ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పదో తరగతి పేపర్ల లీకేజ్ (AP 10th Papers Leak) వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. పరీక్షల తొలిరోజు నంద్యాల, చిత్తూరు జిల్లాల్లో పేపర్లు లీకైనట్లు వార్తలు రాగా.. నంద్యాల ఘటనలో నిందితులు వెలుగుకి వచ్చారు. శ్రీకాకుళంలో హిందీ పేపర్ లీకైనట్లు ప్రచారం జరిగినా అధికారులు కొట్టిపారేశారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లె జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి పేపర్ లీకయిన ఘటనలో మాత్రం నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం12 మందిని అదుపులోకి తీసుకున్నారు. అంకిరెడ్డిపల్లె స్కూల్లో పరీక్ష రాసేందుకు చుట్టుపక్కల ఆరు స్కూళ్లకు చెందిన 183 మంది విద్యార్థులు వచ్చారు.
కేసులో అంకిరెడ్డిపల్లె జెడ్పీ స్కూల్ క్లర్క్ రాజేష్, క్రాఫ్ట్ టీచర్ రంగనాయకులు, అబ్దుల్లాపురం స్కూల్ ఫిజిక్స్ టీచర్ నాగరాజు. గొరుమన్పల్లె జెడ్పీ స్కూల్ ఫిజిక్స్ టీచర్ నీలకంఠేశ్వర రెడ్డి, అబ్దుల్లాపురం జెడ్పీ స్కూల్ తెలుగు టీచర్ ఆర్యబట్టు, గొరుమనపల్లె తెలుగు టీచర్ పోతులూరు, అంకిరెడ్డిపల్లె జెడ్పీ స్కూల్ తెలుగు టీచర్లు, మధు, దస్తగిరి, వెంకటేశ్వర్లు, కనకరెడ్డిపల్లె స్కూల్ టీచర్ వనజాక్షి,తుమ్మలపెంట రామకృష్ణ ప్రైవేట్ స్కూల్ టీచర్ లక్ష్మీ దుర్గను అదుపులోకి తీసుకున్నారు.
నిందితులందరూ ముందుగానే మాట్లాడుదొని పిల్లలందరినీ పాస్ చేయించాలని ప్లాన్ వేసి క్లర్క్ రాజేష్ సాయంతో క్వశ్చన్ పేపర్ ను ఫోటో తీసి పంపిస్తే దానికి జవాబులు తయారు చేసి అన్ని క్లాసులకు పంపిస్తామని చెప్పారు. అనుకున్నప్రకారమే రాజేష్.. ఎగ్జామ్ హాల్లో ఓ విద్యార్థిని దగ్గరున్న క్వశ్చన్ పేపర్ ను ఫోటో తీసి క్రాఫ్ట్ టీచర్ రంగనాయకులు సాయంతో టీచర్లకు అందించాడు. ఆ ఫోన్ నుంచి నాగరాజు, నీలకంఠేశ్వర రెడ్డి... మిగిలిన 9మంది టీచర్లకు ఫార్వర్డ్ చేశారు. టీచర్లంతా అన్సర్ షీట్స్ తయారు చేసి 9వ తరగతి విద్యార్థుల సాయంతో 9 ఎగ్జామ్స్ హాల్స్ కు పంపారు. ఇందులో ఇన్విజిలేటర్స్ పాత్రకూడా ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు.
దీనిపై కొలిమిగుండ్ల ఎమ్మార్వో మొహియుద్దీన్ ఫిర్యాదు మేరకు కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్లో Cr. No. 88/22 U /s 188, 143, 406, 409, 120 (B) IPC, 65 IT Act, Section 8 r/w 4, 5 AP Public exams (Prevention of Malpractice and unfair means) 1997 కింద రాజేశ్, రంగనాయకులతో పాటు 09 మంది టీచర్లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నాగరాజు, నీలకంటేశ్వర్ రెడ్డి, పోతులూరు, మధు, వనజాక్షి, దస్తగిరి, వెంకటేశ్వర్లు, లక్ష్మి దుర్గా, రాజేశ్ మరియు రంగనాయకులు, ఆర్యభట్టు, బొంతల మద్దిలేటి (CRP, కొలిమిగుండ్ల) ఈ 12 మందినీ అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Ssc exams