Murali Krishna, News18, Kurnool
నంద్యాల జిల్లా (Nandyal District) పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న నలుగురు పోలీసులు దొంగలతో జతకట్టి చేయకూడని పనులు చేశారు. స్టేషన్ సమాచారం ఇతరులకు చేరవేస్తున్నారని, అధికారుల ఆదేశాలను పట్టించుకోలేదని, మరియు ఇతర కారణాల వలన విచారణ జరిపించి శాఖాపరమైన చర్యలలో భాగంగా సస్పెండ్ చేస్తూ నంద్యాల జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. నంద్యాలలో పలు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఒక ఏ.ఎస్.ఐ. ముగ్గురు కానిస్టేబుళ్లు ఉన్నతాధికారుల మాటలను పెడచెవిన పెట్టి అక్రమార్కులతో జత కడుతున్నారు. పోలీస్ స్టేషన్ అంటే ఆదాయ వనరుగా భావిస్తూ అడ్డదారులు తొక్కుతున్నారు. తమకు అనుకూలంగా ఉంటే కేసులను కాసులుగా మార్చుకుంటున్నారు.
లేనిపక్షంలో న్యాయం కోసం పోలీసు స్టేషన్ మెట్లెక్కే బాధితుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాలో 6 పోలీస్ సబ్ డివిజన్లు, 18 సర్కిళ్లు, 78 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వాటిలో 4600 మంది వరకు పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు సుమారు 1500 మందికి పైగా హోంగార్డు ఉమ్మడి జిల్లాలో పని చేస్తున్నారు.
వీరిలో కొందరు విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరచి జాతీయ, రాష్ట్ర స్థాయిల్లోనూ అవార్డులు పొందిన వారు లేక పోలేదు. మరికొందరు మాత్రం తమ ఖాకీ దుస్తులు అడ్డుగా పెట్టుకుని అక్రమ దందాలకు తెర తీస్తున్నారు. న్యాయం కోసం పోలీసు స్టేషన్ మెట్లెక్కిన బాధితులకు న్యాయం చేయకపోగా.. అక్రమార్కులతో చేయి కలిపి ఆయా పోలీస్ స్టేషన్ లలో తాము చెప్పిందే వేదం, చేసేదే సరి అంటూ రెచ్చిపోతున్నారు.
ప్రజలకు రక్షణ కల్పించాల్సింది పోయి భక్షకులుగా మారుతున్నారు. విధి నిర్వహణ పేరుతో హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు. వీరిలో కానిస్టేబుల్ నుంచి ఎస్సైల వరకు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో తమను ప్రశ్నించే వారిపై లాఠీలు ఝుళిపిస్తున్నారు. దీంతో బాధితులు న్యాయం కోసం స్టేషన్ మెట్లు ఎక్కాలంటేనే భయపడాల్సినపరిస్థితి ఏర్పడింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra pradeh, Kurnool, Local News