Murali Krishna, News18, Kurnool
వడ్డించేవాడు మనవాడైతే ఇంకేముంది ఎగిరిగంతేయచ్చు అన్నట్టు. అలా సాగుతుంది ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వ పాలన. ఉమ్మడి కర్నూలు జిల్లా (Kurnool District) నంద్యాల లోని పాణ్యం నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన ఒక సర్పంచ్ తన చేతి వాటం చూపించాడు. ఐతే అడ్డుకోవాల్సిన అధికారులు అవునా..! అంటూ ఆశ్చర్యపోవడంతో జనం షాకవ్వాల్సిన పరిస్థితి. అధికార పార్టీ ముఖ్య నాయకుల అండదండలతో ఏకంగా ప్రభుత్వ పాఠశాలనే కబ్జా చేశాడు. వైసిపి (YSRCP) నేత ఏకంగా ప్రభుత్వ పాఠశాలను ఆక్రమించి రెండు గదుల ఇంటిగా మార్చేసుకున్నాడు. వ్యవహారాన్ని స్థానికులు బయటపెట్టడంతో ఉలిక్కి పడడం అధికారుల వంతైంది. వివరాల్లోకి వెళ్లితే, నంద్యాల జిల్లా పాణ్యం పట్టణం ఇందిరానగర్‌లోని ఓ మూతబడిన పాఠశాలపై వైఎస్సార్సీపీ నేత కన్ను పడింది. ఇంకేముంది వెంటనే పాఠశాలలోని శిలాఫలకాన్ని, బోర్డు తొలగించేశాడు. దర్జాగా రెండు గదులు, మెట్లు, వంటగది, బాత్ రూములు, హాలు చకచకా నిర్మించేశాడు.
ఇదంతా స్థానిక అధికారుల సహాయంతో కొద్దిసమయంలోనే పూర్తి చేసేసాడు. ఆ పై ప్రభుత్వ పెద్దల అండదండలు కూడా ఉండడంతో పాఠశాల ఆక్రమణలో అతనికి ఎదురులేకుండా పోయింది. దీనిపై స్థానికులు సమాచారం ఇచ్చినా నిర్మాణాన్ని అడ్డుకొనేందుకు అధికారులు స్పందించకపోవడం బాధాకరం. టీడీపీకి చెందిన మాజీ జడ్పీటీసి సభ్యురాలు నారాయణమ్మ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు రెడీ అవడంతో విషయం కాస్తా బయటకు పొక్కింది.
దీనిపై ఎంఇవో స్పందిస్తూ పాఠశాల భవనం ఆక్రమణ గురైన్నట్లు తనకు తెలీదన్నారు. 2013లో రాజీవ్ విద్యా మిషన్ పథకం ద్వారా రూ. 5.30 లక్షల ఖర్చుతో అప్పటి ప్రభుత్వం పాఠశాలను నిర్మించారు. ఆనాటి నుండి విద్యార్ధుల సంఖ్య తగ్గుతుండడంతో ఐదేళ్ల క్రితం పాఠశాలను మూసేసారు.
ఇదే అదనుగా చూస్తున్న వైఎస్సార్సీపీ నేత బరి తెగించి మరీ పాఠశాల భవనాన్ని ఇంటిగా మార్చేసాడు. వ్యవహారం కాస్తా ప్రతిపక్ష నేత చంద్రబాబుకు తెలియడంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాడు-నేడు అంటూ ఈ స్కూల్ గురించి ట్వీట్ చేశారు. విద్యార్ధులు రాకపోతే పాఠశాలకు చేర్చే మార్గాన్ని చూడాల్సిన ప్రభుత్వం, పాఠశాల భవనం వైసీపీ నేతకు కబ్జాగా మారడం పట్ల విపక్షాలు తీవ్రంగా తప్పు బడుతున్నారు. ఇదేనా నాడునేడు అంటూ వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నాడు నేడు కార్యక్రమం, ప్రభుత్వ బడుల రూపురేఖలు మర్చేందుకు వైఎస్ జగన్ సర్కారు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న తరుణంలో ఇప్పుడు తమ పార్టీ నేత ఇలాంటి దుశ్చర్యకు పాల్పడటంపై అదిష్టానం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News