GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18
Marriage Stopped in Last minute: పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అని అంటారు. అందుకే పంచభూతాలు సాక్షిగా వధూవరులను ఒక్కటి చేస్తారు. ఎంతో వైభవంగా వివాహ వేడుకల్ని జరుపుతుంటారు. బంధు మిత్రులను ఆహ్వానించి వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. పెళ్ళికిముందు బోలెడు సాంప్రదాయాలుంటాయి. నిశ్చతార్ధం నుంచి శుభలేఖల పంపకం, పెళ్లి దుస్తుల షాపింగ్ ఇలా చాలా పనులుంటాయి. ఒక్కసారి లగ్నం కుదిరితేచాలు ఈ పనులన్నీ చకచకా జరిగిపోతాయి. అలా ఓ పెళ్లికి అన్ని పనులు పూర్తయ్యాయి. పెళ్లి రోజు రానే వచ్చింది. ముహూర్తానికి టైమ్ ఉండటంతో ముందుగా రిసెప్షన్ జరపాలని అంతా భావించారు. వధువు తరపువారు అమ్మాయిని సిద్ధం చేసి కల్యాణ మండపానికి తీసుకొచ్చారు. వరుడు రావడమే తరువాయి. పెళ్లికొడుకు కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ఇంతలో అమ్మాయి ఫోన్ మోగింది. అంతే పెళ్లి అర్ధాంతరంగా నిలిచిపోయింది. సినిమా స్టైల్లో ఆగిన ఈ పెళ్లి కర్నూలు జిల్లాల్లో జరగాల్సి ఉంది.
వివరాల్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఓ యువతికి... చిత్తూరుకు చెందిన యువకునికి పెద్దలు పెళ్లి నిశ్చయించారు. పెళ్లి చూపులోనే ఇద్దరి మనసులు కలవడంతో ఇరుకుంటుంబాల వారు వివాహ తేదీని ఖరారు చేశారు. శభలేఖలు సిద్ధం చేసి బంధు మిత్రులను ఆహ్వానించారు. పెళ్లిరోజు రానే వచ్చింది. కల్యాణ మండపం సిద్ధమైంది. భోజనాలకి వంటలు కూడా రెడీ అయిపోయాయి.
ఇంటి వద్ద నలుగు సంప్రదాయాలు పూర్తి చేసుకొన్న అమ్మాయి.. బంధువులతో కలిసి మండపానికి చేరుకుంది. అబ్బాయి తరపువారు కూడా అక్కడికి చేరుకున్నారు. వరుడు రాకకోసం ఎదురుచూస్తుండగా.. ఇంతలో పెళ్లికూతురి ఫోన్ రింగ్ అయింది. తనకు కాబోయే భర్త నుంచి ఫోన్ రావడంతో అతృతగా లిఫ్ట్ చేసిన ఆమె.. ఏమండీ ఎక్కడ ఉన్నారు అని ప్రశ్నించింది. ఇంతలో వరుడు నీళ్లునములుతూ ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. టెన్షన్ తో ఉన్న ఆమె ఏం జరిగిందటని గట్టిగా నిలదీసింది. దీంతో అతడు చెప్పిన సమాధానంతో కన్నీళ్లు పెట్టుకుంటూ కుప్పకూలిపోయింది. వెంటనే యువతిని పట్టుకున్న ఆమె తల్లిదండ్రులు ఏం జరిగిందని ప్రశ్నించగా.. అబ్బాయి తల్లికి కరోనా పాజిటివ్ వచ్చిందని.. అందుకే పెళ్లిని వాయిదా వేసుకుందాని చెప్పినట్లు వివరించింది.
అంతా సిద్ధం చేసుకోని కాసేపట్లో పెళ్లనగా కరోనా మహమ్మారి వారి ఆశలపై నీళ్లు చల్లింది. ఎన్నో కలలతో ఊహించుకున్న కొత్త జీవితం రెండు అడుగుల దూరంలో నిలిచిపోయింది. వధూవరుల దగ్గర నుంచి పురోహితుడు, బంధువులు ఇలా ప్రతి ఒక్కరినీ కరోనా వైరస్ షాక్ కు గురిచేసింది. కరోనా కారణంగా ప్రపంచ దేశాలే స్తంభించిపోయాయి. ఈ పెళ్లి ఒక లెక్కా అని అందరూ అనుకున్నా.. వధువరుల జీవితంలో మాత్రం ఇది షాకింగ్ ఘటనే. లక్షలు ఖర్చుచేసి పెళ్లి ఏర్పాట్లు చేస్తే ఇలా జరిగిందేమిటని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Corona positive, Kurnool, Marriage