రిపోర్టర్ : మురళి
లొకేషన్ : కర్నూల్
నంద్యాల జిల్లా బనగానపల్లె పోలీస్ స్టేషన్ ఎస్ఐ శంకర్ నాయక్ ను అధికారులు సస్పెండ్ చేశారు. విచారణ పేరుతో స్టేషన్ కు వచ్చిన బాధితులను దుర్భాషలాడిన కారణంగా బనగానపల్లె మండలం చినరాజుపాలెం గ్రామానికి చెందిన గుర్రమ్మ (45 )ఆమె కుమారుడు దస్తగిరి (24) శనివారం సాయంత్రం బనగానపల్లె పోలీస్ స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వెంటనే బాధితులను స్థానిక ఆసుపత్రికి తరలించే లోగా గుర్రమ్మ కుమారుడు దస్తగిరి మార్గం మధ్యలోనే ప్రాణాలను కోల్పోయాడు. దీంతో బంధువులు చిన్న రాజుపాలెం గ్రామస్తులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. వీరికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.
ఆదివారం సాయంత్రం వరకు రెండు గంటలపాటు రోడ్డుకు అడ్డంగా బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో బనగానపల్లె మండలంలో తీవ్ర ఉదృత వాతావరణం నెలకొంది. ఈ కేసుపై విచారణ చేపట్టడానికి రాయలసీమ రేంజ్ డీఐజీ సెంథిల్ కుమార్, నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డిబనగానపల్లె పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. దీనిపై చర్యలు తీసుకుంటామని బాధితులకు హామీ ఇచ్చి ఈ ఘటనకు కారణమైన ఎస్సై శంకర్ నాయక్ ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించడంతో ఆందోళనను విరమించారు. దస్తగిరి మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లి చిన్న రాజుపాలెం గ్రామంలో అంతిమ సంస్కారాలు చేశారు.
ఈ విషయంపై రాయలసీమ రేంజ్ డిఐజి సెంథిల్ కుమార్ నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ.. బనగానపల్లె మండలం చిన్నరాజుపాలెం గ్రామానికి చెందిన నాగలక్ష్మి వర్గానికి, దస్తగిరి కుటుంబ సభ్యులకు డబ్బుల విషయంలో గత కొంతకాలంగా గొడవలు జరుగుతుండేవని చెప్పారు. ఈనెల 27న వారు మరోసారి ఘర్షణ పడగా ఇరువు వర్గాలను ఎస్ఐ స్టేషన్ కు పిలిపించారని తెలిపారు.ఈ విచారణకు దస్తగిరి వర్గం వారు పిలిచిన రోజు కాకుండా మరుసటి రోజు రావడంతో వారు మళ్లీ ఘర్షణ పడకుండా ఉండేందుకు ఎస్సై కొంత మాట్లాడినట్లు తెలిపారు. దీనిపై విచారణ చేస్తున్నామని అలాగే నాగలక్ష్మి వర్గానికి చెందిన 9 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News