Home /News /andhra-pradesh /

KURNOOL OFFICIALS CREATED THOUSANDS OF ACRES OF NON EXISTENT LAND IN ALUR KURNOOL DISTRICT AND REGISTERED ONLINE SNR

Kurnool:అక్కడ భూమే లేదు.. కాని ఉన్నట్లుగా పేపర్లు వాటికి ఓనర్లు ఉన్నారంటా..వామ్మో ఇదెక్కడి విచిత్రం

(భూ మాయ)

(భూ మాయ)

Land Mafia:లేని భూమిని ఉన్నట్లుగా సృష్టించారు. తప్పుడు సర్వే నెంబర్లు తయారు చేశారు. అనాధికార వ్యక్తులకు అప్పగించినట్లుగా పట్టదారు పుస్తకాలు సైతం పంపిణి చేసి భారీ కుంభకోణానికి పాల్పడ్డాడు.

భూమిని కబ్జా చేయడం చూశాం. లేదంటే తప్పుడు డాక్యుమెంట్లతో వేరే వ్యక్తుల పేర్లతో బదలాయించడం విన్నాం. కాని అసలు భూమే లేకుండా ధృవీకరణ పత్రాలు, ఆ భూమికి సంబంధించిన యజమానులు ఉన్నారంటే ఎంత ఆశ్చర్యం వేస్తుంది. ఆంధ్రప్రదేశ్ కర్నూలు( Kurnool)జిల్లాలో అలాంటి అడ్డగోలు అవినీతి బయటపడినట్లుగా ప్రముఖ టీవీ ఛానల్‌ వార్తను ప్రసారం చేసింది. ఆలూరు( Alur) నియోజకవర్గంలోని ఆలూరు తహసిల్ధార్ కార్యాలయం అధికారులు వెలగబెట్టిన ఘనకార్యం ఇది. మండలంలో లేని భూమిని ఉన్నట్లుగా ఆన్‌లైన్‌లో సృష్టించారు. అది కూడా ఒకటి రెండు ఎకరాలు కాదు ఐదు వేల ఎకరాలు. ఎకరాకు 10వేల చొప్పున పట్టాదారు పుస్తకాల్ని ఇచ్చి ఆన్‌లైన్‌(Online)లో అనాధికార వ్యక్తుల పేర్లతో నమోదు చేశారనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలోని ఉరవకొండ(Uravakonda)కు చెందిన సీతా హరీష్‌బాబు(Harishbabu)కు ఆలూరు మండలం మొలగవల్లి (Molagapalli)గ్రామంలో సర్వే నెంబర్ 864/ఎఫ్‌లో 9.80ఎకరాలు సర్వే నెంబర్ 894/డిలో 15.20ఎకరాలతో కలిపి మొత్తం 25ఎకరాల భూమిని అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. అదే సర్వే నెంబర్‌లో ఉరవకొండకు సిరిమల్లె శ్రీనివాసు(Sirimalle Srinivas)లు అనే మరో వ్యక్తికి 25ఎకరాల భూమి ఉన్నట్లుగా ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఈ భూమి అంతా వంశపారంపర్యంగా సంక్రమించినట్లుగా రెవెన్యూ అధికారులు పక్కాగా భూమి లెక్కలు తయారు చేశారు. అయితే విచిత్రం ఏమిటంటే ఆ సర్వే పేర్లతో అసలు భూమి లేదు. లేని భూమికి సర్వే నెంబర్‌లు, దానికి హక్కుదారులను పుట్టించి..ఏకంగా ఆన్‌లైన్‌లో రికార్డ్ చేసి వారికి పట్టాదారు పుస్తకాలను కూడా పంపిణి చేశారని టీవీ ఛానల్ ప్రసారం చేసిన కథనంలో తెలిపింది. అయితే దీనిపై ఆలూరు తహసిల్దార్‌ కార్యాలయం ఉద్యోగులు మాత్రం సమర్దించుకుంటున్నారు. ఎఫ్ ప్లేసులో డీ అని ఉందని..అది చూసుకోలేదని మిగిలినదంతా కరెక్ట్‌గానే ఉందంటున్నారు.

భూ మాయ..
ఒక్క ఆలూరులోనే కాదు హత్ధిబేలగల్‌లో వెయ్యి ఎకరాల భూమికి రికార్డులు సృష్టించి ఆన్‌లైన్‌ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మండలంలో ఐదు వేల ఎకరాలకుపైగానే ఈవిధంగానే లేని భూమిని సృష్టించి పట్టాదారు పుస్తకాలు సృష్టించి ఆన్‌లైన్‌లో నమోదు చేశారట అధికారులు. ఈస్థాయిలో భూమాయ వెనుక చాలా మంది హస్తమే ఉన్నట్లుగా ప్రముఖ టీవీ ఛానల్ ప్రత్యేక కథనంలో వెల్లడించింది. తహసిల్ధార్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులతో పాటు దళారులు పాత్ర ఇందులో ఉందని తెలుస్తోంది. ర్నూలులోని ఓ హోటల్‌లో ఈ భూ పందారంపై డీల్స్‌ కుదుర్చుకుంటున్నారని ఓ టీవీ మీడియాలో కథనాలు వచ్చాయి. ఎకరాకు పది వేల రూపాయల చొప్పున తీసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. లేని భూమిని ఉన్నట్లుగా చూపేందుకు ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకే ఐదు వేల ఎకరాలకు ఐదు కోట్లు రూపాయలు చేతులు మారాయని ఎన్‌టీవీ ఓ కథనలో స్పష్టంగా చెప్పింది. ఆలూరు తహసిల్దార్ కార్యాలయంలో అక్రమాల ఆరోపణలు రావడంతో ఇన్‌చార్జ్ ఆర్డీవో మోహన్‌దాస్ ప్రాధమికంగా విచారణ జరిపారు. ప్రస్తుతానికి ఎవరిపైనా ఎలాంచి చర్యలు తీసుకోలేదు.

అధికారులే అక్రమార్కులా..
ఆలూరు మండలంలో భూ మాయపై ఉన్నతస్థాయి విచారణ జరిపితే తప్ప వాస్తవాలు బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. లేని భూమిని ఉన్నట్లుగా సర్వే నెంబర్లు సృష్టించి వాటికి పట్టాదారు పుస్తకాలు తయారు చేయడం ఎంత వరకు వాస్తవం? ఇందులో ఎంత మంది పాత్ర ఉంది ? ఎవరెవరికి ఈ అక్రమాల్లో వాటాలు అందాయి? అసలు ఈ వ్యవహారంలో వెనుకుండి నడిపిస్తున్న పెద్ద తలకాయ ఎవరనేది ? బయటపడాలంటే ఖచ్చితంగా ఉన్నతస్థాయి విచారణ జరపాలనే డిమాండ్‌లు స్థానికుల నుంచి వస్తున్నాయి.
Published by:Siva Nanduri
First published:

Tags: Andhra Pradesh, Kurnool, Land scam

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు