Loan Apps: తెలుగు రాష్ట్రాల్లో లోన్ యాప్ (Lona APP) ల ఆగడాలకు అడ్డుకట్ట పడడం లేదు. రోజు రోజుకూ వారి వేధింపులతో ప్రాణాలు పోతూనే ఉన్నాయి. ఇటీవల జరుగుతున్న ఆత్మహత్య (Suicides) ల్లో ఎక్కువ శాతం ఈ లోన్ యాప్ ల బాధితులే ఉండడం కలకలం రేపుతోంది. ప్రభుత్వాలు వీటిపై కఠినంగా ఉండాలని చెబుతున్నా.. యాప్ ల ఆగడాలు ఆగడం లేదు. మరోవైపు ఇంత జరుగుతున్నా ఆన్ లైన్ లోన్లు తీసుకున్న వారు కూడా పెరుగుతూనే ఉన్నారు. ఎందుకంటే ఎలాంటి పేపర్ వర్క్ ఉండదు, సిబిల్ స్కోర్ అవసరం లేదు, అసలు ఫిజికల్‌గా కావాల్సిన అవసరమే ఉండదు.. కేవలం స్మార్ట్‌ఫోన్ (Smart Phone) లో ఓ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు పదంటే పది నిమిషాల్లో అకౌంట్‌లోకి డబ్బులు వచ్చి పడతాయి. తిరిగి చెల్లించే సమయంలో నరకం అంటే ఏంటో ప్రత్యక్షంగా చూపిస్తారు. ఇదీ మాయదారి లోన్ యాప్‌ల దందా. వడ్డీకి చక్ర వడ్డీ వేసి తీసుకున్న అప్పు కంటే రెట్టింపు మొత్తాన్ని వసూలు చేస్తూ మనుషుల ప్రాణాలను పీక్కు తింటున్నారు.
ఏదైనా సమస్య వచ్చి.. పొరపాటున అప్పులు చెల్లించడంలో ఆలస్యమైందా ఇక అంతే పని.. లోన్ తీసుకున్న వారికే కాదు.. వారి కుటుంబ సభ్యులకు.. స్నేహితులకు కూడా మార్ఫింగ్ ఫొటోలు అసభ్యకరమైన సందేశాలు పంపిస్తూ టార్చర్ పెడతారు. దీతో ఇలాంటి ఈ టార్చర్ భరించలేక ఇటీవల చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ఇలాంటి ఓ హృదయవిదారకర సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాలలో చోటు చేసుకుంది. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక వీరేంద్ర అనే బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకొని తనువు చాలించాడు. బాలాజి కాంప్లెక్స్‌లో నివాసం ఉండే వీరేంద్ర బెంగళూరులో ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు.
ఇటీవల అవసరం ఉందని ఇటీవల ఓ యాప్ నుంచి లోన్ తీసుకున్నాడు. తిరిగి చెల్లించడంలో ఆలస్యం కావడంతో నిర్వాహకులు టార్చర్ పెట్టడం ప్రారంభించారు. తీసుకున్న అప్పు చెల్లించాలి అంటూ బంధువులకు ఫ్రెండ్స్ కు యాప్ నుంచి ఫోన్ కాల్స్ చేశారు.
వీరేంద్ర ఫొటోను మార్ఫింగ్ చేసి.. ఈ వ్యక్తి తమ సంస్థలో లోన్ తీసుకొని చెల్లించలేదు. మీ నెంబర్‌ను రిఫరెన్స్‌గా ఇచ్చాడు. ఇప్పుడు మీరు లోన్‌ను తిరిగి చెల్లించాలి. లేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం.. అంటూ వీరేంద్ర స్నేహితులకు మెసేజ్‌లు పంపించారు. దీంతో అవమానంగా భావించిన వీరేంద్ర.. ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యాప్ వేధింపుల కారణంగానే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి : వైసీపీకి బిగ్ షాక్.. వాలంటీర్లను దూరం పెట్టాలని ఆదేశం
అయితే అక్కడితోనే లోన్ నిర్వాహకులు వేధింపులు ఆగలేదు. వేధింపులు భరించలేక కుమారుడు ఆత్మహత్య చేసుకుంటే, శవం తీయకముందే తల్లిదండ్రులకు ఫోన్‌చేసి వేధింపులకు దిగారు నిర్వాహకులు. చస్తే చావనీయండి.. మీరూ చావాండి.. కానీ లోన్ కట్టేశాక చావండి అంటూ డేర్‌గా చెబుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Crime news, Kurnool, Loan apps