Murali Krishna, News18, Kurnool
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టుల్లో చెకింగ్ కొరకు నియమించిన స్పెషల్ పోలీస్ ఆఫీసర్లను నంద్యాల జిల్లా (Nandyal District) పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర సరిహద్దుల్లో అక్రమ మద్యం, నాటు సారా గంజాయి రవాణా చేసే వారిని పట్టుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన స్పెషల్ పోలీస్ ఆఫీసర్లను నంద్యాల జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐతే పోలీసులను పోలీసులు అరెస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే.. సరిహద్దు ప్రాంతాల్లో ఇసుక రవాణాను అడ్డుకునేందుకు చెక్ పోస్టులు, మొబైల్ యూనిట్లలో పనిచేయడానికి ప్రత్యేక పోలీస్ అధికారుల నియమకానికి రాష్ట్ర ప్రభుత్వం 2020లో చర్యలు చేపట్టింది. వారి అవసరం తీరిందని ప్రత్యేక జీవో విడుదల చేసి వారిని ఉద్యోగాల నుంచి తొలగించింది.
దీంతో వారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి తమ సమస్యలను చెప్పాలని అనంతపురం జిల్లా నుంచి 60 మందికి పైగా ఎస్పిఓలు మంగళవారం విజయవాడకు బయలుదేరారు. వీరిపై ప్రత్యేకంగా ఉంచిన పోలీసులు రైలు మార్గంలో వెళ్తున్న వారిని అనంతపురం పోలీసులు అనుసరించారు.
దాదాపుగా 60 మందిలో 50 మందిని గుర్తించి నంద్యాల రైల్వే స్టేషన్లో వారిని అదుపులోకి తీసుకున్నారు. విజయవాడకు బయలుదేరిన వారిని రైల్వే స్టేషన్లో రైలు నుంచి బయటకు దింపి నంద్యాల పట్టణంలోని ఒక కళ్యాణ మండపానికితరలించారు. అదుపులోకి తీసుకున్న వారిని ఉదయం నుంచి మూడు గంటల వరకు ఉంచి తిరిగి వెనక్కి పంపించారు. దీంతో బాధితులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
దొంగలను పట్టుకున్నట్లు తమను అదుపులోకి తీసుకోవడం చాలా బాధాకరమని బాధితులు వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు గత 11 నెలలుగా జీతాలు ఇవ్వకపోయినా కష్టపడి పని చేసామని ఇప్పుడు ఉన్నఫలంగా తమకు రావాల్సినటువంటి బకాయిలను చెల్లించి ఎటువంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేయకుండా తమను విధుల్లో నుంచి తొలగిస్తున్నట్లు జీవో జారీ చేయడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికిప్పుడు ఉన్నఫలంగా తమను విధుల్లో నుంచి తొలగిస్తే తమ కుటుంబాలతో సహా రోడ్డున పడాల్సి వస్తుందని ఆందోళన చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News