్జి నిర్మాణం మాత్రం చేపట్టలేదు. ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి నాయకులు మాత్రం ఈ గ్రామస్తుల సమస్యలు తీరాలంటే వంతెన నిర్మాణం జరగాల్సిందేనని కచ్చితంగా వంతెన నిర్మించేందుకు చర్యలు చేపడతామని హామీలు ఇస్తున్నారే తప్ప నిర్మాణం చేసేందుకు అడుగులు మాత్రం వేయటం లేదు.
వంతెనకు అడ్డుపడుతున్న బడా నేత..!
ఇక్కడ వంతెన నిర్మాణం జరగకుండా ఒక బడా నాయకుడు అడ్డుపడుతున్నాడని ఆరోపణలు గ్రామీణ ప్రాంతాల ప్రజల నుండి గట్టిగానే వినిపిస్తున్నాయి. వంతెన నిర్మాణం జరిగితే పరిశ్రమకు ఇబ్బంది అవుతుందనే కారణంతో వంతెన నిర్మాణానికి అడ్డుపడుతున్నాడని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఒక వ్యాపారవేత్తకు అనుగుణంగా కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కోరుతున్నారు...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News