Murali Krishna, News18, Kurnool.
సాధారణంగా గ్రామ సర్పంచ్ (Village Sarpanch) అంటే.. దేశానికి రాష్ట్రపతి ప్రథమ పౌరుడు అయితే.. గ్రామానికి సర్పంచ్ తొలి పౌరుడు.. అందుకే ఆ గ్రామంలో ఏది జరగాలన్నా సర్పంచ్ చేతుల మీదుగానే జరుగుతుంది. కానీ అలాంటి సర్పంచ్ లు ఇప్పుడు.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వం (State Government) నుంచి రావాల్సిన నిధులు అందక పోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిధులు లేక చాలా గ్రామాల్లో చేయాల్సిన పనులు అన్ని ఆగిపోతున్నాయి. చెత్త ఎత్తేవాళ్లకు, రోడ్లు ఊడ్చేవాళ్లకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఏం చేయాలో తెలియక ఓ ఊరి సర్పంచ్ చీపురు పట్టారు.
గ్రామంలోని రోడ్లన్నీ ఊడ్చి… చెత్తను ఎత్తారు. అంతేకాదు చెత్త ఎత్తడానికి కూడా రిక్షాను ఆమె ఇంటింటికి తీసుకెళ్లారు. దీంతో ఆమె రోడ్లు ఊడ్చుతున్న ఫొటోలు నెట్టింట వైరల్ (Viral Video) అవడంతో ఒక్కసారిగా ఆ ఊరి సమస్య అందరికి తెలిసింది. ఇప్పుడు అందరూ ఆ ఊరి గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఆ ఊరు ఎక్కడుందంటే..?
కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గ కేంద్రంలో మేజర్ గ్రామ పంచాయితీ సర్పంచ్ వినూత్నంగా ప్రభుత్వానికి తన నిరసన గళాన్ని వినిపించారు. విభిన్న రితీలో నిరసన చేపట్టి గ్రామ ప్రజలతోపాటు నియోజకవర్గ అధికారుల దృష్టిని ఆమె ఆకర్షించారు. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కావాల్సిన నిధులు లేకపోవడంతో ఇలా నిరసన వ్యక్తం చేయడం మినహా మరో దారి కనిపించలేదని విచారం వ్యక్తం చేశారు ఆ మహిళా సర్పంచ్.
ఇదీ చదవండి : మాజీ ఎంపీ.. బీజేపీ నేత అరెస్ట్.. కారణం ఏంటో తెలుసా..?
వివరాల్లోకి వెళితే.. ఆలూరు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా అరుణ దేవి భాద్యతలు నిర్వహిస్తున్నారు. తమ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎన్నికల సమయంలో గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అయితే, అందుకు ప్రభుత్వం నుంచి ఆర్థికంగా మద్ధతు లభించకపోవడంతో ఏ ఒక్క పని చేయలేకపోయారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా ప్రయోజనం లేకపోయింది.
ఇదీ చదవండి: తనిఖీల్లో భాగంగా ఆటోను ఆపిన పోలీసులు..! తీరా అందులో ఉన్నది చూసి షాక్..!
దాంతో ప్రభుత్వానికి, అధికారులకు తన నిరసన గళాన్ని వినిపించాలని నిర్ణయించుకున్నారు. గ్రామంలోని ప్రధాన వీధుల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని సేకరించే కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన చెత్త సేకరణ రిక్షాను నడిపిస్తూ,విజిల్ ఊదుకుంటూ ప్రధాన రహదారుల వెంట తిరిగారు. సర్పంచి చెత్త సేకరిస్తున్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు మొదట ఆశ్చర్యపోయినా తర్వాత తేరుకుని ఆమెను అభినందించారు.
కేంద్ర ప్రభుత్వం 14,15 ఆర్థిక సంఘాల నిధులను రాష్ట్ర ప్రభుత్వం అక్రమ మార్గంలో తీసుకున్నదని సర్పంచ్ అరుణ దేవి ఆవేదన వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య కార్మికులు వేతనాలు, విద్యుత్ బిల్లుల చెల్లింపులు, త్రాగు నీటి సరఫరా నిర్వహణ, వంటి వాటికి డబ్బులు ఎక్కడ నుంచి తీసుకురావాలని ప్రశ్నించారు.
ఇదీ చదవండి : మూడు రాజధానులంటే ఒప్పుకోం.. ఏపీ సర్కార్ కు కేంద్రం షాక్..? ఎందుకో తెలుసా..?
ఇప్పట్టికే పారిశుద్య కార్మికులకు ఆరు నెలలుగా వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయన్నాని, దీంతో పారిశుద్ధ్య కార్మికులు పనులకు రావడంలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వీధుల్లో విద్యుత్ దీపాలను కొనేందుకు నిధులు లేకపోవడంతో పాత వాటిని రిపేర్ చేయిస్తున్నట్లు సర్పంచ్ అరుణదేవి తెలిపారు. ఈ నిరసన గళంలో సర్పంచ్ భర్త, టిడిపి నాయకులు బెంగళూరు కిషోర్ కూడా ఆమెకు తోడుగా నిలిచారు. ఇకనైనా ప్రభుత్వం తమ సమస్యలను గుర్తించి నిధులు ఇవ్వాలని సర్పంచ్ అరుణదేవి విజ్ఞప్తి చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap government, AP News, Kurnool, Local News