GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18
Gold Loan Fraud: సాదరణంగా మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు డబ్బులు అవసరమైనప్పుడు తమ దగ్గరున్న బంగారు ఆభరణాలను తాకట్టు తాకట్టుపెట్టు పెడుతుంటారు. ఇక బయట మార్వాడీ వద్ద కుదవ బెడితే అధిక వడ్డీలు తీసుకుంటూ ఉంటారు. అందుకే ప్రజలు బంగారు తాకట్టు ప్రభుత్వ రంగ బ్యాంకులలో తాకట్టుపెడుతుంటారు. ప్రభుత్వ బ్యాంకుల్లో 60 పైసల నుంచి 80 పైసల వరకు వడ్డీ ఉంటుంది. దీంతో ఆ మధ్య తరగతి కుటుంబంపై భారం తగ్గుతుంది. అందుకే నగల తాకట్టు బ్యాంకులలో పెట్టేందుకె మొగ్గు చూపుతున్నారు. ఇదే అదునుగా చేసుకొని బ్యాంకులో కొందరు మాయగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. చేతివాటం చూపించడంలో ఇంటి దొంగలు ముందు ఉన్నారు. తాకట్టు పెట్టిన ఆభరణాలను మాయం చేసి.., నకిలీ ఆభరణాలు కస్టమర్లకు ఇచ్చారు. దీంతో షాక్ తిన్న కస్టమర్ పోలీసులను ఆశ్రయించిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే... కర్నూలు జిల్లాలోని ఆదోని కేడీసీసీ బ్యాంకు తనఖా పెట్టిన బంగారు ఆభరణాలకు బదులుగా నకిలీ బంగారు అందించారు బ్యాంకు అధికారులు. అంబేద్కర్ నగర్ కు చెందిన తిరుపతి ప్రమోద్ కుమార్ అనే వ్యక్తి అత్యవసరాల రీత్యా 2019 డిసెంబరులో 35.81 తులాల బంగారు ఆభరణాలు బ్యాంకులో తనఖా పెట్టారు. తాకట్టు పెట్టిన నగల ద్వారా రూ.4,98,600 రుణం తీసుకున్నారు. కరోనా ఉపదృవం కారణంగా వడ్డీని సరిగా చెల్లించలేకపోయారు. దీంతో అతను రుణం సరిగా చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేసి నగలను వేలం వేస్తానని హెచ్చరించారు.
దీంతో వరుసకు బావైన రమేష్ తో కలసి గురువారం బ్యాంకుకు వెళ్లిన ప్రమోద్ కుమార్ వడ్డీతో కలిసి రూ.6,02,401 చెల్లించారు. బ్యాంక్ సిబ్బంది మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఆభరణాలు తన చేతికి ఇచ్చారు. బంగారు ఆభరణాలు తేడాగా ఉండటంతో ప్రమోద్ కు అనుమానం రావడంతో నేరుగా షరాఫ్ బజారుకు వెళ్ళాడు. అక్కడ ఉన్న బంగారు దుకాణంలో బంగారు ఆభరణాన్ని తనిఖీ చేయించగా నకలీగా తేలింది. దీంతో ప్రమోద్ కుమార్ బ్యాంకు అధికారులను సంప్రదించాడు.
ఐతే తమకేం సంబంధం లేదని చెప్పారు. మేనేజరు మహబూబ్ బాషా మాత్రం నగలను సరిచూసుకున్నా ఖాతాదారు అనంతరం పుస్తకంలో సంతకం చేసి వెళ్లారని చెప్పారు. 3.30 గంటల సమయంలో బ్యాంకుకు తిరిగి వచ్చి ఫిర్యాదు చేశారన్నారు. ఈ విషయంలో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. బ్యాంక్ అధికారులు సేమిరా అనడంతో రాత్రి 8 గంటల ప్రాంతంలో ప్రమోద్ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్కువ వడ్డీతో పాటు బంగారానికి భద్రత కల్పిస్తారని బ్యాంకులో తనఖా పెడితే ఇలా చేశారని ప్రమోద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పోలీసులు బ్యాంక్ సిబ్బందిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Gold fraud, Gold loans, Kurnool