తేలు (Scorpio)ని వీడియోల్లోనే చూస్తేనే ఒళ్లంతా జలదరిస్తుంది.. కర్మ కాలి మన కంట పడిందా అది కుడితే అరిసే అరుపుకంటే పదింతలు అరుస్తూ పారిపోతామంతే. కానీ వీళ్లు మాత్రం ఎంచక్కా తేళ్లను పట్టుకుని ఆడుకుంటారు. ఆడుకోవడమే కాదండోయ్ నాలుకపై, నుదిటిపై పెట్టుకుని హ్యాపీగా స్టిల్స్ ఇస్తున్నారు. ఇంత ధైర్యంగా వాటిని పట్టుకుంటున్నారు ఏం చేయవా అని వాళ్లని అడిగితే.. ఇవి మా దేవుడికి ఇచ్చే తేళ్లు మమ్మల్ని ఏమీ చేయవంటూ సమాధానం ఇస్తున్నారు.
కర్నూలు (Kurnool) జిల్లాలో ఈ వింత ఆచారం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. శ్రావణ మాసం మూడో సోమవారం రోజు ప్రతి ఏడాది ఇలా తేళ్లతో స్వామివారికి అభిషేకం చేస్తారు. కోడుమూరు (Kodumur) కొండపై కొలువైన కొండలరాయుడికి భక్తులు తేళ్లతో అభిషేకం చేస్తారు. కొండలపై రాళ్లు తీసి తేళ్లను పట్టుకొంటారు. ఆ తర్వాత వాటికి దారం కట్టేసి తమ నుదిపై, నాలిక, చేతులపై పెట్టుకుంటారు. అవి వాళ్లని కుట్టవని అక్కడి భక్తులు చెబుతున్నారు. ఒకవేళ కుట్టినా గుడిచుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తే నొప్పి వుండదంటారు. ఇది దేవుని మహిమ అని కొందరంటే కాదు మూఢ నమ్మకమని మరి కొందరంటారు.
ఇలాంటి ఆచారం తెలుగు రాష్ట్రాల్లో మరోచోట కూడా ఉంది. తెలంగాణ - కర్ణాటక సరిహద్దులోని కందుకూరు గ్రామంలోనూ తేళ్లతో పూజలు చేస్తారు. సాధారణంగా నాగ పంచమి రోజు పాములకు పాలు పోసి పూజలు చేస్తాం. కానీ ఈ గ్రామంలో నాగుల పంచమికి బదులు తేళ్ల పంచమి చేస్తారు. కొండపై ఉన్న తేళ్ల దేవతకు పూజలు చేస్తే మంచి జరుగుతుందని అక్కడి ప్రజల నమ్మకం.
ఇలా పూజలు చేయడం వెనుక ఒక కథ కూడా ఉందంటారు కందుకూరు గ్రామస్థులు. ఈ గ్రామం పక్కనే ఉన్న గుట్టపై చాన్నాళ్ల కిందట ఓ వ్యక్తి తవ్వకాలు చేస్తుండగా పెద్ద తేలు బయటపడిందని.. తనను కుట్టకుండా ఉంటే గుడి కడతా అని మొక్కుకున్నాడని గ్రామంలో ఉన్న పెద్దలు చెబుతుంటారు. ఆ తర్వాత ఆ తేలు అతన్ని కుట్టకుండా మాయమైందని అప్పటి నుంచి అక్కడ గుడి కట్టి.. ప్రతి నాగపంచమికి ఇలా పూజలు చేస్తారంట. శ్రావణమాసంలో వచ్చే మొదటి పంచమి రోజుని ఇక్కడ తేళ్ల పంచమిగా పండగ చేసుకుంటారు.
ఆయా ప్రాంతాల ప్రజలు వీటిని విశ్వాసంగా భావించి.. తేళ్లతో పూజలు చేస్తే మంచిదని నమ్ముతుంటారు. అయితే, కొందరు వీటిని మూఢ నమ్మకాలని విష పురుగులు పొరపాటున కుడితే ప్రమాదకరమై ప్రాణాలు పోయే అవకాశం ఉందని.. వీటిని విశ్వసించొద్దని చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Festival, Hindu festivals, Kurnool, Scorpio