ఎక్కడైనా మంట అంటుకుంటే వాటిపై నీళ్లు చల్లితే చాలు ఆరిపోతుంది. పరిశ్రమలు, సినిమాహాళ్లు, షాపింగ్ మాల్స్, కొన్న ప్రదేశాల్లో మాత్రం సమయానికి నీళ్లు అందుబాటులో లేకపోతే మంటలార్పే గ్యాస్ అందుబాటులోకి ఉంటుంది. హోటళ్లు, మాల్స్ వంటి కమర్షియల్ ప్లేసుల్లో మంటలార్పేందుకు ఫైర్ రెసిస్టెంట్ సిస్టమ్ ఉంటుంది. మంట ఎలా వచ్చినా దానిని నీళ్లతోనో, గ్యాస్ తోనో అరికట్టవచ్చు. కానీ ఓ ఊళ్లో మాత్రం విచిత్రం చోటు చేసుకుంది. మిస్టరీ మంటలు స్థానికులను వణికిస్తున్నాయి. ఇది దైవమని కొందరంటుంటే.. కాదు దెయ్యమని మరికొందరు భయపెడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా కోడుమూరులోని 1వ వార్డులో ఖాజావలి అతని ఇద్దరు కొడుకులు మన్సూర్, ఖలీల్ నివాసముంటున్నారు. ముగ్గురుకీ మూడు వేర్వేరు ఇళ్లున్నాయి. గుజరీ వ్యాపారం చేస్తూ వీరు జీవనోపాధి పొందుతున్నారు. వీరి జీవితాలు సాఫీగానే సాగుతున్నాయి. ఇదిలా ఉంటే ఓ రోజు ఖాజావలి ఇంట్లో ఉన్నట్లుండి మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వాటిని ఆర్పేశారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఉంటాయని అంతా భావించారు. వెంటనే సర్వీస్ వైర్ కూడా కట్ చేశారు. ఐతే ఆరిపోయిన మంటలు కొద్దిసేపటికే మళ్లీ చెలరేగాయి. వెంటనే అప్రమత్తమై ఇంట్లో సామాగ్రిని బయటపడేసేందుకు యత్నించారు. ఈలోగా దుస్తులు, వంట సామాగ్రి కాలి బూడిదయ్యాయి. ఇక్కడ మంటలు ఆర్పే లోపు మరో ఇంట్లో మంటలు రేగాయి. అక్కడ అదుపు చేసేలోగా మరో కొడుకు ఖలీల్ ఇంట్లో అగ్గిరాజుకుంది. దీంతో అందరూ ఆ ఇంట్లోకి పరుగుపెట్టి మంటలు అదుపుచేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ మూడు ఇళ్లలోనే మంటలు రేగడంతో ఆ కుటుంబమంతా భయంతో వణికిపోయింది. ఒక ఇంట్లో మంటలార్పితే మరో ఇంట్లో చెలరేగుతున్నాయి. ఇక్కడ మంటలు ఎందుకు వస్తున్నాయో అర్ధం కావడం లేదని చెప్తున్నారు.
గతంలో తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలోని ఓ తండాలో ఇలాగే మంటలు చెలరేగాయి. నల్లగొండ జిల్లా చందంపేట మండలంలో ఉన్న పాతుర్ తండాలోనూ వింత మంటలు కలకలం రేపాయి. గ్రామాల్లోని ఇళ్లలో దుస్తులు, గడ్డివాములు, ధాన్యం బస్తాలు ఇలా అన్ని తగలబడ్డాయి. గ్రామంలో ఎక్కడో ఓ చోట నిత్యం అగ్గి పుట్టడంతో స్థానికులు హడలిపోయారు. కొందరు ఊరు వదిలి వెళ్లిపోయారు. ఇప్పటికీ ఆ మంటల మిస్టరీ వీడలేదు. మరి ఈ ఇళ్లలో మంటలు రేగడానికి కారణాలేమై ఉంటాయో తేలాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Fire Accident, Kurnool