jMurali Krishna, News18, Kurnool.
కర్నూలు జిల్లా (Kurnool District) దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామం. ఒకప్పుడు ఈ గ్రామం ఫ్యాక్షన్‌కి కేరాఫ్ అడ్రస్. గ్రామంలోని ప్రజలు పగా ప్రతీకారాలు అంటూ కత్తులు, వేట కొడవళ్ళు, బాంబులతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేవారు. వారి ఫ్యాక్షన్ కక్షలతో గ్రామంలో రక్తం ఏరులైపారింది. ఫ్యాక్షన్ కక్షలకు కనీసం ఒకరిని పోగొట్టుకున్న కుటుంబాలు ఆ గ్రామంలో ఉన్నాయంటే పరిస్థితి ఎలాంటిదో అర్ధం చేసుకోవాలి. అలా కప్పట్రాళ్ల గ్రామం రాయలసీమ ప్రాంతంలోనే ఫ్యాక్షనిజానికి కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారింది. ఎప్పుడు మనుషులు పగప్రతీకారం అంటూ తిరిగే ఆగ్రామంలో ఇప్పుడు అభివృద్ధి పరుగులు పెడుతుంది. అర్ధంపర్ధం లేని ఫ్యాక్షనిజాన్ని పక్కనబెట్టిన గ్రామస్థులు పంటలు పండించుకుంటూ, కులమతాలకు అతీతంగా అందరికీ ఆదర్శంగా జీవిస్తున్నారు.
జిల్లా ఎస్పీ చొరవతో మారిన పరిస్థితులు:
పగప్రతీకారంతో రగిలిపోయే కప్పట్రాళ్ల గ్రామంలో ఇప్పుడు శాంతి మంత్రం వినిపిస్తుంది. ప్రజలు అన్ని వైషమ్యాలను పక్కనబెట్టి తమ పని తాము చేసుకుంటున్నారు. గ్రామంలో ఈ పరిస్థితికి కారణం ఒక పోలీస్ అధికారి. 2015లో అప్పటి జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ... గ్రామంలో ఫ్యాక్షనిజాన్ని అంతం చేసి ఫ్యాక్షన్ అనే పదం లేకుండా చేసి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లారు. అంతేకాదు కప్పట్రాళ్ల గ్రామాన్ని ఆయన దత్తత తీసుకున్నారు.
మహిళలకు ఉపాధి శిక్షణ, మార్కెటింగ్ తరగతులు: ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు సహకారంతో కప్పట్రాళ్ల గ్రామంలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్రాంచ్‌ను ఏర్పాటు చేశారు. గ్రామంలోని మహిళ కోసం పొదుపు సంఘాలు ఏర్పాటు చేసి వారికి ఉపాధి శిక్షణ ఏర్పాటు చేశారు. ఇందుకోసం గ్రామంలో ప్రత్యేకంగా ఒక భవనాన్ని నిర్మించి మహిళలు అక్కడే తమ ఉత్పత్తులు తయారు చేసి సొంతంగా మార్కెటింగ్ చేసుకునేలా వారికి ఒక దారి చూపించారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి గ్రామాన్ని జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దారు అప్పటి జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ. కప్పట్రాళ్ల గ్రామాన్ని దత్తత తీసుకున్న నాటి నుంచి తన కుటుంబ సభ్యులతో సహా ప్రతి సంక్రాంతికి గ్రామానికి వెళ్లి గ్రామ ప్రజలతో కలిసి పండుగను జరుపుకుంటారు.
అప్పటి జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ స్ఫూర్తితో గ్రామంలోని యువకులు, చిన్నారులు మంచి చదువులు చదువుకుంటూ ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారని, కప్పట్రాళ్ల గ్రామంలో మొత్తం 3000కు పైగా ఇళ్లు ఉండగా 5,500 మంది జనాభా ఉన్నట్లు గ్రామ సర్పంచ్ చెన్నమ్ నాయుడు న్యూస్ 18తో చెప్పుకొచ్చారు. కప్పట్రాళ్ల గ్రామ సర్పంచ్ ఫోన్: 9515376722.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Kurnool, Local News