Murali Krishna, News18, Kurnool
నల్లమల అటవీ ప్రాంతం (Nallamala Forest) లో తల్లిపులి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. నాలుగు పులి కూనలను రక్షించిన స్థానికులు, అధికారులు వాటిని తల్లిచెంతకు చేర్చేందుకు శ్రమిస్తున్నారు. నంద్యాల జిల్లా (Nandyal District) కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురం గ్రామ సమీపంలో లభ్యమైన పులిపిల్లలను తల్లి చెంతకు చేర్చడమే లక్ష్యంగా చర్యలు చేపట్టామని నాగార్జున సాగర్- శ్రీశైలం పులుల అభ్యయారణ్యం క్షేత్రాధికారి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఆత్మకూరు పట్టణంలోని అటవీ అతిథి గృహంలో బైర్లూటిలోని అటవీ అతిథిగృహంలో పులిపిల్లలను సంరక్షిస్తున్నట్లు తెలిపారు. తల్లిపులిని టి-108గా గుర్తించామన్నారు. పులికూనలు నాలుగూ ఆడవేనన్నారు. అయితే మొదటి రెండు రోజులు ఆ కూనలు ఆహారం లేక వాటి ఆరోగ్యం క్షీణించినట్లు తెలిపారు. ఇప్పుడు అవి ఒక ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాయని కాస్త ఆహారం పాలు తాగి ఉత్సాహంగా ఉన్నాయన్నారు.
పులి కూనలు దొరికిన ప్రాంతంలో తల్లిపులి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టమని తెలిపారు.గత రెండు రోజులుగా ఆపరేషన్ లీలావతి పేరుతో గాలింపు చర్యలు కొనసాగుతుందన్నారు. తల్లిపులి జాడ దొరకని పక్షంలో రెండేళ్ల పాటు పులిపిల్లలను జూలో సంరక్షించి ఆ తర్వాత అడవిలో వదిలి వేస్తామన్నారు.
పులిపిల్లలను తల్లి వద్దకు చేర్చేందుకు శాస్త్రీయ పద్ధతుల్లో ప్రయత్నిస్తున్నాం. తల్లి పులి జాడ కనిపించకపోతే ఎన్‌టీసీఏ నిబంధనలు పాటిస్తాం. మొదటి కాన్పులో నాలుగు పిల్లలు పుట్టాయి. డ్రోన్ల సాయంతో తల్లి జాడను పరిశీలిస్తున్నాం. కూనలు దొరికిన ప్రాంతానికి సమీపంలోనే దాని కదలికలు ఉన్నాయి. పక్కా ప్రణాళికతో పిల్లలను తల్లి వద్దకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నాం. కూనల సంరక్షణ ముఖ్యమే, అదే సమయంలో తల్లి వద్దకే చేరడం మరీ ముఖ్యం.
తల్లి నుంచి దూరమైన పులిపిల్లలను జూలో సంరక్షించాల్సి వస్తే ఆ కూనలు తమ సహజ గుణాలను కోల్పోయే అవకాశం ఉంటుంది. పులి కూనలు అడవిలో తల్లి వెంట తిరుగుతూ ఎన్నో విషయాలు నేర్చుకుంటాయి. దాదాపు రెండున్నరేళ్ల దాకా పులి పిల్లలు తమ అమ్మ వెంటే ఉంటాయి. ఆ సమయంలో అవి సహజంగా వేటాడలేవు. ఆరు నుంచి 8 వారాల సమయంలో కొద్ది కొద్దిగా మాంసం తిన్నాడాన్ని ప్రారంభిస్తాయి. తమ తల్లిని అనుసరిస్తూ ఇతర వన్యప్రాణులను వెంబడించడం, వేటాడటం నేర్చుకుంటాయి. ఒకటిన్నర సంవత్సరం వయసు దాకా తల్లులు వేటాడిన జంతువుల మాంసాన్నే తింటాయి. తల్లి వెంట తిరుగుతూ వేటాడటం, ఆత్మరక్షణ, శారీరక, మానసిక దృఢత్వం పెంపొందించుకుంటాయి. జూలో పెరిగితే వీటన్నింటిని ఇలాంటి లక్షణాలను కోల్పోతాయి.
అధికారులలో ఉత్కంఠ..
అటవీ శాఖ అధికారులు పులి కూనలను కంటికి రెప్పలా చూసుకుంటున్నా అవి మాత్రం భయం భయంగా గడుపుతున్నాయి. తల్లి పులి జాడ కోసం అటవీ శాఖ అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తల్లి కోసం గత 2 రోజులుగా గాలింపు చర్యలు సాగిస్తున్నారు. పులి సహజంగా గాండ్రిస్తుంది. కానీ పిల్లల కోసం వేతేకే టప్పుడు చేసే శబ్దం మరో విధంగా ఉంటుందని అటవీ అధికారులు చెబుతున్నారు. మూడు రోజులైనా తల్లిపులి తన పిల్లల కోసం రాకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. అదే విధంగా తల్లి నుంచి దూరమైన పులి కూనల ప్రవర్తన ఎలా ఉంటుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News, Tigers